- జిల్లాల నుంచి ఎర్రగడ్డ టీబీ సెంటర్‌కి నెలకు 3వేల శాంపిల్స్
- వ్యాధి తీవ్రత తెలుసుకునే టెస్టుల కోసమే ఎక్కువ నమూనాలు
- నిరుడు శాంపిల్స్‌లో 10వేలకి పైగా టెస్టులు చేయలే
- పేషెంట్ల వద్ద డబ్బు తీసుకొని శాంపిల్స్ పంపుతున్న ప్రైవేటు దవాఖాన్లు
హైదరాబాద్, వెలుగు: టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వారికి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు చేసే టెస్టుల్లో జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీబీకి సంబంధించిన సీబీ నాట్, ఎల్ పీఏ (లిక్విడ్ ప్రొఫైల్ ఎస్ఏ), లిక్విడ్ కల్చర్ టెస్టులు హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్నాయి. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్తగాసెంటర్లు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో టెస్టులు జర గడం లేదు. దీంతో ఎర్రగడ్డలోని టీబీ ట్రైనింగ్ సెంటర్‌కి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాంపి ల్స్ పంపుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబా ద్ జిల్లాల నుంచి ఎక్కువ నమూనాలు వస్తున్నాయి. ప్రతి నెలా 3వేలకుపైగా శాంపిల్స్ ఎర్రగడ్డ టీబీ ట్రైనింగ్ సెంటర్‌కు వస్తున్నాయి. వాటిలో ప్రైవేట్ హాస్పిటల్స్‌కి సంబంధించినవి 40 శాతా నికి పైనే ఉంటున్నాయి. ఇక్కడ వ్యాధిని నిర్ధారించే సీబీనాట్‌తో పాటు టీబీ వ్యాధికి మందులు వాడుతున్న వారికి మెడిసిన్స్ పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోడానికి ఎల్పీఏ టెస్టులు చేస్తారు. వాటికి సంబంధించిన రిపోర్టులు రెండు, మూడు రోజుల్లో వస్తాయి. ఈ రెండింట్లో నెగెటివ్ వచ్చి, టీబీ లక్షణాలున్నవారికి లిక్విడ్ కల్చర్ టెస్టులు చే స్తారు. ఈ రిపోర్టులకు 45 రోజుల టైం పడుతది. జిల్లాల నుంచి శ్యాంపిల్స్ వస్తున్నా అన్నిటికీ టెస్టు లు చేయట్లేదు. ఇలా సర్కార్ దవాఖాన్ల నుంచి వస్తున్న నమూనాల్లో 10% కూడా టెస్టులు చేయ డం లేదని తెలిసింది. నిరుడు మొత్తం 25వేల శ్యాంపిల్స్ రాగా, 10 వేల నమూనాలు పారేశారని సమాచారం.
రిపోర్టులు రావట్లే, మెడిసిన్స్మారట్లే
జిల్లాల్లో టీబీ బారినపడిన వారికి వైద్యులు మెడిసిన్స్ అందిస్తున్నారు. అయితే ఈ మెడిసిన్స్పని తీరుకి సంబంధించి రోగుల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎర్రగడ్డ టీబీ ట్రైనింగ్ సెంటర్‌కి పం పుతున్నారు. సరైన టైంకి టెస్ట్‌లు చేయడం లేదు. దీంతో రిపోర్టులందక అంతకుముందు ఇచ్చిన మందుల పనితీరు డాక్టర్లు తెలుసుకోలేకపోతున్నారు. దీంతో డాక్టర్లు ఇచ్చిన మందులే వాడుతున్నారు. ఆ మందులు పనిచేయని వారికి కొన్నాళ్లకు వ్యాధి మరింత ముదురుతున్నది.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బిల్లులు వసూల్
టీబీకి సంబంధించిన పరీక్షలు ప్రైవేట్లో ఒక్క సెంటర్‌లో మాత్రమే జరుపుతున్నారు. మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి చిన్న దవాఖాన్ల వరకు ఈ పరీక్షలు ఎర్రగడ్డలోని టీబీ ట్రైనింగ్ సెంటర్‌లో జరుగుతాయి. ప్రైవేట్ హాస్పిటల్స్నుంచి వస్తున్న శాంపిల్స్‌కి కూడా ట్రైనింగ్ సెంటర్‌లో ఫ్రీగానే టెస్టులు చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్ల వద్ద ఎలాంటి ఫీజులు వసూ ల్ చేయరాదు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ రోగుల వద్ద రూ.10వేల నుంచి రూ.15వేల దాకా వసూలు చేసి టీబీ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షించి రిపోర్టులు ఇస్తున్నాయి. ఇందుకు టీబీ ట్రైనింగ్ సెంటర్‌లో కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్‌తో చేతుల కలిపి వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉన్నతాధికారులు పట్టించుకుంటలే
ఉన్నతాధికారులు టీబీకి సంబంధించిన టెస్టుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లో ఎవరి ఇష్టానుసారంగా వారు టెస్టులు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన టెస్టులకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్నుంచి వచ్చిన టెస్టులు మాత్రం ఆలస్యంగానే జరుగుతున్నాయి. ట్రైనింగ్ సెంటర్‌కి వస్తున్న రిజిస్ట్రేషన్స్‌ని పరిశీలిస్తే ఈ విషయం పూర్తిగా బయటకు వస్తుంది. కానీ అంత లోతుగా ఉన్నతాధికారులు పరిశీలించడంలేదు. దీంతో రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతోంది.
ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు వసూల్ చేయొద్దు
హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌లో టీబీ టెస్టులు జరుగుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్‌కే శాంపిల్స్ వస్తున్నాయి. టెస్టుల విషయంలో నిర్లక్ష్యం జరగడం లేదు. జిల్లాల నుంచి వస్తున్న శాంపిల్స్‌కి నెలలో రిపోర్టులు అందుతున్నాయి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్నుంచి వస్తున్న నమూనాలకూ ఫ్రీగానే టెస్టులు చేస్తున్నం. ఈ టెస్టుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు వసూల్ చేయరాదు. ఫీజులు తీసుకొని ట్రైనింగ్ సెంటర్‌లో టెస్టులు చేయిస్తే హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ రాజేశం, తెలంగాణ స్టేట్ టీబీ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్