
- జగిత్యాల జిల్లాలో 75 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు
- మాటిచ్చి మరిచిన గత ప్రభుత్వాలు
- సలహాలు, సూచనలు లేక రైతుల ఇబ్బందులు
- హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. జగిత్యాల జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తారు. అయితే సాగులో మెలకువలు, సూచనలు ఇచ్చేవారు లేక నష్టపోతున్నారు. 2008లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆఫీసర్లు ప్రతిపాదనలు చేసి స్థలాలు కూడా పరిశీలించారు.
ఆ తర్వాత చల్‌గల్ మామిడి మార్కెట్ ఆనుకుని ఉన్న వాలంతరీ స్థలంలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని నాటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రావడంతో హార్టికల్చర్ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
75వేల ఎకరాల్లో సాగు
ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల మండలం పొలాసలో అగ్రికల్చర్యూనివర్సిటీ ఉండేది. ఆ తర్వాత దీనిని వెటర్నరీ, హార్టికల్చర్‌లుగా విడదీసి కోరుట్ల, నిజామాబాద్‌కు తరలించారు. దీంతో హర్టికల్చర్ సైంటిస్టులు పక్క జిల్లా నిజామాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ హార్టికల్చర్ సాగులో సూచనలు ఇచ్చేందుకు సైంటిస్టులు లేకుండా పోయారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు 75 వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు సాగవుతుంటాయి.
మామిడి, బత్తాయి, అరటి, కూరగాయలు, పసుపు, గులాబీ, బంతి, చామంతి వంటి హార్టికల్చర్ పంటలు సాగవుతున్నాయి. మామిడిలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా జిల్లా, పసుపు సాగులో రెండో స్థానంలో ఉంది. ఇతర హార్టికల్చర్ పంటల్లో నాలుగైదు స్థానాల్లో నిలుస్తోంది. సైంటిస్టులు అందుబాటులో లేకపోవడంతో కొత్త రకం సీడ్స్, సలహాలు సూచనలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు డ్రాగన్ ఫ్రూట్, జామ, దానిమ్మ వంటి పంటలు సాగు చేస్తున్నారు.
పరిశోధనలు, సాగుకు ప్రోత్సాహం
జిల్లాలో హార్టికల్చర్యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధనలు పెరుగుతాయి. దీంతో తెగుళ్లను తట్టుకునే, దిగుమతి ఎక్కువగా వచ్చే కొత్త రకం వంగడాలను ఆవిష్కరించే అవకాశం ఉండేది. సాగులో ఆధునిక మెలకువలు, ప్రోత్సాహం దక్కేది. ప్రస్తుతం యూనివర్సిటీ లేకపోవడంతో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.