- నేటికీ అప్‌డేట్ కాని ప్రభుత్వ సర్వేయర్లు
- జగిత్యాల జిల్లాలో సర్వేల కోసం పెరుగుతున్న అప్లికేషన్లు
- ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న రైతులు
జగిత్యాల, వెలుగు: రైతుల గెట్ల పంచాయతీలు తీర్చేందుకు చేయాల్సిన భూముల సర్వేల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మారుతున్న కాలనీకి అనుగుణంగా డిపార్ట్మెంట్అప్డేట్కాలేదు. పాత పద్ధతిలో గొలుసు(చైన్)తోనే భూములు కొలుస్తున్నారు. మరోవైపు మండలాల్లో సర్వేయర్ల కొరత, సరైన ఎక్విప్మెంట్లేదు. దీంతో ప్రతినెలా పదుల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతోపాటు పాత పద్ధతితో కచ్చితత్వం లేకపోవడంతో రెండు, మూడు సార్లు అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రతినెలా సుమారు వెయ్యి వరకు అప్లికేషన్లు వస్తాయి. వీటిని ఆఫీసర్లు 40 రోజుల్లో పరిష్కరించలేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జగిత్యాలకు పాత పద్ధతే..
ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిల్లో డీజీపీఎస్, ఈటీఎస్ టెక్నాలజీతో సర్వే చేస్తున్నారు. జగిత్యాలకు కొత్త టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు జిల్లాలో 19 సర్వే పోస్టులకు ప్రస్తుతం నలుగురు సర్వేయర్లు పనిచేస్తున్నారు. దీంతో ఒక్కో సర్వేయర్రెండు, మూడు మండలాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చైన్ సిస్టం కావడంతో సర్వేలు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది లో 307 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో మండలం నుంచి సుమారు 50కి పైగా అప్లికేషన్లు వస్తుంటాయి. 40 రోజుల్లో పూర్తి కాకపోగా.. పూర్తి చేసినా కచ్చితత్వంతో లేకపోవడంతో రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.
డీజీపీఎస్, ఈటీఎస్‌లతో కచ్చితత్వం
ప్రభుత్వం పాతిన హద్దు రాళ్లు, టిపన్‌లోని కొలతల ఆధారంగా సర్వే నిర్వహిస్తారు. ఈ చైన్ సిస్టం ద్వారా కొలిచిన కొలతలు ఒక్కోసారి తప్పు వచ్చే అవకాశాలున్నాయి. టైంతోపాటు పని చేసేందుకు చాలా మంది అవసరం. డీజీపీఎస్( డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్సిస్టం), ఈటీఎస్( గ్లోబల్ పొజిషనింగ్సిస్టం)లతో చేసే సర్వే శాటిలైట్, లేజర్ ఆధారంగా పని చేస్తాయి. ఈ సర్వేలో ప్రతి ఇంచు లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు సైతం ప్రైవేట్ సర్వేయర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఆర్థికభారం కావడం.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో సర్వేల్లో ఆలస్యం జరుగుతోంది.
సర్వే కోసం ఎదురుచూస్తున్నాం
నాకు రెండెకరాలకు పట్టా ఉంది. పాస్ బుక్ లో 2 ఎకరాలు ఉన్నా మోఖా మీద 1.20 గుంటలు మాత్రమే ఉంది. సర్వే చేసినా భూమి గుర్తించలేదు. మరోసారి సర్వే చేయాలని అప్లై చేశాను. సుమారు రెండు నెలలు పడుతుంది. త్వరితగతిన సర్వే చేసేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి
- రామయ్య, రైతు, జగిత్యాల
-