ఉన్నట్టుండి కోపం, సూసైడ్ ఆలోచనలు.. ఫోన్లతో పిల్లల్లో విపరీత ప్రవర్తన.. 13–17 ఏండ్ల మధ్య వయస్సు వారిలోనే అధికం

ఉన్నట్టుండి కోపం, సూసైడ్ ఆలోచనలు.. ఫోన్లతో పిల్లల్లో విపరీత ప్రవర్తన.. 13–17 ఏండ్ల మధ్య వయస్సు వారిలోనే అధికం
  • సెపియన్స్​ ల్యాబ్స్​ స్టడీలో వెల్లడి
  • 13–17 ఏండ్ల మధ్య వయస్సు వారిలోనే అధికం
  •  వాస్తవానికి దూరంగా బతుకుతున్న పిల్లలు

హైదరాబాద్​, వెలుగు: స్మార్ట్​ఫోన్​ వినియోగం పిల్లల్లో విపరీత ప్రవర్తనకు కారణమవుతున్నది. వారిలో ఉన్నట్టుండి కోపాన్ని పెంచుతున్నది. బాధ, హెల్యూసినేషన్ (లేనివి ఉన్నట్టు కనిపించడం)​కు కారణమవుతున్నది. కొన్నికొన్నిసార్లు పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది. సెపియన్​ ల్యాబ్స్​ అనే సంస్థ మన దేశంలోని స్మార్ట్​ఫోన్​ వాడుతున్న పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

‘ద యంగ్​మైండ్​: రైజింగ్​అగ్రెషన్, యాంగర్​’ పేరిట  10 వేల మంది పిల్లలపై చేసిన ఆ స్టడీ రిపోర్ట్​ను ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం 13 నుంచి 17 ఏండ్ల వయసున్న టీనేజ్​ పిల్లల్లో స్మార్ట్​ఫోన్​ వినియోగం బాధ, కోపం, గిల్ట్​, భయం, విపరీత పోకడలకు కారణమవుతున్నదని తేలింది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడయింది. స్టడీలో పాల్గొన్న అమ్మాయిల్లో 50 శాతం మంది సూసైడల్​ టెండెన్సీలో ఉన్నట్టు రిపోర్ట్​ పేర్కొన్నది. 

చిన్న వయసు నుంచే..

మన దేశంలో సగటున 11 ఏండ్ల వయసు నుంచే  స్మార్ట్​ఫోన్​ వినియోగం పెరుగుతున్నదని రిపోర్ట్​ తేల్చింది. ఏజ్​ పెరిగే కొద్దీ విపరీత ఆలోచనలు తగ్గుతున్నాయని, తక్కువ వయసున్న పిల్లల్లోనే ఇలాంటి విపరీత పోకడలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నది. స్టడీలో పాల్గొన్న మొత్తం పిల్లల్లో సగం మందికిపైగా బాధ, కోపం, యాంగ్జైటీని రిపోర్ట్​ చేసినట్టు తెలిపింది. 46 శాతం మంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని, 37 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలున్నాయని వెల్లడించింది. ఫోన్​ వాడుతున్న వాళ్లలో చాలా వరకు నేర్చుకునేతత్వాన్నీ కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 

స్మార్ట్​ఫోన్లతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు (శాతాల్లో)

సమస్య    అబ్బాయిలు    అమ్మాయిలు

విపరీత పోకడలు, కోపం    50    60
బాధ, నిస్సహాయత, డిప్రెషన్​    50    70
తప్పు చేశామన్న భావన    50    65
వ్యసనం    47    –––
భయం, యాంగ్జైటీ    45    60
ఆత్మహత్య ఆలోచనలు    37    50
మూడ్​ స్వింగ్స్​    38    57
ఏకాగ్రత లోపించడం    38    50