- సర్కార్ జీవోను పట్టించుకోని మాల్స్, మల్టీప్లెక్స్‌లు
- సిటీలో వెహికల్స్ పార్కింగ్‌కు ఫీజు వసూలు
- స్లిప్ లతో సిటిజన్స్ ట్విటర్లో బల్దియాకు కంప్లయింట్స్
- ఆఫీసుకు రావాలని సూచిస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: సిటీలో వెహికల్స్‌కు పార్కింగ్ ఫీజు తీసుకోవద్దనే ప్రభుత్వ జీవో ఉన్నా మాల్స్, మల్టీప్లెక్స్‌లు పాటించడంలేదు. ఫీజులను వసూలు చేస్తుండగా స్లిప్‌లను కొందరు సిటిజన్స్ బల్దియా సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ (సీఈసీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్డిజాస్టర్ మెనేజ్‌మెం ట్(ఈవీడీఎం) అకౌంట్లకు ట్విట్టర్లో పోస్ట్ చేసి కంప్లయింట్చేస్తున్నారు. ఈ నెలలో ట్విట్టర్ ద్వారా 40కి పైగా, మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్‌లైన్ నంబర్లకు మరో 50 వరకు అందాయి. కొన్నింటికి వెంటనే ఫైన్లు వేసిన బల్దియా అధికారులు మిగతా వాటిపై ఆఫీసుకు వచ్చి పూర్తి వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. సిటీలో సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టూ వీలర్ రూ.20, ఫోర్‌వీలర్ కు రూ.30 చొప్పున పార్కింగ్ ఫీజు వసూలుకు మాత్రమే గత నెల నుంచి ప్రభుత్వం పర్మిషన్ఇస్తూ జీవో ఇచ్చింది. దీని పేరుతో కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్‌తో పాటు సూపర్ మార్కెట్లు కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. మల్టీప్లెక్స్, మాల్స్‌లో పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని జీవోలో స్పష్టంగా ఉంది. దీన్ని పట్టించుకోకపోతుండడంతో సిటిజన్స్ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంప్లయింట్స్ ఇవే..
బల్దియాకు వస్తున్న కంప్లయింట్లలో ఎక్కువగా మాల్స్, మల్టీప్లెక్స్, హాస్పిటల్స్ కి సంబంధించినవే ఉంటున్నాయి. ఫోరం సుజనా మాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని సాయి కౌశిక్, బేగంపేట్ లైఫ్ స్టైల్ లో షాపింగ్ కి వెళితే ఫీజు వసూలు చేశారని ఆదిత్ కమల్ ట్విట్టర్లో బల్దియాకు ఫిర్యాదులు చేశారు. అయితే ఒరిజినల్ స్లిప్ తో బల్దియా ఆఫీసుకు వచ్చి కంప్లయింట్ చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు. అత్తాపూర్ మంత్ర మాల్ లో సినిమాకు వెళితే పార్కింగ్ ఫీజు తీసుకున్నారని చైతన్య టికెట్, పార్కింగ్ స్లిప్ లతో కంప్లయింట్ చేయగా బల్దియా అధికారులు ఆ మాల్కి రూ. 50 వేల ఫైన్ వేశారు. అదే మాల్ లోని మ్యాక్స్‌లో షాపింగ్ చేసేందుకు టూవీలర్‌పై వెళ్లిన వివేక్ వద్ద రూ. 20 పార్కింగ్ ఫీజు వసూలు చేశారని ట్విట్టర్లో స్లిప్, షాపింగ్ బిల్లుని పోస్ట్ చేసి కంప్లయింట్ చేశాడు. అపోలో హాస్పిటల్లోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేశారంటూ వికాస్ కంప్లయింట్ చేయగా పేషెంట్ బిల్లులతో పాటు పార్కింగ్ఒరిజినల్ స్లిప్‌తో కంప్లయింట్ చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు సమాధానం ఇచ్చారు. ఇలా పార్కింగ్‌కి సంబంధించి వివిధ రకాల కంప్లయింట్లు బల్దియా అధికారులకు వస్తూనే ఉన్నాయి.
వెంటనే కంప్లయింట్ చేయండి
సిటీలోని మాల్స్, మల్టీప్లెక్స్‌లో రూల్స్అతిక్రమించి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంటే వెంటనే కంప్లయింట్చేయాలని బల్దియా అధికారులు సూచించారు. ట్విట్టర్, బల్దియా యాప్‌తో పాటు హెల్ప్‌లైన్ 040 2111 1111, లేదంటే 100 కి కూడా కాల్చేసి కంప్లయింట్చేయొచ్చని సూచించారు.