- 60 వేల పింఛన్లుంటే 12 వేలు దివ్యాంగులవే
- కొత్త పింఛన్లలోనూ 20 శాతం..
- అసలైన అర్హులకు అన్యాయం
గద్వాల, వెలుగు: దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో అవినీతి జరుగుతోంది. డిజబులిటీ లేకున్నా పైసలిస్తే చాలు పత్రాలు చేతిలో పెట్టి.. పింఛన్‌కు అర్హులను చేస్తున్నారు. గద్వాల జిల్లాలో గతం నుంచీ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కొత్త పింఛన్ల మంజూరీలోనూ అక్రమాలు బయట పడుతున్నాయి. అసలైన అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం పింఛన్లలో 20 శాతం దివ్యాంగులవే ఉన్నాయంటే ఉండడం గమనార్హం.
డిసిబిలిటీ పర్సెంటేజీ పట్టించుకుంటలే..
శారీరక, మానసిక వైకల్యం, వినికిడిలోపం, బుద్ధి మాంద్యం, కంటిచూపు లేకపోవడం.. తదితర వర్గాల వారిని దివ్యాంగులుగా పరిగణించిన సర్కారు సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. సంబంధిత డాక్టర్లు టెస్టులు చేసి డిజబులిటీ పర్సెంటేజ్ ప్రకారం సర్టిఫికెట్లు ఇస్తారు. దీని ఆధారంగానే పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం కన్నా ఎక్కువగా వైకల్యం, 60 డిసిబిల్స్ కంటే ఎక్కువ వినికిడి కోల్పోవడం, కళ్లద్దాలు ధరించినా కంటిచూపు 6/60 ఉండడం, లేదా చూపు పరిధి 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటేనే పింఛన్‌కు అర్హులవుతారు. కానీ, ఇవేమీ లేకుండానే పైరవీలు చేసుకొని పైసలిస్తే పని అయిపోతోంది.
రూ.5 వేలకు సదరం సర్టిఫికెట్
ఎలాంటి డిజబులిటీ లేకున్నా కేవలం రూ. 5 వేలు ఇస్తే సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ లీడర్లు, మెడికల్ ఆఫీసర్లను మేనేజ్ చేసి ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. కేటి దొడ్డి మండలం కొండాపురం గ్రామంలో ఎలాంటి వైక్యల్యం లేని ఆరుగురికి సదరం సర్టిఫికెట్లే కాదు పింఛన్లు కూడా వస్తున్నాయి. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ లీడర్ సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తానని 20 మంది దగ్గరి నుంచి రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో ఆరుగురికి సర్టిఫికెట్లు రాగా.. మిగతా వారు లీడర్‌తో వాగ్విదానికి దిగినట్లు తెలిసింది. దీంతో ఆయన డబ్బులు వాపస్ ఇస్తానని చెప్పారట. ఇక్కడే కాదు ధరూర్, కేటి దొడ్డి, అయిజ, మానవపాడు, ఇటిక్యాల, గట్టు మండలాల పరిధిలోని ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.
12,215 దివ్యాంగుల పింఛన్లు
గద్వాల జిల్లాలో మొత్తం 60 వేల పింఛన్లు ఉంటే దివ్యాంగ పింఛన్లే 12,215 ఉన్నాయి ఇటీవల జిల్లాకు 16,123 కొత్త పింఛన్లు మంజూరు కాగా.. 1873 దివ్యాంగులవే ఉన్నాయి. ధరూర్ లో 208, అయిజలో 210, మల్దకల్‌లో 139, ఇటిక్యాలలో 165 మానవపాడులో 203, కేటి దొడ్డిలో 98 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ఆఫీసర్లు ఎలాంటి ఎక్వైరీ చేయకుండా పింఛన్ కార్డులు ఇస్తుండడంతో బోగస్‌వి గుర్తించే అవకాశం లేకుండా పోతోందని అసలైన అర్హులు వాపోతున్నారు. వృద్ధ్యాప్య, వింతంతువు పింఛన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు కండ్లు లేకున్నా పెన్షన్ ఇస్తలేరు
రెండు కళ్ళు కనపడవు.. లైఫ్ టైం సదరం సర్టిఫికెట్ ఉంది.. గతంలో మూడు నెలలు పింఛన్ వచ్చింది. మళ్లీ రద్దు చేసిన్రు. ఇప్పుడు వస్తది అప్పుడు వస్తది అంటూ మూడేళ్లుగా తిప్పుతున్రు. ప్రస్తుతం వచ్చిన కొత్త పింఛన్ లిస్టులో కూడా నా పేరు లేదు.
–తిమ్మప్ప, గట్టు మండలం
మెంటల్ డిజబులిటీ ఉన్నా పెన్షన్ లేదు
మా బాబు యశ్వంత్‌కు 8 ఏళ్లు. మెంటల్‌గా డిజిబులిటీ ఉన్నడు. వంద శాతం డిజిబులిటీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నా.. డాక్టర్లు జీరో పర్సెంట్ సర్టిఫికెట్ ఇచ్చి అన్యాయం చేసిన్రు. వారు చేసిన తప్పిదంతో రెండేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నం. మళ్లీ సర్టిఫికెట్ తీసుకోవాలంటే పాతది డీలీట్ చేయాలి. కానీ అలా చేయడం లేదు. –యశ్వంత్ తండ్రి సుధాకర్, గద్వాల
ఎంక్వైరీ చేస్తం
డబ్బులు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు తీసుకుంటున్న సంగతి మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటుం. ఆసరా కార్డులు పంపిణీ చేసేటప్పుడే అన్ని చూసుకొని ఇస్తున్నం. ఇప్పటివరకు 75 మంది పింఛన్లు నాన్ ఎలిజబుల్‌గా గుర్తించినం. నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు వచ్చేలా చూస్తం.
–సరోజ, డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ