కాకి లెక్కల వల్లే ప్రాజెక్టులకు ముప్పు

  • గేజింగ్ స్టేషన్లు, సెన్సార్లు లేకపోవడమే కారణం
  • సీడబ్ల్యూసీ రిపోర్ట్​తో బయటపడ్డ నిజం
  • వరద ఉధృతిని నిర్ధారించలేకపోతున్న ఆఫీసర్లు
  • ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్​ ప్రాజెక్టులు

ఈ ఏడాది జూలైలో కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఒక దశలో కట్ట తెగిపోతుందనే భయాందోళన వ్యక్తమైంది. ఆలస్యంగా తేరుకున్న ఆఫీసర్లు17 గేట్లెత్తినా గరిష్ఠంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు వెళ్లింది. ఏకంగా కట్ట మీది నుంచి నీళ్లు పొంగిపొర్లడంతో 13 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. జూలై12 రాత్రి ఏ క్షణం ప్రాజెక్టు కొట్టుకపోతుందో అనే ఆందోళనతో  ప్రాజెక్టు ఆఫీసర్లకు, సర్కారుకు, సామాన్య జనానికి కంటి మీద కునుకు కరువైంది.  పై నుంచి ఎంత ఫ్లడ్​ వస్తుందో తెలుసుకునే టెక్నాలజీ లేకపోవడం వల్లే  ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందని తాజాగా సీడబ్ల్యూసీ రిపోర్ట్​తో బయటపడింది. ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కడెం, స్వర్ణ సహా అన్ని ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద అంచనా కోసం గేజింగ్ స్టేషన్లు, సెన్సార్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది.

నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతం నుంచి ఎంతమేరకు నీరు వస్తోందనే విషయమై సరైన లెక్కలు లేకుండా పోయాయి. ప్రవాహ తీవ్రత ఆధారంగానే ఇన్​ఫ్లో లెక్క కట్టాల్సి వస్తోందని ఆఫీసర్లు అంటున్నారు. మొన్నటి వరదల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వచ్చిన వరద ప్రవాహం లెక్కలు ఇరిగేషన్ శాఖలో చర్చనీయాంశమవుతున్నాయి.  స్థానిక ఇరిగేషన్ అధికారుల అంచనాకు మించి జూలై  12 న 4.94లక్షలు(సుమారు 5 లక్షల) వరద ప్రవాహం వచ్చిందని సీడబ్ల్యూసీ తాజాగా రిపోర్ట్​ ఇచ్చింది. కాగా, ఆ స్థాయి ప్రవాహాన్ని ఆఫీసర్లు అంచనా వేయకపోవడం వల్లే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

నిజానికి ఆ రోజు ప్రాణం మీదికి వచ్చాకే ఆఫీసర్లు మాట మార్చారు. పై నుంచి ఒక్కసారిగా  6 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. కానీ ఇవన్నీ కాకిలెక్కలేనని అర్థమవుతోంది. ముందే ఇన్​ఫ్లో అంచనా వేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారేది కాదు. కడెం ప్రాజెక్టు ఎగువ భాగాన రేయిన్ గేజ్ స్టేషన్లు ఉన్నప్పటికీ.. ఈ స్టేషన్లను కడెం ప్రాజెక్టుకు అనుసంధానం చేయకపోవడంతో ఎంతమేర వర్షం కురుస్తోంది, దానికి అనుగుణంగా ఎంతమేర వరద ప్రాజెక్టులోకి వస్తోందనే సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారుతోంది.

అలాగే స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టుల ఇన్​ఫ్లో విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద ప్రవాహం లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. భారీ వర్షాల సమయంలో సంబంధిత ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దనే ఉండి వరద ఉద్ధృతిని ఊహించుకొని దిగువకు నీళ్లు విడుదల చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ రెండు ప్రాజెక్టుల ఎగువ భాగాన రెయిన్ గేజ్ స్టేషన్లు, సెన్సార్లు లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. 
పేరుకుపోయిన పూడిక
ప్రాజెక్టు రిజర్వాయర్లలో పెద్దఎత్తున పూడిక చేరుకోవడంతో నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతోంది. ప్రాజెక్టుల్లో ఎంతమేర పూడిక చేరుకుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గరిష్ఠ, కనిష్ఠ నీటిమట్టాల మధ్య తేడా వస్తోంది. దీంతో వరద ప్రవాహం వస్తున్నపుడు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహంపై స్పష్టత లేకుండా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ కూడా ఇలాగే నీట మునిగింది. స్వర్ణ ప్రాజెక్టుకు వరద పోటు తీవ్రమవడంతో ప్రవాహ ఉద్ధృతి తెలియక ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.

దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే కడెం, గడ్డన్న వాగు ప్రాజెక్టులకు కూడా ఇలాగే వరద ప్రవాహం పెరగడంతో ఒకేసారి నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  దాదాపు రూ. 5 కోట్ల విలువైన విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలమట్టమయ్యాయి. పూడిక కారణంగా నీటిమట్టాల లెక్కలు సక్రమంగా తెలియక  కాలువలకు నీటి విడుదల విషయంలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.