- పెత్తనం అంతా యూనియన్, పొలిటికల్ లీడర్లదే
- ఒక సూపర్వైజర్ కు మూడు సార్లు డిప్యూటేషన్ రద్దు
- ఐదేండ్లుగా 31 సెంటర్లకు టీచర్లు కరువు
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా ఐసీడీఎస్ లో గందరగోళం నెలకొంది. పారదర్శకంగా జరగాల్సిన ట్రాన్స్ఫర్స్, డిప్యూటేషన్లలో రాజకీయ నాయకులు, అంగన్ వాడీ యూనియన్ లీడర్లు జోక్యం చేసకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్ఫర్స్, డిప్యుటేషన్ల కోసం యూనియన్, పొలిటికల్ లీడర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. నచ్చితే మంచి స్థానాల్లో కూర్చోబెట్టడం, నచ్చని వారికి ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు రద్దు చేసి వేరే చోటికి పంపించడం ఐసీడీఎస్‌లో సర్వసాధారణంగా మారిందని అంటున్నారు.
జిల్లాలోని ఒక సూపర్ వైజర్ పనితీరు యూనియన్ లీడర్లకు ఇబ్బందికరంగా మారడంతో మూడుసార్లు డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయించడం ఐసీడీఎస్ శాఖలో రచ్చగా మారింది. ఇక అంగన్వాడీ టీచర్లు పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఐదేండ్లుగా 31 అంగన్ వాడీ టీచర్, 4 సూపర్వైజర్, 66 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఐదేండ్లుగా ఖాళీలు..
జోగులాంబ గద్వాల జిల్లాలో 262 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. మల్దకల్లు, మానవపాడు, గద్వాల ప్రాజెక్టులున్నాయి. జిల్లాలో 231 మంది అంగన్వాడీ టీచర్లు పని చేస్తుండగా, 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 262 మంది ఆయాలకు గాను, 194 మంది ఉన్నారు. 10 సెక్టార్లకు 10 మంది సూపర్వైజర్లు ఉండాల్సి ఉండగా, నలుగురు రెగ్యులర్, ఇద్దరు డిప్యూటేషన్ పై జిల్లాలో పని చేస్తున్నారు. ఇంకా నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు..
ఐసీడీఎస్‌లో ఇష్టానుసారంగా డిప్యూటీషన్లు నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. నచ్చని వారిని డిప్యూటేషన్ పేరుతో వేరే సెక్టార్లకు పంపడం ఇక్కడ పరిపాటిగా మారింది. మల్దకల్‌కు చెందిన ఒక సూపర్ వైజర్ ను నెల రోజుల కింద కేటిదొడ్డి, ధరూర్ సెక్టార్లకు డిప్యూటేషన్ పై పంపించారు. ఆమె డ్యూటీ నిక్కచ్చిగా చేస్తుందని, దీంతో అంగన్ వాడీ టీచర్లకు ఇబ్బంది కలగడంతో యూనియన్ లీడర్లు ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ ను కలిసి ఆమెను వేరే చోటికి డిప్యూటేషన్ పై పంపించారు.
అక్కడ కూడా ఆమెకు ఇబ్బందులు రావడంతో మళ్లీ గద్వాల ప్రాజెక్టులోని చింతలపేట సెక్టార్ కు బదిలీ చేశారు. అక్కడి యూనియన్ లీడర్లు మూడు రోజుల్లోనే మళ్లీ కేటిదొడ్డి సెక్టార్ కి డిప్యూటేషన్ పై బదిలీ చేయించారు. దీంతో ఆ సూపర్ వైజర్ అందరికీ భయపడుతూ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సెంటర్లలో ఎవరిని ఏమి అడిగినా, పని చేయలేదన్నా తనను మళ్లీ బదిలీ చేస్తారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్లనూ మార్చుతున్రు..
అంగన్ వాడీ టీచర్లు, పొలిటికల్ లీడర్లు కలిసి ఇష్టానుసారంగా సెంటర్లను మారుస్తున్నారనే విమర్శలున్నాయి. పిల్లలు లేరనే సాకుతో గతంలో కొన్ని సెంటర్లను మూసివేసి వేరే సెంటర్లలో మెర్జ్ చేశారు. ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న చోటికి సెంటర్లను మార్చుకుంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గద్వాల పట్టణంలోని సెకండ్ రైల్వే గేట్ సమీపంలో 20 ఏండ్ల నుంచి సెంటర్ ఉంది.
దీనిని ప్రస్తుతం పాత హౌసింగ్ బోర్డ్ కు మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. సెంటర్ ను మారిస్తే తమ పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు లేరని తప్పుడు లెక్కలు చూపించి సెంటర్లను మార్చుకున్నారని, తిరిగి వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కమిషనర్ నుంచే ఆర్డర్స్..
డిప్యూటేషన్లపై కమిషనర్ నుంచే ఆర్డర్స్ వస్తున్నాయి. యూనియన్ లీడర్లు, పొలిటికల్ లీడర్ల పైరవీలను పరిగణలోకి తీసుకోం. ఐదేండ్ల నుంచి రిక్రూట్మెంట్ జరగని మాట వాస్తవమే.
హేమలత, సీడీపీవో