మెట్ పల్లి హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది లేక ఇబ్బందులు

  • శాంక్షన్ పోస్టులు 61... ఖాళీలు 41
  • ఒక్కరే గైనకాలజిస్ట్...  నెలకు 100 కు పడిపోయిన డెలివరీలు
  •  పూర్తి స్థాయిలో అందని వైద్యసేవలు... 
  • పట్టించుకోని వైద్యశాఖ ఉన్నతాధికారులు

మెట్ పల్లి, వెలుగు: మెట్​పల్లి గవర్నమెంట్​దవాఖానాలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. 24 మంది వైద్యులకు కేవలం ఆరుగురు డాక్టర్లతో నెట్టుకొస్తున్నారు. రోగులకు ఎమర్జెన్సీ, మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ముగ్గురు గైనకాలజిస్ట్ లు ఉండాల్సిన ఈ హాస్పిటల్ లో నాలుగు నెలలుగా కేవలం ఒక్కరే ఉన్నారు.  దీని వల్ల డెలివరీకి వచ్చే గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు.  డాక్టర్ కోసం గంటల పాటు  నిరీక్షిస్తున్నారు.  మూడు జిల్లాల సరిహద్దుగా ఉన్న మెట్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రతి నెల 150  నుంచి 200  డెలివరీలు జరుగుతుంటాయి.   మొత్తం శాంక్షన్ పోస్టులు 61 కాగా 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల నిర్లక్ష్యం...  వైద్య విధాన పరిషత్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ప్రతిరోజూ 300 లకు పైగా ఓపీ సేవలు

నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మెట్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆయా జిల్లాల నుంచి  చికిత్స కోసం ప్రతి రోజూ సుమారు 300 మందికి పైగా రోగులు వస్తుంటారు.  రోగుల తాకిడికి తగినట్టుగా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి వెయిట్​ చేయాల్సి వస్తోంది.  డాక్టర్లు ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 లోపు విధులు ముగించుకొని వెళ్తున్నారు. రోగుల పరిస్థితి సీరియస్ గా ఉంటే వెంటనే నిజామాబాద్ లేదా, జగిత్యాల ఏరియా హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తున్నారు.  మిగతా వారిని రేపు రావాలని పంపించేస్తున్నారు.  

 గర్భిణుల పరిస్థితి  దయనీయం

మెట్ పల్లి డివిజన్ పరిధిలోని పీహెచ్ సీ నుంచి , ఇతర జిల్లాల నుంచి డెలివరీల కోసం హాస్పిటల్ కు వచ్చే గర్భిణుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరోగ్య సమస్యలతో, మంత్లీ చెకప్ కోసం వందలాది మంది గర్భిణులు వస్తారు.  కానీ  ముగ్గురు  గైనకాలజిస్ట్ ఉండాల్సిన చోట ఒక్కరే అందుబాటులో ఉన్నారు.  నాలుగు నెలలుగా ఒక్కరే గైనకాలజిస్ట్ ఉండడంతో  డెలివరీలు తగ్గాయి.  చాలా మంది గర్భిణులకు డెలివరీల కోసం జగిత్యాల హాస్పిటల్ కు పంపుతున్నారు.

ఇవి ఖాళీలు.. 

మెట్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో మొత్తం శాంక్షన్ పోస్టులు 61. ఇందులో  కేవలం 20  పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి.  మిగతా 41 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.  సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 5  గురికి ఒక్కరే ఉన్నారు.  4  ఖాళీగా ఉన్నాయి.  డిప్యూటీ సివిల్ సర్జన్లు పోస్టులు ఆరు  ఉండగా అన్ని ఖాళీగా ఉన్నాయి.  డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో ఖాళీగా ఉంది.  సివిల్ అసిస్టెంట్ సర్జన్ 11 మందికి ఐదుగురు మాత్రమే ఉన్నారు.  మిగతా ఆరు ఖాళీగా ఉన్నాయి.  డెంటల్ అసిస్టెంట్ సర్జన్  పోస్టు ఖాళీగా ఉంది.  పిజియోథెరపిస్టు ఒకటి ఉంటే ఎవరినీ నియమించలేదు.  స్టాఫ్ నర్సు పోస్టులు 14 ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  రేడియోగ్రాఫర్ పోస్టు ఖాళీగా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు ఉండగా ఎవరిని నియమించలేదు. డార్క్ రూం అసిస్టెంట్ ఒక పోస్టు ఉండగా ఖాళీగా ఉంది. పార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఎన్వో, ఎఫ్ఎన్వో పోస్టులు ఐదు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి. వాటర్ మ్యాన్ 1, డ్రైవర్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

డాక్టర్లు, సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం

మెట్ పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది  పోస్టులు ఖాళీగా ఉన్నది వాస్తవమే.  ఖాళీ పోస్టుల్లో డాక్టర్లను నియమించాలని ఉన్నతాధికారులను నివేదించాం. ప్రతిరోజూ  వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రికి వస్తున్నారు . ఉన్న డాక్టర్లకు పని భారం ఎక్కువ అవుతోంది.  ప్రతి నెల 200 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయి.  డాక్టర్లు, సిబ్బంది తక్కువగా ఉన్నా  రోగులకు మెరుగైన  వైద్యసేవలు అందజేస్తున్నాం.  ఖాళీలను భర్తీ చేస్తే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యసేవలు చేయొచ్చు. 
-  డాక్టర్. సాజిద్ అహ్మద్, సూపరింటెండెంట్, మెట్ పల్లి