ఓవర్ టు ఢిల్లీ: ప్రాంతీయ పార్టీలతో ఇండియా Vs ఎన్డీఏ మీటింగ్స్

ఓవర్ టు ఢిల్లీ: ప్రాంతీయ పార్టీలతో ఇండియా Vs ఎన్డీఏ మీటింగ్స్
  • = ఇండియా X ఎన్డీఏ
  • = ఇవాళే రెండు కూటముల మీటింగ్స్
  • = హస్తిన బయల్దేరిన పవన్, బాబు
  • = ఒకే ఫ్లైట్ ఎక్కిన నితీశ్, తేజస్వీ
  • = ఆసక్తికరంగా మారిన పాలిటిక్స్

ఢిల్లీ: లోక్ సభ ఫలితాలు అనూహ్యంగా రావడంతో అందరి దృష్టీ హస్తిన వైపు మళ్లింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మార్కును చేరకపోవడంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అటు ఇండియా కూటమి కూడా 231 సీట్లు సాధించి టైట్ ఫైట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కూటముల భాగస్వామ్య పక్షాల మీటింగ్స్ ఇవాళ ఢిల్లీలో  జరుగనున్నాయి. ఈ సమావేశానికి భాగస్వామ్య పక్షాల అధినేతలు హాజరవుతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్​ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 

అటు బీహార్ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నజేడీయూ అధినేత నితీశ్ కుమార్ పట్నా నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఇదే విమానంలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్డీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉండటం ఒకరి వెనకాల సీట్లో మరొకరు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.  జేడీయూ ఎన్డీఏను వీడుతుందని నిన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేత కేసీ త్యాగి క్లారిటీ ఇచ్చారు. తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని కుండబద్దలు కొట్టారు. గతంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, నీతీశ్‌లు రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి చేరిన విషయం తెలిసిందే.  

నితీశ్‌కుమార్‌.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.  ఆ తర్వాత ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. ఇదిలా ఉండగా తమ భాగస్వామ్య పక్ష పార్టీలతో సమావేశాల్లో పాల్గొనేందుకు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ రెండు కూటములు ఏం చర్చించబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.