కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంపై శ్రేణుల్లో జోష్ నెలకొంది. సిటీలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కరీంనగర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోరుతూ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సభకు అన్ని డివిజన్లు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో హెలీకాప్టర్‌లో దిగిన మంత్రి కేటీఆర్ కు గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా సభావేదికకు చేరుకున్నారు. వేదికపై మానుకోట ప్రసాద్, మధుప్రియ ఆటాపాట జనాలను ఉర్రూతలూగించాయి. గులాబీ జెండాలమ్మ.. పాటకు సభలో కార్యకర్తలు మెడలో గులాబీ కండువాలు ఊపుతూ డ్యాన్స్ చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ముందే ముగిసింది.