లక్ష మంది ఆసాములకు 670 కోట్ల రైతుబంధు..లిస్టులో ప్రజాప్రతినిధులు, లీడర్లు, పెద్దాఫీసర్లు

  • ‘గివ్​ ఇట్​ అప్’కు ఎవరూ ముందుకు వస్తలే

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రైతుబంధు అందుకుంటున్న ఆసాములు లక్ష మంది దాకా ఉన్నారు. వీరి చేతుల్లో 13.35 లక్షల ఎకరాల భూమి ఉన్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లతోపాటు కొంతమంది పెద్దాఫీసర్లు కూడా ప్రతి సీజన్​లో లక్షలకు లక్షలు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. లక్ష మంది ఆసాములకు ఒక్కో సీజన్​కు రాష్ట్ర సర్కార్​ ఇస్తున్న రైతు బంధు రూ. 670 కోట్లకుపైనే.  గత పది సీజన్లలో (స్కీమ్​ ప్రారంభించినప్పటి నుంచి) ఈ లక్ష మంది ఖాతాల్లో వేసిన మొత్తం రూ.6,700 కోట్లు అని ఆఫీసర్లు చెప్తున్నారు. 

సీసీఎల్​ఏ లెక్కల ప్రకారమే..!

వానాకాలం సీజన్​కు సంబంధించిన రైతు బంధు లబ్ధిదారుల వివరాలను ఇటీవల ప్రభుత్వానికి సీసీఎల్​ఏ అందజేసింది. దాని ప్రకారం.. 13 ఎకరాల నుంచి 15 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్లు 54 వేల మంది.  15 ఎకరాల నుంచి 25 ఎకరాలలోపు ఉన్నవాళ్లు 14,500 మంది. 25 నుంచి 50 ఎకరాలలోపు ఉన్నవాళ్లు 24 వేల మంది. 50 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఉన్నవాళ్లు 5,575 మంది. మొదట ఒక వ్యక్తి పేరిట ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఆ మొత్తానికి రైతు బంధును ప్రభుత్వం ఇచ్చేది. అయితే.. కొన్నాళ్లుగా సీలింగ్​ యాక్ట్​ ప్రకారం 54 ఎకరాల లోపు భూములకే రైతు బంధు ఇవ్వడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో 13 ఎకరాల నుంచి 54 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్లు లక్ష మంది ఉంటే.. ఎకరం లోపు భూమి ఉన్నోళ్లు 22.50 లక్షల మంది ఉన్నారు. ఈ 22.50 లక్షల మందికి సీజన్​కు వచ్చే రైతుబంధు రూ. 642 కోట్లు మాత్రమే.వానాకాలం సీజన్​కు సంబంధించి ప్రభుత్వం సోమవారం నుంచి రైతుబంధు సాయం  అందజేస్తున్నది. 

లిమిట్​ లేదు.. గివ్​ ఇట్​ అప్​ లేదు

రైతు బంధు సాయానికి పరిమితి విధించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. 10 ఎకరాలలోపు లేదా 15 ఎకరాలలోపు భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని వినతులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఒక రైతుకు గుంట నుంచి ఎంత భూమి ఉన్నా పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీలింగ్​ యాక్ట్​ ప్రకారం 54 ఎకరాలలోపు భూములకు రైతు బంధు సాయాన్ని ఎకరాకు ఒక్కో  సీజన్​కు రూ. 5 వేల చొప్పున (రెండు సీజన్లకు కలిపి ఏడాదికి రూ. 10వేలు) ఇస్తున్నది. ఈ లెక్కన 54 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఏడాదికి 5 లక్షల 40 వేల రూపాయలు అందుతున్నది. ధనవంతులు, బడాబాబులు రైతుబంధును తిరిగి ఇచ్చేసేందుకు ‘గివ్​ ఇట్​ అప్’​ ఆప్షన్  ఉన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్తలో కొందరు తిరిగి ఇచ్చేసినా.. ఇప్పుడు నో అంటున్నారు. 

ఎకరంలోపు వాళ్లకు అందేది రూ. 642 కోట్లు

ప్రస్తుతం వానాకాలం సీజన్​లో దాదాపు 65 లక్షల మందికి రైతుబంధు అందనుంది. ఈ మొత్తం సాయం రూ.7 వేల కోట్లు. ఇందులో 13 ఎకరాల నుంచి 54 ఎకరాల లోపు భూములున్న లక్ష మందికి అందేది రూ.670 కోట్లు. ఈ  వానాకాలం సీజన్​ను మినహాయించి.. రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 10 సీజన్లలో రూ.6,700 కోట్లు ఈ లక్ష మంది ఖాతాల్లో జమ చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్నోళ్లు 22.50 లక్షల మంది.. వారికి అందే రైతు బంధు రూ.642 కోట్లు మాత్రమే.

ALSO READ:రేవంత్ ప్రశ్నిస్తుంటే నవ్వొస్తున్నది : KTR

ఆ మంత్రులు, ఆఫీసర్లలో ఒక్కొక్కరికి 40 ఎకరాలపైనే

హైదరాబాద్​ శివార్లలో ఇద్దరు మంత్రులకు సీలింగ్​ యాక్ట్​ ప్రకారం 54 ఎకరాల భూమి ఉంది. వీళ్లకు గరిష్టంగా ఒక సీజన్​లో అందే రైతుబంధు రూ.2.70 లక్షలు. వారి దగ్గరి బంధువుల పేరిట కూడా 50 ఎకరాల అగ్రికల్చర్​ ల్యాండ్​ ఉంది. ఇక సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఆరుగురు సీనియర్​ ఐఏఎస్​లకూ రాష్ట్రంలో 40 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. వీరంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే  వీటిని కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూముల్లో కొంత కౌలుకు ఇచ్చి సాగు చేయిస్తున్నారు. మరికొన్ని భూములను పడావు పెట్టారు. అయినా ప్రభుత్వం నుంచి రైతు బంధు పెట్టుబడి సాయాన్ని  మొత్తం భూమికి అందుకుంటున్నారు. వాస్తవానికి ఇన్​కం ట్యాక్స్​ పే చేస్తూ వందల కోట్ల రూపాయలు ఉన్న ఈ పట్టాదారులకు రైతుబంధు అవసరం లేదని.. అట్ల ఇవ్వొద్దని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి.