ఐటీ మినిస్టర్​ ఇలాఖాలో వెక్కిరిస్తున్న ఖాళీలు

సిరిసిల్ల మున్సిపాలిటీలో సిబ్బంది కొరత
76 పోస్టులకు     29 మంది ఉద్యోగులే
కొరవడుతున్న పాలన

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మున్సిపల్ లో మొత్తం 76 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. 29 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పాలన గాడితప్పుతోంది. 

ప్రధాన విభాగాల్లో  ఖాళీలు

మున్సిపల్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్, రెవెన్యూ విభాగాల్లో ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షించే వారు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణంలో క్వాలిటీ కొరవడుతోందని విమర్శలు వస్తున్నాయి. కొంత మంది కౌన్సిలర్లు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మరో వైపు రెనెన్యూ విభాగంలో ప్రాపర్టీ టాక్స్, మ్యుటేషన్లు, ఇంటి నంబర్ల కేటాయింపు తదితరాల్లో జాప్యం జరుగుతోంది. ఈ మధ్యనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ అలీని ఉన్నతాధికారులు  వేములవాడ మున్సిపల్ ఇన్​చార్జి కమిషనర్​గా బాధ్యతలు అప్పగించారు. దీంతో  టౌన్ ప్లానర్ కూడా ఆయనా అందుబాటులో ఉండటం లేదు.

74  పోస్టులు ఖాళీలు

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో అడ్మినిస్టేషన్ విభాగంలో 24  పోస్లులకు 9 మంది సిబ్బందే ఉన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులకు గాను ఏడు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ లో 13, రెవెన్యూలో నాలుగు, అకౌంట్స్ లో నాలుగు, శానిటేషన్ లో47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శానిటేషన్​విభాగంలో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో పారిశుద్ధ్య పనులు జరగడంలేదు. వార్డుల్లో స్ట్రీట్​లైట్స్ కూడా సరైన టైంలో రిపేర్​జరగడంలేదు. మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేసి పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.