పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ

పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసులు అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికిప్పుడు వేల సంఖ్యలో ఉన్న గణేష్ (పీవోపీ) విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయించాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని.. ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. 

ఇప్పటికిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల ప్రత్యేకంగా కృత్తిమ కొలనులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇది చాలా కష్టంతో  కూడుకున్న పని. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై అందరూ వేచిచూస్తున్నారు. 

హైదరాబాద్ ట్యాంక్ బండ్ సహా చెరువుల్లో నీరు కలుషితం కావొద్దంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్తిమ కొలనుల్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నిబంధనలను కొట్టి వేయాలని పేర్కొంటూ గణేష్ మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం, మరో ఎనిమిది మంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ శ్రవణ్ కుమార్ తో కూడిన బెంచ్ సోమవారం (సెప్టెంబర్ 25వ తేదీన) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.