- ప్రస్తుతం 275 ఎకరాల్లో ఏర్పాటైన పార్క్
- రైతుల సాగులో 267 ఎకరాల అటవీ భూమి
- మొత్తం 542 ఎకరాల్లో అటవీ శాఖ భూముల నోటిఫై
- నెహ్రూ జూపార్క్ తరహాలో డెవలప్ మెంట్ కు ప్లాన్
- రైతులకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి కేటాయించే చాన్స్
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఆటంకాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తరహాలో ఈ పార్క్ ను తీర్చిదిద్దుతామని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి అటవీ జంతువులను తీసుకువచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. అయితే అటవీ శాఖకు చెందినవిగా నోటిఫై చేసిన భూములు రైతుల సాగులో ఉండడం సమస్యగా మారుతోంది.
దాదాపు 30 ఏండ్లకు పైగా స్థానికులు పంటలు సాగు చేసుకుంటున్న భూములను ఎలా స్వాధీనం చేసుకోవాలనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఆ రైతులకు కేటాయించే అంశంపై సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నారు. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మొత్తం 542 ఎకరాలు..
ఖమ్మం కొత్త కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో దాదాపు 542 ఎకరాల్లో వెలుగుమట్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చాలా ఏండ్లుగా ఆ భూమిని పట్టించుకోకపోవడంతో కబ్జాల పాలయ్యింది. 2015 నుంచి 2017 వరకు స్థానికుల కబ్జాలో ఉన్న 275 ఎకరాలను సేకరించి వెలుగుమట్ల అర్బన్ పార్క్ గా మార్చారు. అందులోనే 225 ఎకరాలకు చైన్ లింక్ తో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. క్రమంగా పార్క్ లో ప్లాంటేషన్ ను పెంచుతూ వస్తున్నారు. సఫారీ జీప్, సైక్లింగ్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, యోగా షెడ్, చిల్డ్రన్ పార్క్, వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు.
రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేసిన మిగిలిన భూములు ఇప్పటికీ పుట్టకోట, రుద్రమకోట, కొదుమూరుకు చెందిన 100 మంది రైతులు దాదాపు 30 ఏండ్లకు పైగా సాగులో ఉన్నారు. అందులో కొందరికి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అసైన్డ్ పట్టాలు ఉన్నట్టు చెబుతున్నారు. వాళ్లు ఇప్పుడు తమ ఆధీనంలోని భూములను వదులుకునేందుకు సిద్ధపడడం లేదు. పదేండ్ల కింద అటవీ శాఖ భూములను నోటిఫై చేసిన సమయంలో అసైన్డ్ పట్టాలన్నీ రద్దయ్యాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చాలా ఏండ్లుగా సాగు చేసుకోవడం, ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నందున వారికి ప్రత్యామ్నాయంగా వేరేచోట ప్రభుత్వ భూములను కేటాయించడంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
వివిధ దశల్లో పార్క్పనులు..
వెలుగుమట్లలోని అర్బన్ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లు మంజూరు కాగా, వివిధ దశల్లో పనులు నడుస్తున్నాయి. రూ.2 కోట్లతో జాతీయ రహదారి నుంచి పార్క్ వరకు ఉన్న రోడ్డును విస్తరించే పనులు జరుగుతుండగా, ఇంకో రూ.3 కోట్లతో పెడలింగ్ బోట్లు, ఖమ్మం, వైరా మెయిన్ రోడ్డు నుంచి పార్క్ కు వచ్చి వెళ్లేందుకు షెటిల్ వెహికల్, పార్కులోకి సైకిళ్లు, వైల్డ్ యానిమల్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న వాకింగ్ ట్రాక్ లను మరింత అభివృద్ధి చేయడం, బొమ్మ ట్రెయిన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పార్క్లోపల చైన్ లింక్ ఫెన్సింగ్ ను పటిష్టంగా ఏర్పాటు చేసి, జింకల పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రైతుల నుంచి మిగిలిన అటవీ భూమిని సేకరించి, హైదరాబాద్ జూ పార్క్ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల చెబుతున్నారు.
మరోచోట భూములు ఇచ్చేలా చూస్తున్నాం..
అర్బన్ పార్క్‌కు సంబంధించిన కొంత భూమిని 30 ఏండ్లకు పైగా కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారి నుంచి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఈ సమస్యను జిల్లాలోని ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. వెలుగుమట్లకు సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై క్లారిటీ వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఆ భూములకు రైతులకు కేటాయించే ఆలోచన ఉంది.
సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్, జిల్లా ఫారెస్ట్ అధికారి, ఖమ్మం