ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. సిట్టింగుల్లో టెన్షన్

ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. సిట్టింగుల్లో టెన్షన్

ఎంతో ఆసక్తిగా మరెంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం రోజు (ఆగస్టు 21న ) విడుదల చేయనున్నారు. సోమవారం శ్రావణమాసం పంచమి సందర్భంగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలలోపు అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించే చాన్స్ ఉందంటున్నారు. బీఆర్ఎస్ భవన్ కు వచ్చి లిస్ట్ ను విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్. 

కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. సో.. రేపు 105మందితో ఫస్ట్ లిస్ట్ ను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. అయితే.. 16 సీట్లపై బీఆర్ఎస్ లో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీ శ్రావణ శుక్రవారం రోజు సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో సిట్టింగుల్లో టెన్షన్ మొదలైంది. 

అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ప్రగతిభవన్, బీఆర్ఎస్ భవన్ లో కసరత్తు పూర్తి చేశారు. రేపు మంచి ముహుర్తం ఉందని పండితులు సూచించడంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ లో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాలపై మాత్రం గందరగోళం నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా..? లేక కొత్త వాళ్లకు చాన్స్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం అభ్యర్థుల మార్పు లేదని తెలుస్తోంది. ఎక్కువమంది అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడం బీఆర్ఎస్  వ్యూహా రచనగా తెలుస్తోంది.

*  కల్వకుర్తి సీటుపై పార్టీ అధిష్టానం పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 

* ఉప్పల్ అభ్యర్థిపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. 

* బోథ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గాలపై టెన్షన్ కొనసాగుతోంది.

* వేములవాడ అభ్యర్థిపైనా ఇంకా క్లారిటీ రాలేదు.

* స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వరంగల్ ఈస్ట్ పైనా ఉత్కంఠ కొనసాగుతోంది.  

* నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ నియోజకవర్గాలపైనా క్లారిటీ లేదు. 

* కల్వకుర్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ ఉన్నారు. ఈయన బీసీ వర్గానికి చెందిన నేత. ఒకవేళ జైపాల్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇచ్చే చాన్స్ ఉంది. బీఆర్ఎస్ సర్వేల రిపోర్టు ఆధారంగా కల్వకుర్తి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. 

* రంగారెడ్డి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి ఫోకస్ కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఉప్పల్ టికెట్ ను సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు బండారు లక్ష్మారెడ్డి ఆశిస్తున్నారు. బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఆదివారం రోజు (ఆగస్టు 20న) ఎమ్మెల్సీ కవితను కలిశారు. తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే బండారు లక్ష్మారెడ్డి పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నాలుగు స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బోథ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రాథోడ్ బాపూరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఈయనకు టికెట్ దక్కే చాన్స్ కనిపించడం లేదు. మంత్రి కేటీఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తి అయిన అనిల్ కుమార్ జాదవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

* ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు టికెట్ ఇచ్చే చాన్స్ అస్సలు కనిపించడం లేదు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన జాన్సన్ నాయక్ కు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు.

* ఇక ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి ఈయనకు టికెట్ ఇవ్వకపోతే కోవా లక్ష్మీకి ఇచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గా కొనసాగుతున్నారు. ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ సీటు కేటాయించే చాన్స్ ఉంది. 

* బెల్లంపల్లిలో మాత్రం ఈసారి దుర్గం చిన్నయ్యకు టికెట్ రాదని తెలుస్తోంది. ఈయనపై శేజల్ అనే యువతి ఆరోపణలతో పార్టీకి పెద్ద డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. దుర్గం చిన్నయ్యపై నియోజకవర్గంలోనూ వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. 

* ఇక మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఈయనకు టికెట్ ఇచ్చే చాన్స్ లేదంటున్నారు. కూసుకుంట్లకు ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు ఇచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే ఈయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఒకవేళ కూసుకుంట్లకు లేదా గుత్తా అమిత్ కు ఇవ్వకపోతే మునుగోడు టికెట్ ను సీపీఐ పార్టీకి ఇచ్చే చాన్స్ ఉంది.

* కోదాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. ఈయనకు టికెట్ రాదని తెలుస్తోంది. ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వర్ రావు కోదాడ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు.. పార్టీ అధిష్టానం పరిశీలనలో యుగంధర్ రావు పేరు కూడా ఉంది.

* వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఉన్నారు. ప్రస్తుతం ఈయన జర్మనీలో ఉన్నారు. చెన్నమనేని రమేష్ కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.
 
* స్టేషన్ ఘనపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. రాజయ్యపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే చాలా వివాదాల్లో రాజయ్య ఇరుక్కున్నారు. అందుకే కడియం వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 

* జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి ఉన్నారు. ఈ సీటును ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జనగాంకు చెందిన పార్టీ నాయకులతో పల్లా మీటింగ్ నిర్వహించారు. మరోవైపు.. నాచారంలోని నోమా ఫంక్షన్ హాల్ లో ముత్తిరెడ్డి బలప్రదర్శన చేశారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. 

* వరంగల్ ఈస్ట్ (తూర్పు)లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. ఈయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడి నుంచి వరంగల్ మేయర్ గుండు సుధారాణి పేరు పరిశీలనలో ఉంది. దాంతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా వినిపిస్తోంది.