- ఎవరికి వారే వేర్వేరుగా కార్యక్రమాల నిర్వహణ
- నేడు నర్మెటలో పొన్నాల, కొమరవెళ్లిలో కొమ్మూరి హాత్ సే హాత్ జోడో యాత్ర
- టికెట్ సాధించుకునే ప్రయత్నాల్లో జంగా రాఘవరెడ్డి
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో మొదలుకొంటే హాత్ సే హాత్ జోడో యాత్ర వరకు ఎవరికి వారే.. అన్నట్లుగా సాగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల హీట్ పెరగడంతో పాటు పార్టీలో గ్రూపుల లొల్లితో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా నాయకులు మూడు గ్రూపులుగా మారి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డి వేర్వేరుగా యాత్రలు చేపడుతుండడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
నియోజకవర్గంలో తిరుగుతున్న పొన్నాల
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను శాసించిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వర్గపోరుతో అవస్థలు పడుతున్నారు. ఈయన హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, స్థానికంగా ఉండకపోవడంతో అనుచరులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో తీవ్ర టెన్షన్ మధ్య టికెట్ తెచ్చుకొని ఓటమి పాలైన పొన్నాల ఆ తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువని, కార్యకర్తలకు కనీస భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్నికల సీజన్ మొదలుకావడంతో పొన్నాల మళ్లీ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. హాత్ సే హాత్ జోడో పేరుతో ఈ నెల 3, 4 తేదీల్లో మద్దూరు, జనగామ మండలాల్లో పర్యటించారు. శుక్రవారం నుంచి నర్మెట్ట మండలంలో యాత్ర చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు బొమ్మకూరులో ప్రారంభం కానున్న యాత్ర హన్మంతాపూర్, నర్మెట్ట, ఇప్పలగడ్డ, ఆగపేట, మాన్‌సింగ్ తండా, గండిరామారంలో ముగియనుంది.
పొన్నాలకు పోటీగా కొమ్మూరి
గత ఎన్నికల టైంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే టికెట్ పొన్నాలకు దక్కడంతో సైలెంట్ అయిన ఆయన ఈ సారి ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు జనగామ నియోజకవర్గంలో పొన్నాలకు పోటీగా యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటలకు కొమురవెళ్లి మల్లన్న ఆలయం నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని షెడ్యూల్ ప్రకటించారు. ఈ యాత్ర రసులాబాద్, ఐనాపూర్, తపాస్‌పల్లి, గురువన్నపేట, పోసాన్‌పల్లి, రాంసాగర్ల మీదుగా సాగనుంది. 11న కిష్టంపేట, వేచరేణి, లెనిన్ నగర్, మర్రిముస్త్యాల, 13, 14 న తరిగొప్పుల, 15, 16న నర్మెట, 17, 18 తేదీల్లో చేర్యాల మండలాల్లో యాత్ర కొనసాగేలా కార్యచరణ సిద్ధం చేశారు. అయితే అటు పొన్నాల, ఇటు కొమ్మూరి ఇద్దరూ ఒకే రోజు విడివిడిగా యాత్రలు చేపడుతుండడంతో పార్టీ లీడర్లు అయోమయానికి గురవుతున్నారు.
పోటీకి జంగా సైతం సై..
జనగామ టికెట్ కోసం ఓ వైపు పొన్నాల, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీ పడుతుండగానే మరో వైపు డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి సైతం టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. జనగామ గానీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఏదో ఒక టికెట్ తెచ్చుకునే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా పేరున్న జంగా రాఘవరెడ్డి ప్రస్తుత చీఫ్ రేవంత్‌రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికి వారుగా కార్యక్రమాల నిర్వహణ
జనగామ కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. కార్యకర్తలు కూడా మూడు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ జెండా పండుగలు మొదలుకుని ఇటీవల ఎల్‌ఐసీ ఆఫీస్ ముందు ధర్నాల వరకు అన్నీ వేర్వేరుగానే నిర్వహించారు. ఇప్పటికీ మండల కమిటీలు సైతం పొన్నాల వర్గం, జంగా వర్గాలుగా ఉన్నాయి. అయితే పార్టీలోని గ్రూపుల కొట్లాటలు అధికార పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.