గోదావరి స్నానఘట్టాల వద్ద  రక్షణ కరువు!

గోదావరి స్నానఘట్టాల వద్ద  రక్షణ కరువు!
  • భద్రాచలంలో నిత్యం ప్రమాదాలు
  • తాజాగా దీపావళి సందర్భంగా స్నానానికి దిగిన వ్యక్తి దుర్మరణం
  • ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది మృతి 
  • పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో భక్తులు 
  • కార్తీక పూజలు షరూ.. ఇప్పుడైనా చర్యలు చేపట్టాలని వేడుకోలు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు కరువయ్యాయి. పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు అవగాహన లేక లోతుకు వెళ్లి గల్లంతవుతున్నారు. ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గురువారం దీపావళి సందర్భంగా సీతారామచంద్రస్వామి దర్శనం కోసం హైదరాబాద్​ నుంచి ఫ్రెండ్స్​తో కలిసి వచ్చిన చలపతి అనే యువకుడు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతై చనిపోయాడు.

నిత్యం భక్తులు ప్రాణాలు కోల్పోతున్నా పర్యవేక్షించాల్సిన ఎండోమెంట్, ఇరిగేషన్, పోలీస్​, ఫైర్​ శాఖలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలకు దిగి చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 

కార్తీక పుణ్యస్నానాలకు తరలిరానున్న భక్తులు 

గోదావరిలో పుణ్యస్నానం చేసి రామదర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే ముందుగా భద్రాచలం వచ్చిన భక్తులు గోదావరి స్నానఘట్టాల వద్దకు వెళ్తారు. ప్రస్తుతం కార్తీక మాసం షురూ అయింది.  కార్తీక పుణ్యస్నానాలకు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి వస్తారు. కానీ ఇక్కడ సరైన ఏర్పాట్లు లేవు. కనీస హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. నదిలో లోతును అంచనా వేసి మెష్​​లు కట్టి లోపలికి వెళ్లనీయకుండా పహారా కోసం టీమ్​లు ఏర్పాటు చేయాలి. కానీ గోదావరి వరదలు వచ్చి తగ్గాక నీటి ప్రవాహం, లోతును ఇప్పటి వరకు అంచనా వేయకపోవడం ఆఫీసర్ల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. 

పెరిగిన మృతుల సంఖ్య 

ఈసారి భద్రాచలయంలోని గోదావరి స్నానఘట్టాల వద్ద చనిపోయినవారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2014లో ఆరుగురు, 2015లో ఏడుగురు, 2016లో ఐదుగురు, 2017లో ఐదుగురు, 2018లో నలుగురు, 2019లో నలుగురు, 2020లో ఐదుగురు, 2021లో  ఎనిమిది మంది, 2022లో 12 మంది, 2023లో పది మంది గల్లంతై చనిపోగా,  2024లో మాత్రం ఇప్పటికే 20 మంది గోదావరిలో మునిగి మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారు.

నీళ్లను చూడగానే ఉత్సహంతో లోపలికి వెళ్తున్న యవకులు లోతు అంచనా వేయడంలో విఫలమై ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. దేవస్థానం తరఫున ఇద్దరు గజ ఈతగాళ్లను నియమించినా వారు సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నిత్యం భక్తులను ఫొటోలు తీసుకుంటూ జీవనాధారం పొందే ఫొటోగ్రాఫర్లే  గల్లంతు అయిన వారిని కాపాడుతున్నారు. బోటు నడిపే కరుకు ప్రసాద్​ కూడా నిత్యం భక్తులను పడవల ద్వారా రక్షిస్తున్నారు. అధికారికంగా అక్కడ ఎవరూ ఉండటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండాచర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు చెప్పాం..

ప్రమాదాల గురించి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు చెప్పాం. లోతు అంచనా వేసి మెష్​లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవస్థానం తరఫున ఇద్దరు గజ ఈతగాళ్లను నియమించాం. భక్తుల్లో కొందరు  చెప్పినా వినకుండా లోతుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూస్తాం.
 - రవీందర్​, ఈఈ, దేవస్థానం