సాక్ష్యాలు ఎవరి ఆధీనంలో ఉండాలి? : డా. మంగారి రాజేందర్

నేర న్యాయవ్యవస్థను పరిశీలించినప్పుడు ఒక రకమైన నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. ఈ వ్యవస్థలు ఎవరిని నియంత్రిస్తున్నాయి? ఎవరి అదుపాజ్ఞల్లో ఉంటున్నాయి? అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. పలుకుబడి ఉన్న వాళ్లని ఒక రకంగా, పలుకుబడి లేని వాళ్లని మరో రకంగా చూస్తూ ఉంటారు. ఈ వ్యవస్థతో సంబంధం ఉన్న అధికారుల ప్రవర్తనా అధేవిధంగా ఉంటుంది. పోలీసు అధికారులు ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉండకూడదు. చట్టంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవు. ప్రభుత్వానికి పోలీసు దర్యాప్తుల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. అయినా పోలీసులు ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు కన్పిస్తుంది. మీడియాలో అలాంటి వార్తలే నిత్యం దర్శనమిస్తూ ఉంటాయి. 

పోలీసులు ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో ఉండటానికి ప్రధాన కారణం ప్రాధాన్యం ఉన్న పోస్టింగ్​ల కోసం. మరో కారణం కూడా ఉండవచ్చు. తాము చేసే అవినీతి పనులు బయట పడకుండా ఉండటం కోసం కూడా కావొచ్చు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మిగతా ఉద్యోగుల మాదిరిగా కాకుండా నిర్ణీత కాలం అయిపోగానే రావాల్సిన ప్రమోషన్​ వస్తుంది. అయినా వాళ్లు అలా ఎందుకు ఉంటున్నారు? ఇది వాళ్లకు వాళ్లే వేసుకోవాల్సిన ప్రశ్న.

అశోక్​కుమార్ ​టోడీ వర్సెస్​ కిష్వర్​ జహాన్ కేసు..

దర్యాప్తులో పైఅధికారుల జోక్యం ఉన్నట్టు​అనిపించినా, ప్రభుత్వ జోక్యం, ప్రభావం కానీ ఉన్నట్టు అనిపించినా ఆ కేసులను రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసే అధికారం హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. అశోక్​కుమార్​టోడీ వర్సెస్​కిష్వర్​జహాన్​ఇతరులు, ఏఐఆర్​ 2011 సుప్రీంకోర్టు 1254 కేసు అలాంటిదే. బాగా పలుకుబడి ఉన్న ఓ వ్యాపారుడి కూతురు ఓ ముస్లిం అబ్బాయిని ప్రేమించి 2007 ఆగస్టు 31న ప్రత్యేక వివాహచట్టం ప్రకారం పెండ్లి చేసుకుంది. తాము వివాహం చేసుకున్న విషయాన్ని కలకత్తా పోలీస్​కమిషనర్​కి, ఇతర సంబంధిత పోలీస్​అధికారులకు తెలియజేశారు. రిజిస్ట్రేషన్​సర్టిఫికెట్ ని కూడా పంపించారు. ఆ వివాహం సంగతి తెలిసిన వెంటనే అమ్మాయి తండ్రి, మేనమామ ఆమె దగ్గరకు వచ్చి తమ ఇంటికి రావాలని కోరారు. భర్త దగ్గర నుంచి రావడానికి ఆమె నిరాకరించింది. ఆ తెల్లవారి ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఆమె భర్తని బెదిరించారు. ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి వాళ్లిద్దరిని పోలీస్​స్టేషన్​కు పిలిచి ఇబ్బంది పెట్టారు. ఇలా చాలా సార్లు చేశారు. చివరికి ఓ వారం రోజులపాటు ఆమె తండ్రి దగ్గరకు పంపించాలని పోలీసులు ఆ అబ్బాయికి చెప్పి, ఆమెను తండ్రి దగ్గరకు పంపించారు. సరిగ్గా వారం తర్వాత ఆమె భర్త శవం నగరం శివారులోని రైల్వే ట్రాక్​దగ్గర కనిపించింది. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును సీబీఐకి పంపించాలని కలకత్తా హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కేసును సింగిల్​జడ్జి సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్లు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్​దాఖలు చేశారు. ఆ అమ్మాయి తండ్రి ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. డివిజన్​ బెంచ్​ ముందు అప్పీలు దాఖలు చేశాడు. డివిజన్​బెంచ్​సింగిల్​బెంచ్​ఉత్తర్వులను రద్దు చేసి మళ్లీ కొత్త దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. చివరికి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్​ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, సింగిల్​ జడ్జి ఆదేశాలను సమర్థించింది. సీనియర్​ పోలీస్​అధికారికి, ఆ అమ్మాయి తండ్రికి మధ్య అపవిత్ర బంధం ఉందని, అందువల్ల సీబీఐకి బదిలీ చేయడం న్యాయబద్ధమని అశోక్​ కుమార్ ​టోడీ వర్సెస్​ కిష్వర్​ జహాన్​ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో..

నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్​20, 21లో అంతర్భాగమని సుప్రీంకోర్టు బాబుబామి కేసులో స్పష్టం చేసింది. పాక్షిక దృష్టి అనేది రుజువు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ముద్దాయిల కోణం నుంచి పరిశీలించాలని సుప్రీంకోర్టు మోహన్​లాల్​కేసులో అభిప్రాయపడింది. ఈ రెండు కేసులను ప్రధానంగా ఉదహరిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి బి.విజయసేన్​రెడ్డి ‘ఎమ్మెల్యేల ఎర’ కేసును సీబీఐ దర్యాప్తు కోసం పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముద్దాయి హక్కులకు తీవ్ర భంగం కలిగిందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. సాక్ష్యాలు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు, సంబంధిత కోర్టులకు మాత్రమే తెలుస్తాయి. కోర్టు నుంచి వాటి ప్రతులను కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు తీసుకునే అవకాశం ఉంది. అలా తీసుకున్నప్పటికీ ముద్దాయి హక్కులకు భంగం కలిగేలా చర్యలు తీసుకోకూడదు. హైకోర్టు చెప్పినట్టు నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగానే 
పరిగణించాలి.

ప్రభుత్వ పెద్దలకు సాక్ష్యాలు ఇవ్వడానికి వీల్లేదు..

ప్రభుత్వ అధికారుల ముందు ఉన్నవి రెండే రెండు దారులు. శాసనం ప్రకారం పనిచేయడం మొదటిదైతే, ప్రభుత్వాధినేతల అభీష్టం ప్రకారం పని చేయడం రెండవది. రెండో దారి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తే సమ న్యాయపాలన(రూల్​ఆఫ్​లా) అనేది అలంకార ప్రాయంగా మిగిలిపోతుంది. నేర న్యాయవ్యవస్థ బలహీనులను, సామాన్యులను, ప్రత్యర్థులను నియంత్రించడానికే ఉపయోగపడుతుంది. కాగ్నిజబుల్​నేర సమాచారం పోలీసు అధికారికి అందిన వెంటనే ఎఫ్ఐఆర్​ను విడుదల చేసి, దర్యాప్తు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఎఫ్​ఐఆర్​కాపీని సంబంధిత జ్యుడీషియల్​మేజిస్ట్రేట్​కి, పైపోలీస్​ అధికారికి పంపించాలి. దర్యాప్తులో భాగంగా నేర స్థలాన్ని పరిశీలించడం, సాక్షులను, అనుమానం ఉన్న వ్యక్తులను విచారించడం, వారి వాంగ్మూలాలను నమోదు చేయడం, సోదాలు చేయడం, ఆస్తిని జప్తు చేయడం, కాలి ముద్రలను, వేలి ముద్రలను సేకరించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ముద్దాయిని కూడా విచారించవచ్చు. సాక్ష్యాలను సేకరించిన తర్వాత, అవసరమైనప్పుడు ముద్దాయిని గుర్తించి అరెస్ట్​చేయడం పోలీసుల విధి. సేకరించిన సాక్ష్యాలను సంబంధిత కోర్టుకు వెంటనే పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు ఆ సమాచారాన్ని, ఆ సాక్ష్యాలను ఇవ్వడానికి వీల్లేదు. అలా ఇవ్వడాన్ని చట్టం సమ్మతించదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకూ సాక్ష్యాలను ఇవ్వడానికి వీల్లేదు.

దర్యాప్తులో జోక్యం ఉండదు..

పోలీసులు ఒక నేరాన్ని పరిశోధిస్తున్న క్రమంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వానికి అసలే లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మేజిస్ట్రేట్ ​కొంత మేరకు జోక్యం చేసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టుల అధికారాలు అపరిమితం. కేసు దర్యాప్తు అనేది శాసనం పోలీసులకు ఇచ్చిన అధికారం. ప్రభుత్వానికి ఉన్న అధికారం ఒక్కటే. కేసు ఉపసంహరణ అధికారం. ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ అధికారాన్ని ప్రభుత్వం కేసు దర్యాప్తు దశలో చేయకూడదు. కేసు విచారణ సమయంలో మాత్రమే ఈ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తేనే ప్రాసిక్యూటర్​  కేసును ఉపసంహరించుకుంటాడు. ప్రజాహితం ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు ఆ అనుమతి ఇస్తాయి. ఈ సందర్భంలో తప్ప మరే సందర్భంలో ప్రభుత్వం కేసుల దర్యాప్తుల విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. సాక్ష్యాలను పరిశీలించే అధికారం అంతకన్నా లేదు. పోలీసులు శాసనబద్ధంగా పని చేసినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది. పోలీసులు చట్టబద్ధమైన ఉత్తర్వులనే పాటించాలి. చట్ట వ్యతిరేకమైన ఉత్తర్వులను వారు ఉపేక్షించాల్సి ఉంటుంది. పోలీస్​ చట్టంలోని సెక్షన్​23 ఇదే విషయం చెబుతుంది. పోలీసులు చట్టబద్ధమైన ఉత్తర్వులను, వారంట్లని అమలు చేయాలి. అంతేగానీ చట్టబద్ధం కాని ఉత్తర్వులని పాటించాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. దాని వల్ల పోలీసులు ఇబ్బందుల పాలుకావాల్సి వస్తుందని, వారికి ఎలాంటి రక్షణా లభించదని సుప్రీంకోర్టు స్టేట్​ఆఫ్​ వెస్ట్​ బెంగాల్​వర్సెస్​ మాన్​మంగల్​ సింగ్, 1981 క్రిమినల్​లా జర్నల్1683లో స్పష్టం చేసింది.

- డా. మంగారి రాజేందర్,న్యాయ వ్యాఖ్యాత, కవి, రచయిత