అక్కడ దశాబ్దాలుగా.. పంచాయతీ ఎన్నికల్లేవ్! ఈసారైనా నిర్వహించాలని సర్కార్ను కోరుతున్న గ్రామస్తులు

అక్కడ దశాబ్దాలుగా.. పంచాయతీ ఎన్నికల్లేవ్! ఈసారైనా నిర్వహించాలని సర్కార్ను కోరుతున్న గ్రామస్తులు
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జీపీల్లో ఏండ్లుగా కనిపించని స్థానిక సందడి
  • ఓటర్ల సామాజికవర్గం ఒకటైతే.. రిజర్వేషన్‍ మరొకటి 
  • నామినేషన్ల తిరస్కరణలు, కోర్టు కేసులతో బంద్  
  • గత సర్కార్ ఎన్నికలు పెట్టకపోగా పాలకవర్గాల్లేవు  
  • స్పెషల్‍ ఆఫీసర్ల పాలనతోనే నెట్టుకొస్తున్న జీపీలు 


వరంగల్‍, వెలుగు : రాష్ట్రమంతటా స్థానిక సంస్థల ఎన్నికల జోష్ కనిపించినా.. ఆ పంచాయతీల్లో దశాబ్దాలుగా ఎలాంటి సందడి లేదు. కొన్నిచోట్ల నామినేషన్లు వేసేవారు కూడా లేరు. ఆశావహులు ఉన్నా.. అక్కడొచ్చిన రిజర్వేషన్‍ అడ్డుగా నిలిచింది. ఇంకొన్ని చోట్ల జీపీల మధ్య విభజన వివాదంతో బహిష్కరించారు. మరికొన్నిచోట్ల రిజర్వేషన్ల గొడవ కోర్టు మెట్లె క్కించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 ఏండ్ల నుంచి 40 ఏండ్లుగా స్థానిక ఎన్నికలు జరగని పంచాయతీలు ఉన్నాయి.  పాలకవర్గం కాకుండా.. స్పెషల్‍ ఆఫీసర్ల పాలననే నడుస్తోంది. వివిధ జిల్లాల్లో ఎన్నికలు జరగని జీపీల సమస్యలను పరిష్కరించి వచ్చేసారైనా నిర్వహించాలని ఆయా పంచాయతీల ఓటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఏండ్లుగా ఎన్నికలు జరగని జీపీలివే.. 

    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ అయింది. కాగా.. ఎస్టీలు లేరు. దీంతో 10 ఏండ్లుగా పంచా యతీ ఎన్నికలు జరడంలేదు. 
    భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం నారాయణరావుపేటలోని ఎస్సీ కాలనీ, సంఘం పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్ కాగా, అభ్యర్థులెవరూ లేరు. దీంతో ఆయా జీపీలకు సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదు.  
    కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి తండాలో మధుర లంబాడీలు(కాయితీ) నివసిస్తుంటారు. వీరు బీసీ సామాజికవర్గం కింద ఉండగా.. ఎస్టీలుగా భావించి 2018 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్‍ చేశారు. అధికారుల తప్పిదం కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. 
    నాగర్‍ కర్నూల్‍ జిల్లా అమ్రాబాద్‍ మండలం వంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్‍నగర్‍, కల్ములోనిపల్లి జీపీలను  2018లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ గా ఎస్టీలెవరూ లేకపోగా పోటీ చేయలేదు. వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్‍గా ఎన్నుకుని పాలకవర్గం ఏర్పాటు చేశారు.  
    నిజామాబాద్‍ జిల్లా ఇందల్వాయి మండలం గంగారాం తండాలో ఓసీ, బీసీ ఓటర్లే ఉండగా.. ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో  ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్ మార్చాలని డిమాండ్ చేయగా.. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో 2018లో ఎన్నికలు పెట్టలేదు. 
    మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం పరిధి జుజ్జూర్ తండా, బెగావత్ తండాలను కొత్త జీపీగా  ఏర్పాటు చేశారు. అయి తే.. రెండు తండాలవాసులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నిక ఆగిపోయింది.  
    నిజామాబాద్‍ జిల్లా ఇందల్వాయి జీపీ నుంచి తిర్మన్‍పల్లి కొత్తగా జీపీకి చేశారు. అయితే సమ ఆదాయం వచ్చేలా విభజించాలని ప్రజలు డిమాం డ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోగా గ్రామస్తులే ఎన్నికలను బహిష్కరించారు.  
    జనగామ జిల్లా స్టేషన్‍ఘన్ పూర్ మండలం శివునిపల్లె గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయింది. అక్కడ మూడు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు. ఎస్టీలకు ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు నిరసన తెలిపారు. దీంతో ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో ఎన్నికల నిర్వహించకపోవడంతో స్పెషల్‍ ఆఫీసర్ పాలనలోకి వెళ్లింది. 
    పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి, లింగాపూర్, రామగిరి మండలం వెంకట్రావుపల్లి, రామగుండం మండలం ఎల్కలపల్లిలోని రెండు వార్డులను 2018 ఆగస్టు1న రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేశారు. ఇందుకు ఇష్టపడని ప్రజల ఆందోళనలు చేసి కార్పొరేషన్ ఎన్నికలను బహిష్కరించారు. 2019 జులై31న డీ నోటిఫికేషన్ ద్వారా తిరిగి పంచాయతీలుగానే ఉంచినా.. ఎన్నికలు నిర్వహించలేదు.
    నాగర్‍ కర్నూల్‍ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి, లింగోటం, నడింపల్లి, లక్ష్మాపూర్‍, చౌటపల్లి, గుంపన్‍పల్లి, పులిజాలతో పాటు బల్మూర్‍ మండలం పొలిశెట్టిపల్లి జీపీలను అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2018లో మంత్రి కేటీఆర్‍ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు వ్యతిరేకించడంతో పంచాయతీలుగానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలోంచి తొలగించకపోగా పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు. 
వ్యాపారపరంగా నష్టపోతమని ఎన్నిక బహిష్కరణ 
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెం పంచాయతీలోని హామ్లెట్ విలేజ్ ఎల్లంబావిని కొత్త జీపీగా ఏర్పరిచారు. కొయ్యలగూడెం జీపీకి చెందిన కొన్ని సర్వే నంబర్లు ఎల్లంబాయికి కేటాయించారు. అవి నేషనల్ హైవేకు ఆనుకొని 500 మీటర్ల పరిధిలోని సర్వే నెంబర్లు భూములు. కాగా.. తద్వారా వ్యాపారపరంగా కొయ్యలగూడెం ఉనికిని కోల్పోయిందని గ్రామస్తులు ఏకపక్ష తీర్మానం చేసుకుని ఎన్నికలను బహిష్కరించారు. 
చీటీ పద్ధతిలో ఎన్నుకోగా.. ఎన్నిక రద్దు
జగిత్యాల జిల్లా మల్లాపూర్‍ మేజర్‍ పంచాయతీకి గత ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు కుమ్మక్కై చీటీ పద్ధతిలో ఒకరిని సర్పంచ్‍గా ఎన్నుకున్నారు. రూల్స్ కు విరుద్ధం కావడంతో కలెక్టర్‍ ఎన్నికను రద్దు చేశారు. 

ఓటర్లదో సామాజిక వర్గం.. రిజర్వేషన్‍ మరొకటి 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం పంచాయతీలో దాదాపు 40 ఏండ్లుగా స్థానిక ఎన్నికలు జరగట్లేదు. 1,800 మందికిపైగా జనాభా నివసిస్తున్నా అందరూ గిరిజనేతరులే ఉన్నారు. అక్కడ గిరిజనులు లేకపోయినా నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా..1987 నుంచి సర్పంచ్ తో పాటు పదింటిలో 5 వార్డులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు లేరు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కావట్లేదు. దీంతో గూడెంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనే  కొనసాగుతోంది. పాలకవర్గం లేక సమస్యల పరిష్కారం కావట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1920 నుంచి ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నట్టు ఎలాంటి రికార్డులు కూడా లేవని పేర్కొంటున్నారు.

సమస్య పరిష్కారమైనా.. ఎన్నిక పెట్టలే

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటి మామిడిపల్లిని రెవెన్యూ విలేజ్ గా చేయాలనే డిమాండ్ తో 2014లో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించగా.. 2015 ఆగస్టు 4న నిర్వహించారు. 2018లో పంచాయతీ ఎన్నికల్లోపు పాలకవర్గం గడువు పూర్తి కాలేదని నిర్వహించలేదు. 2020 ఆగస్టు5న గడువు ముగిసింది. ఆరు నెలల్లోగా పెట్టాల్సి ఉన్నా అప్పటి బీఆర్‍ఎస్‍ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వెళ్లింది. 

గెలిచినా.. ప్రమాణ స్వీకారం చేయలే.. 

ములుగు జిల్లా మంగపేట మండలంలో 25 జీపీలు ఉన్నాయి. మంగపేట షెడ్యూల్ మండలమా? నాన్ షెడ్యూల్ మండలమా..? అనేది కోర్టు పరిధిలో ఉండడంతో స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి. 2014 ఏప్రిల్ 6న జరిగిన జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో జడ్పీ సీటు జనరల్, ఎంపీటీసీ సీట్లు రొటేషన్ పద్ధతిలో జరిగాయి. ఆ ఎన్నికల్లో విజేతలకు అధికారులు సర్టిఫికెట్లు ఇచ్చారు. కోర్టులో తేలకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆపై ఎంపీపీ ఎన్నిక కూడా జరగలేదు.