హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ (అక్టోబర్ 6) తెలంగాణలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుండి వీస్తాయని పేర్కొంది.
పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, -దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమై ఉన్నదని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వాతావరణంలో అనుహ్య మార్పులు చోటు చేసుకుంటుంటున్నాయి. అప్పటి వరకు సూర్యుడు ప్రతాపం చూపిస్తుండగా.. నిమిషాల్లోనే వెదర్ ఛేంజ్ అయ్యి భారీ వర్షం కురుస్తోంది.
Also Read :- ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి
ఇవాళ (అక్టోబర్ 6) హైదరాబాద్ లో ఇదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఉదయం నుండి ఎండ దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వెదర్ కూల్ కావడంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ అనూహ్య వాతావరణ మార్పులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో పాటు.. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల వాతావరణం ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయని వాతావరణవేత్తలు పేర్కొంటున్నారు.