కోర్టుల్లో ఐఏఎస్ అధికారులు ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి

కోర్టుల్లో ఐఏఎస్ అధికారులు ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి

ప్రభుత్వ అధికారులు, మరీ ముఖ్యంగా ఐఏఎస్​అధికారులు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.ఈ అంశానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడటానికి కారణం ఆ మధ్య పాట్నా హైకోర్టు న్యాయమూర్తి పీబీ భజంత్రీ వస్త్రధారణ విషయంలో ఓ ఐఏఎస్ ​అధికారిని మందలించిన వీడియో వైరల్​కావడమే. హౌజింగ్, అర్బన్​ డెవలప్​మెంట్​ప్రధాన కార్యదర్శి అయిన ఆ ఆఫీసర్.. మామూలు దుస్తులతో, అది కూడా కాలర్​బటన్ పెట్టుకోకుండా హైకోర్టుకు హాజరు కావడంతో న్యాయమూర్తి ఆయనను మందలించారు. 

భిన్న వాదనలు..
ఐఏఎస్​ ఆఫీసర్​ ఆనంద్​కిషోర్​ కోర్టుకు మంచి దుస్తుల్లోనే వచ్చారు. న్యాయమూర్తి ఆయన్ని అనవసరంగా కోపగించుకున్నారని నెటిజన్లు సోషల్ ​మీడియాలో ఘోషించారు. ఈ చిన్న విషయం మీద రెండు మూడు నిమిషాల కోర్టు సమయాన్ని వృథా చేశారని కూడా మరికొంత మంది అభిప్రాయపడ్డారు. దీని మీద న్యాయవ్యవస్థలోని వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఆనంద్​కిషోర్​ వస్త్రధారణ తప్పు పట్టే విధంగా లేదని, ఎండాకాలం కాబట్టి కాలర్​గుండిని పెట్టుకోలేదని, దానికి ఇంతలా మందలించాలా? అని కొంత మంది అంటే, ‘వీళ్లను ఏమీ అనకపోతే టీషర్టులు కూడా వేసుకొని వస్తారు. ఈ ఎండా కాలంలో మేము కోటూ, గౌనూ వేసుకోవడం లేదా’ అని మరికొంత మంది అంటున్నారు. కోటూ, టైలు వేసుకోవడం అనేది వలసవాదుల సంస్కృతి అని మరికొంత మంది ఉవాచ. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించాల్సి వస్తోంది.

సుప్రీంకోర్టులోనూ..
2017 ఆగస్టులో ఓ మహిళా ఆఫీసర్ ​హిమాచల్​ప్రదేశ్ హైకోర్టులో చారల షర్ట్, జీన్​ప్యాంట్​వేసుకొని హాజరయ్యారు. అది నచ్చని హైకోర్టు న్యాయమూర్తులు సదరు మహిళా అధికారిని మందలించారు. అలా హాజరు కావడం కోర్టును తక్కువ చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా కోర్టుకు హాజరు కావొద్దని హెచ్చరిక చేశారు. అనంద్​కిషోర్​ మాదిరిగా, కొంతకాలం క్రితం మరో ఐఏఎస్​ అధికారి సరైన డ్రెస్​కోడ్​ లేకుండా హైకోర్టు ముందు హాజరయ్యారు. అది కూడా న్యాయమూర్తి భజంత్రీ బెంచీ ముందు. 2014 బ్యాచ్​కు చెందిన ఆ అధికారిని కోర్టు మందలించింది. సరైన డ్రెస్​కోడ్​లో రాకపోవడం తప్పిదమేనని అతను అంగీకరించాడు. 2018లో సుప్రీంకోర్టులోని జస్టిస్​చలమేశ్వర్​ బెంచ్​ముందు రంగు రంగుల షర్ట్, ప్యాంట్​తో ఓ ఐఏఎస్ అధికారి హాజరయ్యారు. అతని వస్త్రధారణ హుందాగా, మర్యాదగా లేదన్న కారణంగా కోర్టు అతను హాజరు కావాల్సిన కేసును మరుసటి రోజుకి వాయిదా వేసింది. తెల్లవారి అతను రాయల్​బ్లూ సూట్​వేసుకొని కోర్టుకు హాజరయ్యారు. క్రితం రోజు సరైన వస్త్రధారణలో రానందున అతను కోర్టుకు క్షమాపణలు చెప్పాడు. ‘‘కోర్టులకు ఎలా హాజరు కావాలన్న విషయంలో మాకు ఎలాంటి నియమాలు ఉన్నా, లేకున్నా మీరు హుందాగా, మర్యాదగా ఉండే దుస్తులతో రావాలి’’అని  న్యాయమూర్తి చలమేశ్వర్​ అతనికి హితబోధ చేశారు. ఇది అతనికి మాత్రమే కాదు. దేశంలోని అందరు అధికారులకు చేసిన హితబోధ.

కోర్టు హితబోధన పాటించాలె..
2017 కూడా ఇలాంటి సంఘటనే సుప్రీంకోర్టులో జరిగింది. ఆ బెంచ్​న్యాయమూర్తి కూడా జస్టిస్​చలమేశ్వరే. ఆ కేసులో అప్పీలు దాఖలు చేయడంలో జాప్యం జరిగింది. దాని వివరణ కోసం ఓ ఐఏఎస్​అధికారి సరైన దుస్తులు వేసుకొని కోర్టు ముందు హాజరు కాలేదు. ఆ కేసును కూడా మరుసటి రోజుకు కోర్టు వాయిదా వేసింది. ఆ తరువాత బంద్​గలా సూట్​వేసుకొని కోర్టుముందు హాజరయ్యాడు. ఇలాంటి సంఘటనలు చాలా హైకోర్టుల్లో జరుగుతున్నప్పటికీ అందరు న్యాయమూర్తులు ప్రతిస్పందించక పోవడం వల్ల అవి అందరి దృష్టికి రావడం లేదు. కోర్టుల మనోభావాలను గమనించి హిమాచల్​ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు సరైన దుస్తుల్లో ప్రభుత్వ అధికారులు కోర్టుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా, మర్యాదగా ఉండాలి. వారి దుస్తులు కూడా అదే విధంగా ఉండాలి. కోర్టుల ముందే కాదు. వారి కార్యాలయాల్లో కూడా. ఈ రోజుల్లో కోర్టు గదులు దాదాపు అన్నీ ఏసీ గదులే. అలాంటప్పుడు కోటు బ్లేజర్​ వేసుకోవడం అసౌకర్యంగా ఉందీ అని అనడం అర్థరహితం. సుప్రీంకోర్టు చెప్పిన హితబోధను అందరూ పాటించాలి. వారికి ముకుతాడు వేయాల్సింది న్యాయమూర్తి పీబీ భజంత్రీ మాత్రమే కాదు అన్ని కోర్టుల  న్యాయమూర్తులు కూడా.

ప్రధాని విషయంలోనూ..
అధికారం చేతిలో ఉందని పదవుల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్​అధికారులు.. క్రీడాకారులు ఆడుకునే స్టేడియాల్లోకి ఇతరులు ఎవరూ రాకుండా చేసి, తమ కుక్కను వాకింగ్​కు తీసుకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈ విషయం సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధికార దంపతులను బదిలీ చేసింది. సదరు అధికారిని లడక్​కు, ఆయన భార్యను అరుణాచల్​ ప్రదేశ్​కు బదిలీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ మధ్య చత్తీస్ గఢ్ లో పర్యటించినప్పుడు ఇద్దరు ఐఏఎస్​ అధికారులు అధికారిక దుస్తులు ధరించలేదు. మరో అధికారి రంగు షర్టు వేసుకొని నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ప్రధానమంత్రిని రిసీవ్​చేసుకున్నారు. ఆ దుస్తుల్లోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని మందలించింది. అధికారంలో ఉన్న ఓ ఎంపీ కాళ్ల దగ్గర కూర్చొని కనిపించిన ఓ ఐఏఎస్​ అధికారి, దవాఖానాలో బూటు కాలును పేషెంట్ ​బెడ్​మీద పెట్టిన దృశ్యాలను చూశాం. అంతే కాదు తాను లాన్​టెన్నిస్​ఆడుతున్నప్పుడు బాల్స్​తీసుకురావడానికి ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులను నియమించారన్న వార్తలు కూడా పత్రికల్లో కనిపించాయి. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఐపీఎస్​అధికారి తన కోసమే లిఫ్ట్​ను పెట్టుకున్నారన్న వార్త కూడా వినిపించింది. ఇంత అధికార దర్పం ఉన్న అధికారులు అంతో ఇంతో వినయంగా కన్పించే అవకాశం ఉన్న ప్రదేశం కోర్టులు. అక్కడ కూడా చాలా మంది వినయంగా ఉన్న సందర్భాలు కనిపించడం లేదు. 
- మంగారి రాజేందర్,మాజీ డైరెక్టర్, జ్యుడీషియల్​ అకాడమీ