- బీజేపీ ఎంపీ సోయం బాపురావు
- బీఆర్ఎస్ నుంచి గొడం నగేష్, జాన్సన్ నాయక్
- ప్రభుత్వ ఏర్పాటుతో జోష్ లో కనిపిస్తున్న కాంగ్రెస్
ఆదిలాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని ఓటమి పాలైన ముఖ్య నేతలు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ సారి ప్రధాన పార్టీల నుంచి ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి ఈ సీటు ఎస్టీలకు కేటాయించారు. 2009లో టీడీపీ నుంచి రాథోడ్ రమేశ్ గెలుపొందగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ నుంచి గొడం నగేష్, 2019లో బీజేపీ నుంచి సోయం బాపురావు గెలిచారు. మూడు పర్యాయాలు రెండో సారి ఏ పార్టీకి అవకాశం ఇవ్వని పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఈ సారి అదే సంప్రదాయం కొనసాగిస్తారా.. లేదా చరిత్ర తిరగరాస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే ఏడు నియోజకవర్గాల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది.
బీజేపీకి మరో చాన్స్ దక్కేనా..
ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు కొనసాగుతున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి సోయం బాపురావుకు టికెట్ వస్తుందా లేదా అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవల బోథ్ నుంచి అసెంబ్లీ టికెట్ కేటాయించగా సోయం ఓడిపోయారు. కానీ మళ్లీ ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సాకటి దశరథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పేర్లు సైతం బీజేపీ ఎంపీ టికెట్ ఆశవాహులుగా జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే మొదటి సారి పార్లమెంట్ స్థానం కైవసం చేసుకున్న బీజేపీ ఈ సారి కూడా గట్టిపోటీ ఇవ్వనుంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచి బలం పెంచుకున్నారు. దీంతో ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో బీజేపీకి పట్టు ఉందని రుజువైంది. అయితే ఇక్కడ ఎంపీగా ఉన్న సోయం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లైంది. అసెంబ్లీలో ఓడిపోయిన సోయంకు మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ బీజేపీ పార్టీకి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నుంచి రేసులో మాజీ ఎంపీ..
బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ రేసులో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన బోథ్ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అధిష్ఠానం ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పేరు సైతం కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఈ సారి ఎన్నికల్లో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అటు అధికార కాంగ్రెస్‌తో పాటు నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీతో పోల్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వెనుకబడిందనే చెప్పవచ్చు.
మరో పక్క కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ నరేష్ జాదవ్ తో పాటు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ సైతం ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇలా కొత్త అభ్యర్థుల కంటే ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు.. మాజీ ఎంపీలు ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆశవాహులు ఇప్పటి నుంచి కార్యకర్తలతో మీటింగ్‌లు పెట్టి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు.