డీసీసీబీపై ఎడతెగని ఉత్కంఠ

  • మెట్టు దిగని చైర్మన్ మహేందర్ రెడ్డి
  • 14 రోజుల నుంచి క్యాంప్​లోనే డైరెక్టర్లు
  • మరో నాలుగు రోజుల వరకు అక్కడే 
  • ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న ఇరువర్గాలు
  • బలం లేకున్నా పట్టువదలని 'గొంగిడి' 

నల్గొండ, వెలుగు : డీసీసీబీ చైర్మన్​పదవిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. చైర్మన్​గొంగిడి మహేందర్​రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లి 14 రోజులు దాటింది. ఈనెల 28న అవిశ్వాస తీర్మానంపై మీటింగ్​జరగనుంది. ఈ లెక్కన ఇంకో నాలుగు రోజులపాటు డైరెక్టర్లు క్యాంపులోనే ఉండక తప్పేలా లేదు. 14 రోజుల నుంచి చైర్మన్​పదవి కాపాడుకునేందుకు మహేందర్​రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 15 మంది కుంభం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. మహేందర్​ రెడ్డికి ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే అండగా నిలబడ్డారు. 

అవిశ్వాస తీర్మానం నెగ్గే బలం చైర్మన్​కు లేనప్పటికీ మెట్టుదిగడం లేదు. చివరి నిమిషంలో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు తనకే మద్దతు ఇస్తారనే ధీమాతో ఆయన ఉన్నారు. మహేందర్​రెడ్డి స్వగ్రామం వంగపల్లి నుంచి డీసీసీబీ డైరెక్టర్​గా ఉన్న ఆయన అనుచరుడు రాంచందర్​సైతం శ్రీనివాస్ రెడ్డి వర్గంలో చేరడంతో షాక్​కు గురయ్యారు. అసలు మహేందర్​రెడ్డిని ఏకంగా డైరెక్టర్​పదవి నుంచే దింపేందుకే వంగపల్లి సొసైటీ డైరెక్టర్లను ప్రత్యర్థి శిబిరం టచ్​లోకి తీసుకుంది. 

దీంతో అప్రమత్తమైన మహేందర్​రెడ్డి తన డైరెక్టర్లను క్యాంపునకు తరలించి ఏదో విధంగా కాపాడుకోగలిగారు. మరో డైరెక్టర్​పల్లా ప్రవీణ్​రెడ్డిని సైతం దేవరకొండ సొసైటీ చైర్మన్ పదవి నుంచి దింపేందుకు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో అక్కడ కూడా ప్రత్యర్థి వర్గం ప్లాన్​వర్కవుట్​కాలేదు. ఇక ఇంకో డైరెక్టర్​రాంచందర్​క్యాంపునకు వెళ్లగానే ప్లేట్​ఫిరాయించారు. దీంతో యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు క్యాంపునకు వెళ్లి రాంచందర్​కు సర్ధిచెప్పాల్సి వచ్చింది. మెజార్టీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి వైపే ఉన్నప్పటికీ ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్​పడుతున్నారు.  

ఎత్తుకు పైఎత్తులు..

అవిశ్వాసం నెగ్గే బలం చైర్మన్​కు లేకున్నా.. మెజార్టీ సభ్యులు తనవైపే ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. క్యాంపులో ఉన్న డైరెక్టర్ల కుటుంబ సభ్యులతో మహేందర్​రెడ్డి టీమ్​ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. దీనికి కౌంటర్​గా శ్రీనివాస్​రెడ్డి వర్గం చైర్మన్​వైపు ఉన్న డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. చైర్మన్​పీఠం సొంతమైతే టెస్కాబ్​చైర్మన్​పదవి కూడా నల్గొండకే వస్తదని, దాని వల్ల జిల్లాకు మరింత ప్రయోజనం చేకూరుతుందని శ్రీనివాస్ రెడ్డి వర్గం డైరెక్టర్లకు నచ్చచెప్తోంది. 

నాలుగేళ్లలో శ్రీనివాస్​రెడ్డితో సహా ప్రతి డైరెక్టర్​తనతో సన్నిహితంగా ఉన్నారని, బ్యాంకు ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రమే ఏకపక్షంగా వ్యవహరించానే తప్ప.. డైరెక్టర్లకు ఎలాంటి అన్యాయం చేయలేదని మహేందర్​రెడ్డి చెబుతున్నారు. రోజులు దగ్గర పడ్తున్న కొద్దీ డీసీసీబీ వ్యవహారం ఎటువైపు దారితీస్తోందని సొసైటీ పాలకవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.