ఆప్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్‎గా పార్లమెంట్‎కు కేజ్రీవాల్..?

ఆప్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్‎గా పార్లమెంట్‎కు కేజ్రీవాల్..?

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో ఆప్ 11 ఏళ్ల విజయ పరంపరకు బీజేపీ బ్రేకులు వేసింది. ఆప్‎ను ఓడించడమే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‎ను కూడా బీజేపీ ఓడించింది. ఢిల్లీలో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కేజ్రీవాల్ రాజ్య సభకు వెళ్లనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ నుంచి కేజ్రీవాల్ పెద్దల సభకు వెళ్తారని దేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది. 

ఈ క్రమంలో.. తాజాగా పంజాబ్ పాలిటిక్స్‎లో జరిగిన ఓ పరిణామం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చించింది. ఇటీవల లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి తన పిస్టల్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అయ్యి మరణించాడు. దీంతో లూథియానా వెస్ట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్‎కు అధికార ఆప్ తమ పార్టీ అభ్యర్థిగా రాజ్య సభ ఎంపీ సంజీవ్ అరోరా పేరును ప్రకటించింది. ఉప ఎన్నికలో ఎంపీ సంజీవ్ అరోరా గెలిస్తే ఆయన ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Also Read : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

కాబట్టి ఆయనను రాజ్య సభకు రాజీనామా చేయించి.. అతడి స్థానంలో కేజ్రీవాల్ రాజ్య సభకు వెళ్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పార్లమెంట్‎కు కేజ్రీవాల్ వెళ్తారన్న ప్రచారంపై ఆప్ స్పందించింది. ఈ మేరకు ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం (ఫిబ్రవరి 26) మీడియతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదని.. పంజాబ్ నుంచి ఆప్ అధినేత రాజ్య సభకు వెళ్తారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని ఆమె ఖండించారు.

 కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారని, రాజ్య సభకు వెళ్తారని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాయి. సంజీవ్ ఆరోరా వ్యక్తిత్వం, ఆయన పని తీరు కారణంగానే లూథియానా వెస్ట్ బైపోల్‎లో బరిలోకి దింపామని.. అంతేకానీ కేజ్రీవాల్‎ రాజ్య సభకు వెళ్లేందుకు ఆయనను ఉప ఎన్నికలో పోటీ చేయిస్తున్నారనేది ఫేక్ ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. మరీ ప్రచారం జరుగుతున్నట్లుగా కేజ్రీవాల్ రాజ్య సభకు వెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.