మేడ్చల్ : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఘోరం జరిగింది. కూకట్ పల్లి JNTU దగ్గర్లలోని ప్రగతినగర్ NRI కాలనీలో.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు.. ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయాడు. బాలుడు పడిన మ్యాన్ హోల్ నేరుగా ప్రగతినగర్ లోని తుర్క చెరువుకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. నీటి ఉధృతికి బాలుడు చెరువులోకి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, బాచుపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ప్రగతినగర్ ప్రాంతంలో కుండపోత వర్షం పడింది. రెండు గంటల్లోనే అపార్ట్ మెంట్ సెల్లార్లు మునిగాయి. వీధులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ కాలనీలో.. ఇంటి ముందు నీళ్లల్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు నితిన్.. ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.
అసలేం జరిగింది...
బాబు కోసం తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం తెలిసిందే. ఇంటి ముందు ఉన్న మ్యాన్ హోల్ లో పడి బాలుడు కొట్టుకుపోయాడని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో జరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.
మ్యాన్ హోల్ లో నితిన్ పడిపోయాడని తెలిసి వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అప్పటికే ఈ విషయం స్థానికంగా ఉన్న అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే బాలుడు మ్యాన్ హోల్ లో పడిపోయిన ఘటనా స్థలం నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి డెడ్ బాడీ కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజీవ్ గృహకల్ప దగ్గర ఉన్న సాయి నగర్ చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లతో బాలుడి కోసం వెతుకుతున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
ALSO READ :హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోం చేసుకోండి.. బయటకు రావొద్దు : పోలీసుల పిలుపు
బాలుడి డెడ్ బాడీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. అప్పటి వరకు తమతో ఉన్న బాలుడు ... విగతజీవిగా మారడని తెలిసి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జీహెచ్ఎంసీపై విమర్శలు
వర్షాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వర్షాలు వచ్చిన సమయంలో మ్యాన్ హోల్స్ ను మూసి వేయకుండా.. అజాగ్రత్తగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. బాలుడు మృతికి కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.