నేడు తెలంగాణ, ఏపీ సీఎంల కీలక భేటీ.. నీళ్లు, నిధులు, ఆస్తుల పంపిణీపై చర్చ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ప్రజాభవన్ వేదికగా శనివారం జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య జరగనున్న ఈ సమావేశంలో పదేండ్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్​లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాలు, విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్ లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. 

ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుమారు 30 భేటీలు జరిగాయి. ఆయా సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని చిక్కుముళ్లు, అందుకు గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్​ అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మార్చిలో రేవంత్​రెడ్డి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్​కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. 

ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్​కు సంబంధించిన నిధుల పంపిణీ సమస్య కూడా పరిష్కారమైంది. షెడ్యూల్​ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్​లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. రాజ్​భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై కూడా వివాదం ఉంది. విద్యుత్​ సంస్థల బకాయిలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొలిక్కి రాలేదు. సుమారు రూ.24 వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉందని తెలంగాణ, రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాలని ఏపీ వాదిస్తున్నాయి.  

పెండింగ్​లోనే భూములు, భవనాలు, ఉద్యోగాల పంపిణీ..

ఈ ఏడాది జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసినందున ప్రస్తుతం ఏపీ అధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్​హౌస్​, సీఐడీ ఆఫీసు, హెర్మిటేజ్ కాంప్లెక్స్​తో పాటు మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్​లో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. స్థానికత, ఆప్షన్స్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్​లో ఉంది.

ఏపీ స్థానికత కలిగిన 1,853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు సివిల్​సప్లై డిపార్ట్​మెంట్​కు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రావాల్సి ఉంది. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై కూడా చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల సీఎంను కోరారు. తొమ్మిదో షెడ్యూల్​​విషయంలో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. డెక్కన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభు త్వం వెనక్కి  తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి, స్టే ఆర్డర్ తెచ్చుకుంది.

ఏపీ స్టేట్ ఫైనాన్స్​కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తీసుకుంది. ఇప్పటికీ స్టేట్​ఫైనాన్స్​కార్పొరేషన్​ విభజన జరగకపోవడంతో అక్కడ మొత్తం ఏపీ అధికారుల పెత్తనమే నడుస్తున్నది. ఇక పదో షెడ్యూల్​లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాల్సి ఉండగా.. దీనిపైనా రిట్​ పిటిషన్​ దాఖలైంది. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్​ ఓపెన్​ వర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్​యూ ఫైన్​ఆర్ట్స్​యూనివర్సిటీ విభజన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.   

కృష్ణా జలాల పంపిణీ..

తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చకు వచ్చే ప్రధానాంశాల్లో ఒకటి కృష్ణా జలాల పంపిణీ. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో జరిగిన నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనే వాదన మొదటి నుంచీ ఉంది. ఏపీకి 512 టీఎంసీలు కేటాయించగా.. తెలంగాణకు కేవలం 299 టీఎంసీలనే కేటాయించారు. అదే నీటి వాటాకు అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పటికీ అదే కొనసాగుతుండడంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వాటాలపై కొట్లాడేందుకు సిద్ధమైంది. ఆ వాటాలు కేవలం ఆ వాటర్ ఇయర్​కు మాత్రమేనని ప్రభుత్వం తేల్చి చెప్తున్నది. కృష్ణా బేసిన్​లోని జలాలను 50:50 చొప్పున పంచాల్సిందేనని పట్టుబడుతున్నది. అందుకు అనుగుణంగానే స్టేట్మెంట్ ఆఫ్ కేసును కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2కు (కేడబ్ల్యూడీటీ 2– బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ఇటీవల ఇరిగేషన్ అధికారులు సమర్పించారు. వాస్తవానికి కృష్ణాలో 2,099 టీఎంసీల నీటి లభ్యత ఉందని, వాటిని తమకు కేటాయించాలని రెండు తెలుగు రాష్ట్రాలూ తమ తమ ఎస్వోసీల్లో కోరాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం 955 టీఎంసీల నీటి వాటాకు పట్టుబడుతుండగా.. ఏపీ 1,130 టీఎంసీలు అడుగుతున్నది. వీటి మీద ఇద్దరు సీఎంల మధ్య  ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.

రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు భావిస్తున్నట్టు తెలిసింది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచీ నీళ్లు తోడుకెళ్లేలా తలపెట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​పైనా చర్చించే అవకాశం లేకపోలేదు. ఏపీ అక్రమంగా కడుతున్న ఆ ప్రాజెక్టు వివరాలను ‘వెలుగు’ పత్రిక బయటకు తెచ్చింది. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్ దానిపై సప్పుడు చేయలేదు. ఇప్పుడు దాంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుపైనా సీఎంల మీటింగ్​లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపైనా మాట్లాడే చాన్స్​ఉంది. కామన్ ప్రాజెక్టులపై సామరస్యంగా  ముందుకెళ్లవచ్చని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య గొడవలతో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్​ను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తన అధీనంలోకి తీసుకున్నది. దీన్ని మళ్లీ రాష్ట్రాల అధీనంలోకే తీసుకొచ్చేలా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరవచ్చని భావిస్తున్నారు. 

రూ.2 వేల కోట్ల డిపాజిట్లపై స్పష్టత కరువు

ఏపీ నుంచి తమకు వివిధ రకాలుగా సుమారు రూ.24 వేల కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సర్కార్​ వాదిస్తోంది. ఇందులో పవర్​ యుటిలిటీస్​ కిందే ఏపీ రూ.12,111 కోట్లు ఇవ్వాలని అంటోంది. అదే సమయంలో టీఎస్ జెన్​కో తమకు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,422 కోట్లు ఉన్నాయని ఏపీ చెబుతోంది. ఏపీ నుంచి సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌‌లకు సంబంధించిన రూ.495 కోట్ల బకాయిలు ఏడేండ్లుగా పెండింగ్​లో  ఉన్నాయని తెలంగాణ అంటోంది. స్టేట్​ ఫైనాన్స్​కార్పొరేషన్, పవర్​ ఫైనాన్స్​కార్పొరే షన్​ విభజన సైతం పూర్తి స్థాయిలో కాలేదు. ఫిల్మ్​ డెవలప్ మెంట్, టీఎస్ఎంఎస్ఐడీసీ, మినరల్​ డెవలప్​మెంట్​వంటి ఆస్తుల పంపకాలు, షేర్లపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్​అకౌంట్ల కింద ఫిక్స్​డ్ డిపాజిట్లు దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు  ఉండగా, వాటిపై స్పష్టత రావాల్సి ఉందని ఆఫీసర్లు అంటున్నారు.

తెలంగాణ డిమాండ్లలో మరికొన్ని.. 

  •     ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి.
  •     కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి. 
  •     తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24 వేల  కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి.  
  •     ఏపీకి వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఈ కోస్టల్​ కారిడార్​లో తెలంగాణకు వాటా కావాలి.
  •     తెలంగాణకు ఓడరేవులు లేనందున  విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం ఇవ్వాలి.
  •     తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణకు వాటా ఇవ్వాలి.