స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం .. ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!

స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం .. ఎన్నికలకు  బీజేపీ, బీఆర్ఎస్ దూరం!
  • నామినేషన్లు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో గులాబీ పార్టీ
  • పోటీలో కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే ఉండడంతో ఏకగ్రీవానికి చాన్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే చాన్స్ కనిపిస్తున్నది. పోటీకి బీజేపీ, బీఆర్ఎస్​ కార్పొరేటర్లు దూరంగా ఉండాలని ఆయా పార్టీలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ వేసిన రెండు నామినేషన్లు కూడా వెనక్కి తీసుకోనున్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్లు చెప్తున్నారు. అయితే, బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రస్తుతం వారికి ఉన్న బలం(బీజేపీకి 39, బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు)తో మొత్తం15 స్టాండింగ్ కమిటీ మెంబర్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. కానీ బీఆర్ఎస్ తో కలిస్తే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో తమకు డ్యామేజ్ జరుగుతుందని బీజేపీ పెద్దలు ఆలోచించినట్లు తెలిసింది. 

ఇటు బీఆర్ఎస్​ కూడా అదే మాదిరి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటే ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి స్టాండింగ్ కమిటీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. గతంలో మేయర్ బీఆర్ఎస్​లో ఉన్న సమయంలో మాదిరిగానే ఎంఐఎంకు 7 ఇచ్చి, 8 కాంగ్రెస్ తీసుకునే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఎంఐఎంకు 41, కాంగ్రెస్​కు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ​దూరంగా ఉండడంతో తక్కువ మెజారిటీ అయినప్పటికీ వీరే ఏకగ్రీవం కానున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్లకు అవకాశం ఉండడంతో.. ఇప్పటివరకు కాంగ్రెస్​ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్​ నుంచి ఇద్దరు మాత్రమే వేశారు. 

మేయర్ నిర్ణయం తరువాత ఫైనల్

కాంగ్రెస్, ఎంఐఎంల పొత్తుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత కాంగ్రెస్​లో ఎవరెవరికి స్టాండిగ్ కమిటీ మెంబర్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి నిర్ణయం తీసుకొని ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్​లో ప్రస్తుతం 24 మంది ఉండగా, ఇందులో మేయర్ డిప్యూటీ మేయర్ పోనూ 22  మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్​ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. 

స్టాండింగ్ కమిటీ సభ్యుడి కోసం అందరూ ఆశిస్తున్నారు. ఇద్దరు ఇప్పటికే నామినేషన్లు కూడా వేశారు. అయితే, ఎవరికి స్టాండింగ్ కమిటీలో అవకాశం ఇవ్వాలన్న అంశపై శనివారం ఎమ్మెల్యే క్వార్టర్స్​లో  తమ కార్పొరేటర్లతో మేయర్ సమావేశమయ్యారు. మరోసారి మంత్రి పొన్నంతో కలిసి లీస్ట్ ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. అయితే, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్కువగా ఉండటంతో వారు 8 డిమాండ్  చేసే అవకాశలూ లేకపోలేదు.