బల్దియా స్పోర్ట్స్​ విభాగంలో కోచ్​ల కొరత

బల్దియా స్పోర్ట్స్​ విభాగంలో కోచ్​ల కొరత
  • మరో 134 మంది కోచ్​లు కావాలంటూ ప్రభుత్వానికి ప్రపోజల్స్
  • మూడుసార్లు​ పంపినా అనుమతివ్వని సర్కార్


హైదరాబాద్, వెలుగు: బల్దియా స్పోర్ట్స్​ విభాగంలో కోచ్​ల కొరత నెలకొంది. అంతర్జాతీయ క్రీడాకారులున్న సిటీలో క్రీడలకు శిక్షణ కొరవడింది. దీంతో ఆ ప్రభావం క్రీడాకారులపై పడుతోంది. గ్రేటర్​లో 521 ప్లే గ్రౌండ్స్​ఉన్నాయి. ఇందులో 97 గ్రౌండ్స్​లో 30 రకాల క్రీడలకు సంబంధించి జీహెచ్ఎంసీ శిక్షణ ఇస్తోంది. కానీ కోచ్​లు మాత్రం 77 మందే ఉన్నారు. అది కూడా పార్ట్ టైమ్ పద్ధతిలో పనిచేస్తున్న వారే. పేరొందిన క్రీడలకు కూడా కోచింగ్​ఇచ్చేవారు కరువయ్యారు. వలంటీర్లను తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ క్లారిటీ లేదు. 

నెరవేరని క్రీడాకారుల ఆశలు నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుంటున్న సిటీ యువత ఆయా ఆటల్లో రాణించి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నప్పటికీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఆడే సత్తా ఉన్నా మైదానాల కొరత, ఉన్న వాటిలో ఫెసిలిటీస్​లేకపోవడంతో ప్రతిభావంతులైన క్రీడాకారులు బయటకు రావడం లేదు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాల్సిన జీహెచ్‌‌‌‌ఎంసీ స్పోర్ట్ విభాగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో పాటు కోచ్​ల కొరత క్రీడాకారులపై తీవ్రంగా పడుతోంది. మొఘల్​పురా, షేక్​పేట, విక్టోరియా హోం, అంబర్ పేట వంటి ప్రధాన ప్లే గ్రౌండ్లలో కోచ్​లు ఉండట్లేదు. కోచ్​లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ మూడుసార్లు ప్రపోజల్స్ ​పంపింది. 134 మంది రెగ్యులర్ కోచ్​లు కావాలని కోరినప్పటికీ సర్కార్ నుంచి మాత్రం స్పందన లేదు. 

521 ప్లే గ్రౌండ్లలో సరిపడా లేని ట్రైనర్లు..

సిటీలో మొత్తం 521 ప్లే గ్రౌండ్స్​ఉన్నాయి. వీటిలో ఖైరతాబాద్ జోన్​లో 20, చార్మినార్ 31, ఎల్​బీనగర్ 10, సికింద్రాబాద్ 17, శేరిలింగంపల్లి, కూకట్‌‌‌‌పల్లి జోన్లలో 19 మొత్తంగా 97 క్రీడా మైదానాల్లో 30 రకాల క్రీడాలకు సంబంధించి జీహెచ్‌‌‌‌ఎంసీ క్రీడాకారులకు శిక్షణ ఇస్తోంది. వీటిల్లో కేవలం 77 మంది మాత్రమే కోచ్‌‌‌‌లు ఉన్నారు. వారు కూడా పార్ట్​ టైమ్​లోనే పనిచేస్తున్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ నుంచి క్రీడా ఇన్‌‌‌‌స్పెక్టర్లు, పీసీసీల పేరుతో ఇన్​చార్జ్​లు ఉన్నారే తప్ప పర్మినెంట్ కోచ్‌‌‌‌లను మాత్రం నేటికీ నియమించలేదు.

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంప్​లు..

క్రీడలపై స్టూడెంట్లు ఎక్కువ టైమ్ కేటాయించే సమ్మర్ వచ్చినా కోచ్​ల నియామకంపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడం లేదు. సమ్మర్​ క్యాంపులు ఏర్పాటు చేస్తామని బల్దియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, సరిపడా కోచ్​లు లేక ప్రతి ఏడాది అధికారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. హానరరీ కోచ్​లతోనే ఈ క్యాంపులను నెట్టుకొస్తున్నారు. కాగా కోచింగ్ ఇచ్చేందుకు హానరరీ కోచ్​లకు ఒక ట్రాక్ సూట్, ఒక టీషర్ట్, ఒక జత షూస్​ని మాత్రమే జీహెచ్ఎంసీ అందిస్తోంది. అయితే కోచ్​ల నియామకంలో వీరికి ప్రయారిటీ ఇస్తామని చెబుతున్నప్పటికీ.. అసలు నియామకమే చేపట్టడం లేదు. దీంతో వీరు ఇతర ఉద్యోగాల్లో చేరుతున్నారు. దీంతో ఈసారి హనరరీ కోచ్​లు ముందుకొచ్చేలా కనిపించడంలేదు.

ఓయూలో స్విమ్మింగ్ పూల్ రీ ఓపెన్

మూడేండ్ల తర్వాత ఉస్మానియా వర్సిటీలో స్విమ్మింగ్ పూల్ తిరిగి అందుబాటులోకి వచ్చింది.  కరోనా టైమ్​లో క్లోజ్ అయిన స్విమ్మింగ్ పూల్​ను సోమవారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, స్థానిక జనాల కోసం ఈ స్విమ్మింగ్ పూల్​ను అందుబాటులోకి తెచ్చామని.. ఆసక్తి ఉన్న వారు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లో సంప్రదించి అడ్మిషన్ పొందాలని సూచించారు. 

వెంటనే నియామకం చేపట్టాలి

కోచ్ లు​లేకుండా ఉత్తమ క్రీడాకారులు తయారు కాలేరు. జీహెచ్​ఎంసీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రౌండ్లు, క్రీడలకు సరిపడా కోచ్ లని వెంటనే నియమించాలె. సమ్మర్ క్యాంప్ మొదలయ్యేలోగా కోచ్ లను తీసుకోవాలె.  పరిస్థితి ఎప్పట్లాగే కొనసాగితే మంచి క్రీడాకారులు తయారు కావడం కష్టం.
- శివచంద్రగిరి, బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్