- ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
- గెలుపోటములపై నియోజకవర్గ, మండల నేతలతో చర్చలు
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం అనే అంశంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్యమైన లీడర్లు తమ అనుచరులతో చర్చిస్తున్నారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయమై ఆయా పార్టీల ఇన్చార్జీలు ఆరా తీస్తున్నారు. పోలింగ్ తీరుపై, గెలుపోటములపై లెక్కలేసుకుంటున్నారు.
ఎక్కడ.. ఏ పరిస్థితి?
ఖమ్మంలో కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్, బీజేపీకి క్రాస్అయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కొంత వరకు బీజేపీకి క్రాస్ అయ్యాయి. టీడీపీ ఓట్లు బీజేపీకి పడాల్సి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు పడడం గమనార్హం. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్, బీజేపీలకు బదిలీ అయ్యాయి. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు క్రాస్ అయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన కొంత మేర ఓట్లు బీజేపీకి క్రాస్ కావడం గమనార్హం. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు కొంత మేర బీజేపీకి పడ్డాయి.
బీఆర్ఎస్ ఓట్లు కొన్ని కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగాయి. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్ అయ్యాయి. పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎక్కువగా క్రాస్ అయ్యాయి. కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని బీజేపీకి పడడం గమనార్హం. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా క్రాస్ ఓటింగ్ ఉండడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుందో అర్థం కాని పరిస్థితి నేతల్లో నెలకొంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,81,997 మంది ఓటు వేయలె
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో దాదాపు 2,81,997 మంది ఓటు వేయలేదు. ఐదు నియోజకవర్గాలకు గానూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గం పోలింగ్‌లో చివరన నిలువగా, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం టాప్‌లో నిలిచింది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్‌శాతం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలకు గానూ 9,67,171 మంది ఓటర్లు ఉండగా, 7,80,49 మంది ఓటేశారు. లోక్ సభ ఎన్నికల్లో 9,88,238 మంది ఓటర్లు ఉండగా, 7,06,241 మంది ఓటేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు.. కానీ ఓటేసిన వారి సంఖ్య మాత్రం తగ్గడం గమనార్హం.