ముందు దించేద్దాం..! భువనగిరి చైర్మన్ ​ఎవరనేది తర్వాత చూద్దాం

  • అవిశ్వాసం తీర్మానంపై 30 మంది సంతకాలు
  • నేడు కలెక్టర్‌‌ను కలవనున్న భువనగిరి కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు: భువనగిరి మున్సిపల్ చైర్మన్‌‌, వైస్ చైర్మన్‌‌పై అవిశ్వాసంపెట్టే విషయంలో బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ​ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. అవిశ్వాసానికి ఎప్పుడో సిద్ధమైనా.. చైర్మన్, వైస్ చైర్మన్‌‌ ఎవరనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా పదవులపై అవగాహన కుదరలేదు. దీంతో ముందు చైర్మన్, వైస్‌‌ చైర్మన్‌‌ను పదవి నుంచి దింపాలని, తర్వాత కొత్త వారి ఎన్నికపై చర్చలు జరుపుదామని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మూడు పార్టీలకు చెందిన 30 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానంపై సంతకాలు చేశారు. 

గతంలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చినా.. 

భువనగిరి కౌన్సిలర్లు గతంలోనే కలెక్టర్‌‌‌‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే మీటింగ్ ఏర్పాటు చేస్తే 24 మంది హాజరు కావాల్సి ఉంటుంది.  కానీ, చైర్మన్​ పదవి కోసం బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ, కాంగ్రెస్‌‌ కౌన్సిలర్ల మధ్య పోటీ నెలకొంది.  బీఆర్​ఎస్​ నుంచి అజీం, బీజేపీ నుంచి మాయ దశరథ, కాంగ్రెస్​ నుంచి పోత్నక్​ ప్రమోద్​కుమార్​, తంగెళ్లపల్లి శ్రీవాణి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్​, బీజేపీ-.. కాంగ్రెస్, బీఆర్ఎస్​ పలుమార్లు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. దీంతో అవిశ్వాసంపై ప్రతిష్టంభన నెలకొంది. 

నేడు కలెక్టరేట్‌‌కు.. 

చైర్మన్​, వైస్​ చైర్మన్​పై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ మూడు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు శనివారం కలెక్టరేట్​కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఓ కౌన్సిలర్​ తెలిపారు.  కలెక్టర్​ హనుమంతు జెండగేను కలిసి గతంలో ఇచ్చిన అవిశ్వాస నోటీసును ప్రస్తావించాలనుకున్నట్లు వివరించారు. అది చెల్లితే సరి, లేదంటే మరోసారి నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ఆలేరు చైర్మన్, వైస్‌‌ చైర్మన్‌‌పైనా..

ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్యపై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌‌‌‌రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారందరూ అప్పట్లో క్యాంప్ కూడా నిర్వహించారు. అయితే కోర్టు నుంచి కొందరు చైర్మన్లు స్టే తెచ్చుకోవడంతో పెండింగ్‌‌లో పడిపోయింది. 

తాజాగా ప్రభుత్వం మారడంతో  అవిశ్వానికి ఏర్పాట్లు చేస్తున్నారు.   చైర్మన్, వైస్ చైర్మన్ పోగా మిగిలిన పది మంది తమ వెంటే ఉన్నారని కౌన్సిలర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ చైర్మన్ మీదే అవిశ్వాసం పెట్టాలనుకున్న కౌన్సిలర్లు తాజాగా వైస్ చైర్మన్ మొరిగాడి మాధవిపై కూడా అవిశ్వాం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ జీ వీరారెడ్డికి నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించగా కలెక్టర్‌‌‌‌కు ఇవ్వాలని ఆయన సూచించినట్టుగా తెలిసింది.

క్యాంప్‌‌కు వెళ్లిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు

భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలిపి బీఆర్ఎస్​కు 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 16 మంది ప్రస్తుత చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, వైఎస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై తిరుగుబాటు చేశారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండా  కౌన్సిలర్​ అజీం ఆధ్వర్యంలో11 మంది కౌన్సిలర్లు గుంటూరు క్యాంప్‌‌కు వెళ్లారు. ఐదు రోజుల కింద భువనగిరికి వచ్చి మరో ఐదుగురిని తీసుకొని హైదరాబాద్‌‌కు  క్యాంప్‌‌కు వెళ్లారు. మూడు రోజుల కింద వీరంతా కలిసి భువనగిరికి చేరుకున్నారు.