అర్బన్​లో ఇందిరమ్మ ఇండ్లకు జాగలు కరువు.. అప్లికేషన్లు ఎక్కువ.. సొంత ప్లేస్​ ఉన్నోళ్లు తక్కువ

అర్బన్​లో ఇందిరమ్మ ఇండ్లకు జాగలు కరువు.. అప్లికేషన్లు ఎక్కువ.. సొంత ప్లేస్​ ఉన్నోళ్లు తక్కువ
  • జీహెచ్ఎంసీలో 10 లక్షల  అప్లికేషన్లలో 1,164 మందికే జాగాలు
  • ఇతర కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి
  • అర్బన్ ఇండ్లకే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు
  • లేకుంటే ఫండ్స్​  ఆగిపోయే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్లికేషన్ల సర్వేలో కొత్త అంశం వెలుగుచూసింది.  అర్బన్ ప్రాంతాల్లో లక్షల మంది ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకోగా.. ఇందులో ఎక్కువ మందికి సొంత జాగలు లేవని అధికారుల సర్వే లో తేలింది.  ముఖ్యంగా జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పబ్లిక్ పెట్టుకున్న అప్లికేషన్లలో  25 శాతం మందికి కూడా సొంత జాగలు లేవని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయ్యాక ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాగా, నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మంది సొంత జాగ ఉన్న పేదలకు తొలి దశలో ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రేటర్​లో 1,164 మందికే సొంత జాగలు

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం 80 లక్షల 54 వేల 554 అప్లికేషన్లు రాగా.. ఇందులో జీహెచ్ ఎంసీ నుంచి అత్యధికంగా 10 లక్షల 70 వేల 659 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు ఎక్కువ వచ్చిన జిల్లాల్లో తర్వాతి స్థానాల్లో నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, సంగారెడ్డి ఉన్నాయి.  ఇదే సమయంలో సొంత జాగలు తక్కువ ఉన్న జిల్లాల్లో భూపాలపల్లి, గద్వాల ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో వచ్చిన అప్లికేషన్లలో అర్బన్ ఏరియాల్లో 25 శాతం మందికి కూడా సొంత జాగాలు లేవని సర్వేలో తేలింది.  గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో అయితే కేవలం 1,164 మందికే సొంత జాగ ఉన్నట్టు వెల్లడయిందని అధికారులు చెబుతున్నారు.  ఇతర జిల్లాల్లో  సుమారు 70 శాతం సర్వే పూర్తి కాగా..  జీహెచ్​ఎంసీలో 15 శాతం లోపే సర్వే పూర్తయింది.  రాష్ట్రంలో  150 కి పైగా మున్సిపాలిటీలు, సుమారు 15 కార్పొరేషన్లు ఉండగా ఇందిరమ్మ ఇంటి కోసం భారీగా అప్లికేషన్లు వచ్చాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  చాలా తక్కువ సంఖ్యలో సొంత జాగ  ఉన్న పేదవాళ్లు  ఉన్నారని అధికారులు అంటున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  100 గజాల జాగ రూ. 7 లక్షలకు పైనే ఉందని పబ్లిక్ చెబుతున్నారు. ఈ జాగ ఉన్నా కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవడం చాలా కష్టమని  అంటున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఏరియాల్లో స్కీమ్ అమలు ఎలా అని అధికారులు ఆలోచిస్తున్నారు.

అర్బన్​కే ఎక్కువ నిధులు

కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం అవాస్ యోజన స్కీమ్ లో భాగంగా అర్బన్ ఏరియాల్లో ఒక్క ఇంటికి రూ.1.5 లక్ష ఆర్థిక సహాయం వస్తున్నది. మిగతా రూ.3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.  రూరల్ లో ఇంటి నిర్మాణానికి  కేవలం రూ.72 వేలు మాత్రమే కేంద్రం సాంక్షన్ చేస్తుంది. ఇపుడు అర్బన్ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ సొంత జాగ లేకపోవడంతో కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.  సర్వే మొత్తం పూర్తయ్యాక , ఆ వివరాలను సీఎం, హౌసింగ్ మంత్రి పరిశీలించి.. ఈ అంశంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హౌసింగ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా,  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రజాపాలన లో అప్లికేషన్లు పెట్టుకోని వారు ఎవరైనా ఉంటే.. ఇప్పుడుకూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.