- నగరంలో వణుకుతున్న జనం
- రోజుకు 15 కేసులు
- అరికట్టలేకపోతున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: సిటీలో కుక్కల బెడద నెలకొంది. గుంపులుగుంపులుగా తిరుగుతూ జనం మీదికి ఎగబడుతున్నాయి. దీంతో బయట కాలు పెట్టాలంటే ప్రజలు వణుకుతున్నారు. కుక్కలను అరికట్టాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడం లేదు. సిటీలో స్టెరిలైజేషన్ సెంటర్ ఉన్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు స్టెరిలైజేషన్ పేరున నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నగరంలో 70 వేలకు పైగానే..
జీడబ్ల్యూఎంసీ పరిధిలో దాదాపు 70 వేల కుక్కలున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు గతంలో గుర్తించారు. ప్రస్తుతం వాటి సంఖ్య లక్షకు చేరింది. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు సిటీలోని చింతగట్టు వద్ద ఏబీసీ(యానిమల్బర్త్ కంట్రోల్) సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి, ఆ తర్వాత డీవార్మింగ్, రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వదిలిపెట్టాల్సి ఉంటుంది. కానీ ఆఫీసర్లు ఇవేమీ చేయడం లేదు.
ఏటా రూ.లక్షల ఖర్చు..
కుక్కల నియంత్రణ, స్టెరిలైజేషన్ ప్రక్రియను బల్దియా ఆఫీసర్లు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఏబీసీ సెంటర్ లో కుక్కలు ఉన్నన్ని రోజులు వాటికి ఆహారం, సర్జరీ, తీసుకొచ్చే సిబ్బంది వేతనాలు అన్నీ కలిపి బల్దియా ఒక్కో కుక్కకు దాదాపు రూ.800 చొప్పున చెల్లిస్తోంది. ఒక్కో రోజుకు 25 నుంచి 30 కుక్కల చొప్పున.. ఏటా సగటున వెయ్యి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అవేమీ చేయకుండానే తప్పుడు లెక్కలు సృష్టించి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెలకు 500 మందికి కాట్లు..
సిటీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దారి వెంట వెళ్లే జనాలను కరుస్తున్నాయి. ముఖ్యంగా శివనగర్, లేబర్కాలనీ, కాశీబుగ్గ, జులైవాడ, అడ్వకేట్స్కాలనీ, వడ్డేపల్లి, కాజీపేట, గోపాలపూర్, హసన్పర్తి, చింతగట్టు, సోమిడి తదితర ప్రాంతాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంది. విలీన గ్రామాల్లోనూ గుంపులుగా తిరుగుతున్నాయి. కుక్కకాటుకు గురైన జనం వరంగల్ ఎంజీఎంకు పరుగులు తీస్తున్నారు. రోజుకు సగటున 15 కేసులు వస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 450 నుంచి 500 మంది వరకు కుక్కకాటు కేసులుంటున్నాయి. స్టెరిలైజేషన్ ప్రక్రియను లైట్ తీసుకోవడం, కుక్కల గుంపులను గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.
నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నం
గ్రేటర్ వరంగల్ లో కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఓ ఆఫీసర్ ను నియమించి పర్యవేక్షిస్తున్నాం. సమస్య ఉన్న ప్రాంతాలకు ఎప్పటికప్పుడు డాగ్ క్యాచర్స్ ను పంపిస్తున్నాం. స్టెరిలైజేషన్ అనంతరం వాటివాటి ఏరియాల్లో వదిలిపెడుతున్నం. యానిమల్ బర్త్ కంట్రోల్ కు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. - డా.జ్ఞానేశ్వర్, సీఎంహెచ్వో, జీడబ్ల్యూఎంసీ