- ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటుందని సోషల్మీడియాలో ప్రచారం
- వదంతులని ఖండించిన బీఆర్ఎస్ అభ్యర్థి
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసింది. ఇప్పటికే ఆమె పార్లమెంట్పరిధిలో ప్రచారం కూడా ప్రారంభించారు. గురువారం రాత్రి బీఆర్ఎస్ నుంచి వరంగల్ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని కడియం కావ్య ప్రకటన విడుదల చేయడంతో ఆ ఎఫెక్ట్ మానుకోట పార్లమెంట్ అభ్యర్థి కవితపై పడింది. మానుకోట ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ నుంచి తప్పుకుంటోందని శుక్రవారం జిల్లాలోని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఉదయం నుంచి అనేక వాట్సాప్గ్రూపుల్లో ఇది చక్కర్లు కొట్టడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిర్ధారించుకోవడానికి కార్యకర్తలు ఆమెకు ఫోన్లు చేయడంతో శుక్రవారం ఎంపీ కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉంటానని ప్రకటించారు. కార్యకర్తలు వదంతులు నమ్మవద్దని కోరారు.