గద్వాల, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తప్పడం లేదు. అభిప్రాయబేధాలు పక్కనపెట్టి అందరూ కలుసుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించింది. కానీ నడిగడ్డలో వర్గ విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు పాల్గొనడం లేదు.
ఇదిలాఉంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని, సమ్మేళనాలకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాలకు జడ్పీ చైర్పర్సన్ దూరంగా ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తో పాటు పార్టీ సీనియర్లు ఆత్మీయ సమ్మేళనాల్లో కనిపించడం లేదు. దీంతో ఎమ్మెల్యేలకు అనుకూలమైన వారితో మాత్రమే సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని సీనియర్లు అంటున్నారు.
ఎవరికి వారే గ్రూపులు..
అలంపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వారి సంఖ్య భారీగా ఉంది. మాజీ ఎంపీ మంద జగన్నాథం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మాజీ ఉమ్మడి జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కిశోర్ కుమార్ తో పాటు పలువురు టికెట్ ఆశిస్తూ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్లంతా అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల చల్లా పార్టీలో చేరగా, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఆయన కూడా అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తూ తనకు అనుకూలమైన వారికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఉద్యమ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి సైతం దూరంగా ఉంటున్నారు. ఇలా ఆత్మీయ సమ్మేళనాలకు ఎవరికి వారు దూరంగా ఉండడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గద్వాల నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరితకు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఉప్పు నిప్పులా ఉన్నది. గద్వాలలో జరిగే సమ్మేళనాలకు జడ్పీ చైర్ పర్సన్ ను దూరంగా ఉంచుతున్నారు.
అనుకూల వర్గంతోనే మీటింగులు..
నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారితోనే ఆత్మీయ సమ్మేళనాలు, మీటింగులు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పార్టీని పట్టించుకోవడం లేదంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఉండవెల్లి జడ్పీటీసీ రాములమ్మ కంప్లైంట్ చేశారు. కార్యకర్తలను, లీడర్లను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాలు తప్ప మిగిలిన ఐదు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడం లేదని, ఇది ఎమ్మెల్యే వ్యవహార శైలికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
ఇన్ చార్జిని తప్పుదోవ పట్టిస్తున్రు..
వర్గాలను, అసంతృప్త నేతలను కలిసి వారిని బుజ్జగించి ఆత్మీయ సమ్మేళనాలకు తీసుకెళ్లి మీటింగ్ లు జరపాలని పార్టీ హైకమాండ్ సూచించింది. అలాగే ఉద్యమకారులను, సీనియర్లను సన్మానించాలని కూడా పార్టీ నిర్ణయించింది. అందుకోసం ప్రతి జిల్లాకు ఒక ఆత్మీయ సమ్మేళన ఇన్‌చార్జిని నియమించారు. ఇందులోభాగంగా గద్వాల జిల్లాకు ఎమ్మెల్సీ రవీందర్ రావును నియమించారు. ఆయనకు ఇక్కడి పార్టీ పరిస్థితి, వర్గాల గురించి చెప్పకుండా ఎమ్మెల్యేలు తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి.
రెండు రోజుల కింద అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన మీటింగ్ కు జడ్పీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడి మీటింగ్ కు తీసుకొచ్చారు. అయితే మిగిలిన లీడర్ల ఇంటికి వెళ్లనీయకుండా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో టికెట్ ఆశిస్తున్న వారు, అసంతృప్తులు పార్టీ సీనియర్లు, ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.