- కల్లు దందా ఆధిపత్య పోరులో పేదలు బలి
- మోతాదు ఎక్కువైనా, తక్కువైనా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్న బాధితులు
- విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్న వ్యాపారులు
- చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్ ఆఫీసర్ల విఫలం
మహబూబ్‌నగర్, వెలుగు : కల్తీకల్లు వ్యాపారంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. రూలింగ్ పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లు వేర్వేరుగా ఈ దందాలు చేస్తుండగా, ఎక్కువ మందిని తమ దుకాణాలకు రప్పించుకునేందుకు చేస్తున్న ప్రయాత్నాల్లో పేదలను బలి చేస్తున్నారు. ఎక్కువ కిక్ ఇచ్చేందుకు మోతాదుకు మించి మందు కలుపుతున్నారు. ఈ క్రమంలో మందు డోస్ కొంచెం తగ్గినా, పెరిగినా రోజూ ఈ కల్లు తాగే వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. శుక్రవారం రాత్రి పాలమూరు జిల్లా కేంద్రంలో 10 మంది కల్తీ కల్లు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
1,082 కల్లు దుకాణాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్సైజ్ ఆఫీసర్ల లెక్క ప్రకారం.. అధికారికంగా 1,082 కల్లు కాంపౌండ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్కో ఊళ్లో రెండు చొప్పున దుకాణాలు, మండల కేంద్రాల్లో నాలుగు చొప్పున, జిల్లా కేంద్రాల్లో పేదలు, కూలీలు నివాసం ఉండే కాలనీల్లోనే నాలుగైదు కల్లు కాంపౌండ్ల చొప్పున అనధికారికంగా మరో రెండు వేల కల్లు దుకాణాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని చారకొండ, కల్వకుర్తి, వీపనగండ్ల, కొల్లాపూర్, పెబ్బేరు, మద్దిగట్ల, వెల్టూరు, ఖిల్లాఘణపురం, కోడూరు, మొల్గర, బొక్కలోనిపల్లి, ధర్మాపూర్ ప్రాంతాల్లో మాత్రమే ఈదులు, తాళ్లు ఉన్నాయి. ఇవి లేని ఏరియాల్లో వ్యాపారులు మందు కల్లును తయారు చేసి అమ్ముతున్నారు.
కెమికల్ సప్లైలో ఇద్దరిది కీ రోల్..
మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మందు కల్లును తయారు చేసేందుకు వాడే కెమికల్స్‌ను ఉమ్మడి జిల్లాలో సప్లై చేస్తున్నారు. వీరిద్దరు ముంబై, హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఆల్ర్పాజోలం, క్లోరల్ హైడ్రేట్(సీహెచ్) దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలకు సప్లై చేస్తున్నారు. లోకల్‌గా వీరిద్దరు వారి బిజినెస్‌ను విస్తరించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కల్తీ కల్లులో మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నారు. ఈ క్రమంలో తరచూ చాలా మంది పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరు కొద్ది రోజుల కింద ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి వద్దకు చేరింది. అయినా, వీరి తీరులో మాత్రం మార్పు రాలేదు. బిజినెస్ పెంచుకునేందుకు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చర్యలు తీసుకోవద్దని ఆర్డర్లు..
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మందు కల్లు తాగి 10 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే బాధితులు జిల్లా జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అర్ధరాత్రి వరకు 10 మంది అడ్మిట్ కాగా, ఈ విషయం బయటకు రాకుండా నియోజకవర్గానికి చెందిన ఒక లీడర్ రంగంలోకి దిగారు. కొందరు ఎక్సైజ్ ఆఫీసర్లతో మాట్లాడి, జాగ్రత్త పడినట్లు సమాచారం. ఈ క్రమంలో కల్లు దుకాణాలపై దాడులు, కేసులు నమోదు చేయవద్దని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. బాధితులు ఎవరితో మాట్లాడకుండా ఉండేందుకు వారికి కొంత డబ్బు ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి.
మస్తుగా మామూళ్లు..
కల్తీ కల్లు అమ్మే వ్యాపారులు ఎక్సైజ్ ఆఫీసర్లకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇస్తున్నారని పబ్లిక్ చర్చించుకుంటోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక ఆఫీసర్ కల్తీ కల్లు, కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నా, పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దుకాణాల తనిఖీ, దాడులు మొత్తానికి బంద్ పెట్టారనే చర్చ నడుస్తోంది. తాజాగా 10 మంది అస్వస్థతకు గురైనా, కల్తీ కల్లు అమ్మిన దుకాణంపై చర్యలు తీసుకోలేదు.
కంప్లైంట్ రాలేదు..
పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్న కొందరు మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్లో చేరింది వాస్తవమే. కానీ, వారు కల్తీకల్లు తాగడం వల్ల అలా చేస్తున్నారనే దానిలో వాస్తవం లేదు. జిల్లా కేంద్రంలోని దొడ్లోనిపల్లి, బోయపల్లి, బోయపల్లి డిపో, తిమ్మాసానిపల్లి ఏరియాల్లోని కల్లు దుకాణాలను పరిశీలించాం. అక్కడి కల్లు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్‌కు పంపించాం. కల్తీ కల్లు తాగడంతో పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారనే విషయంపై మాకు ఇంత వరకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు.
- వీరారెడ్డి, ఎక్సైజ్ సీఐ, మహబూబ్‌నగర్