ఇప్పుడు యావత్ దేశంలో చర్చ జరుగుతున్న అతి ప్రముఖమైన అంతర్జాతీయ, జాతీయ, రాజకీయంగా ముఖ్యాంశాల్లో ప్రధానమైనది ‘ట్విట్టర్’పైనే. ఇండియాలో ట్విట్టర్ బ్యాన్ అవుతుందనే వరకూ ప్రచారాలు సాగుతున్నాయి. సామాన్య ప్రజానీకం మొదలుకుని రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, క్రీడా దిగ్గజాలు, న్యాయకోవిదులు, డాక్టర్లు ఒక్కరేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోని వ్యక్తులు, ఆయా వ్యవస్థలు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్నాయి. అటువంటి సోషల్ మీడియాలో ట్విట్టర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా సరే విభిన్న అంశాలపై తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరితో పంచుకునే, చెప్పుకునే సులువైన అవకాశాన్ని కల్పిస్తున్నది. కానీ, కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాకు సంకెళ్లు వేస్తోందా? అనేది ప్రస్తుతం వస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ఎవరికి అనుకూలం? ప్రజలకా? పాలకులకా? అనే ప్రశ్న దేశం ముందు మిగిలిపోయింది. దీనిని ఒకసారి లోతుగా పరిశీలిస్తే..
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త చట్టంలో మూడు కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ తదితర ముఖ్యమైన సోషల్ మీడియా దిగ్గజాలు, మాధ్యమాలకు సంబంధించి ఇండియాలో స్థానికంగా ఉండే వారి ప్రతినిధులను.. కేంద్ర ప్రభుత్వానికి, కోర్టులకు సంబంధించి ఏదన్నా కీలక సమాచారం దుర్వినియోగం జరిగినప్పుడు సత్వరం స్పందించేలా అందుబాటులో ఉంచాలి. రెండోది దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే ఆయా సోషల్ మీడియా మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం లేదా న్యాయస్థానాల సిఫార్సు మేరకు సత్వరం తొలగించాలి. మూడో ప్రతిపాదన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విస్తృత దుష్ప్రచారం చేసే వ్యక్తులు, అనుబంధ సంస్థల వ్యవహారంపై ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ముమ్మరం కాకముందే కనిపెట్టే టెక్నాలజీ వినియోగంలోకి తేవాలి.
చట్టాన్ని గౌరవిస్తామన్న ఫేస్బుక్, యూట్యూబ్
ఫేస్బుక్, యూట్యూబ్ ఈ అంశంపై మొదటిలో వ్యతిరేక స్వరం వినిపించినప్పటికీ క్రమేపీ కేంద్ర ప్రభుత్వంతో సంధి వైపే అడుగులు వేశాయి. భారతదేశ కొత్త చట్టాలను తాము గౌరవిస్తున్నట్టు ప్రకటించాయి. త్వరలోనే తమ సంస్థల తరఫున నిత్యం దేశంలో అందుబాటులో ఉండే నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశాయి. అయితే ట్విట్టర్, వాట్సాప్ మాత్రం ఇది ముమ్మాటికీ ‘భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యగానే’ తాము భావిస్తున్నామని, న్యాయపరంగానే ఈ అంశంపై పోరాడతామని మొదటి నుంచి భీష్మించుకుని కూర్చున్నాయి. అయితే ఇదే అంశంపై పలువురు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చెయ్యగా, ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్ అభ్యంతరాలను కౌంటర్ రూపంలో స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. దేశ భద్రత, దేశ ప్రజల భావవ్యక్తీకరణ, భావప్రకటనా స్వేచ్ఛ మధ్య నెలకొన్న సందిగ్ధత ఎప్పటికి తొలుగుతుందని సామాన్యులు మొదలుకుని రాజకీయ ప్రముఖుల వరకూ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
చట్టాన్ని ఎలా వాడతారో ప్రజలకు వివరించాలి
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త చట్టాలను మరింత వివరంగా, లోతుగా, ఎటువంటి అరుదైన అంశాల్లో ఈ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలపై వినియోగిస్తారో స్పష్టంగా ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పాలకులకు చట్టాలు చేసే సౌలభ్యం కల్పించిన అదే రాజ్యాంగం, పౌరులకు భావవ్యక్తీకరణ, భావప్రకటనా స్వేచ్ఛను కల్పించిందని మర్చిపోకూడదు. అయితే ఇదే అంశంలో తాజా పరిణామాలు కాస్త ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతుందనే విమర్శలకు తావిస్తోందనేలా ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్విట్టర్ ఆఫీసులపై పోలీస్ బృందాలు తనిఖీల పేరిట దాడులు చేయడంపై ట్విట్టర్ యాజమాన్యం ఘాటుగానే స్పందించింది. కొత్త నిబంధనలు అసలైన భారత దేశ మౌలిక రాజ్యాంగ అంశాలను, పౌరుల హక్కులను హననం చేస్తోందని ఆరోపించింది. ఇప్పటికే కేంద్రం అభ్యర్థన మేరకు సుమారు 1,178 ట్విట్టర్ అకౌంట్లను భారతదేశం వరకు నిలిపేశామని తెలిపింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనా వంటి దేశాల్లో ఆయా దేశాధ్యక్షులపై నిషేధం విధించే స్వేచ్ఛ తీసుకున్న ట్విట్టర్ ఇండియాలో మాత్రం కొత్త చట్టాలను స్వీకరించలేకపోతుందని కొందరు మేధావులు పెదవి విరుస్తున్నారు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల రీత్యా కొత్త చట్టాల రూపకల్పన ఎంత ముఖ్యమో, కొత్త చట్టాలపై సామాన్యుల అనుమానాలు నివృత్తి చేసే స్థాయిలో కూలంకషంగా వివరించే బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటుంది.
సోషల్ మీడియా దుష్ప్రచారంతో చిక్కులు
మన దేశ జనాభా 135 కోట్లు. చదువు కోని వారు ఎక్కువగా ఉండటం వల్ల కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాలతో నిత్యం ఏదో ఒక మూల ఘర్షణలు జరిగే స్థితిలో సోషల్ మీడియా దుష్ప్రచారాలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. చెదురుమదురుగా జరిగే ఇటువంటి సంఘటనలను ఆధారంగా తీసుకువచ్చే చట్టాలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే యువశక్తిని, మీడియా స్వేచ్ఛను హరిస్తుందా అనేది కూడా ఆలోచించాలి. వాట్సాప్ చాట్స్ వంటివి ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ విధానంలో కస్టమర్ల స్వేచ్ఛను, గోప్యతను ధృవీకరిస్తున్నాయి. అయితే కొత్త చట్టాలకు లోబడితే ప్రభుత్వం అడిగిన వారి వాట్సాప్ చాటింగ్ వివరాలను పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. అధికార దుర్వినియోగం నిత్యం జరిగే మన లాంటి దేశాల్లో ఈ కొత్త చట్టం కొందరి స్వార్థ పాలకులకు భవిష్యత్తులో సామాన్యుల గొంతు నొక్కే ఆయుధంగా మారదా అనేది విమర్శకుల ప్రశ్న. విస్తృత విష ప్రచారాలను నియంత్రించడం ఎంత ముఖ్యమో, సామాన్యుల భావప్రకటనా స్వేచ్ఛకు ఏ స్థాయి వ్యక్తి వలనా భంగం వాటిల్లకుండా కాపాడటం కూడా అంతే ముఖ్యమని చెప్పకతప్పదు.
కళ్యాణ్ దిలీప్ సుంకర,లాయర్