భద్రాచలంలో గ్రామపంచాయతీ వర్సెస్ దేవస్థానం!

భద్రాచలంలో గ్రామపంచాయతీ వర్సెస్ దేవస్థానం!
  • భద్రాచలం ఆలయ మాడ వీధుల్లో శానిటేషన్​ తమ బాధ్యత కాదంటూ పంచాయతీ ఈవో లేఖ
  • గత నెలలో గుడి పరిసరాల్లో పార్కింగ్​ వసూలు చేయొద్దని ఆలయ ఈవో హుకూం
  • ఇద్దరు ఈవోల పరస్పర ఫిర్యాదులతో ముదురుతున్న వివాదం

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో గ్రామపంచాయతీ, సీతారామచంద్రస్వామి దేవస్థానం మధ్య వివాదం రాజుకుంటోంది.  గతేడాది కరకట్టపై చెత్తను తగులబెడతున్నారంటూ ఆలయ ఈవో రమాదేవి పొల్యూషన్​ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో ఆశీలు వసూలు చేయొద్దన్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో శానిటేషన్​ తమకు సంబంధం లేదని ఇటీవల పంచాయతీ ఈవో శ్రీనివాసరావు లేఖ రాశారు. ఇలా ఇద్దరు ఈవోల పరస్పర ఫిర్యాదుల పరంపరతో హీటెక్కుతోంది. గత నెలలో పంచాయతీ ఆశీలు విషయంలో దేవస్థానం ఈవో రమాదేవి, గ్రామపంచాయతీ ఈవోల మధ్య వాదన షురూ అయ్యింది. 

గుడి పరిసరాల్లో ఆశీలు వసూలు చేయరాదంటూ ఆలయ ఈవో స్వయంగా బోర్డులు పెట్టించారు. ‘ఆలయం వద్ద మీ పెత్తనం ఏంటి’ అంటూ దేవస్థానం తిరుగుబాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు, పంచాయతీ, దేవస్థానానికి చెందిన ఆఫీసర్లు సమావేశమై పరిస్థితిని చక్కదిద్దారు. కానీ తాజాగా పంచాయతీ ఈవో శ్రీనివాసరావు గురువారం నుంచి ఆలయ మాడవీధుల్లో శానిటేషన్​ పనులు తాము చేయబోమని లేఖ రాశారు. ఆలయం చుట్టూ ఉన్న పంచాయతీ శానిటేషన్ బాక్సులను తీసుకెళ్లిపోయారు. ‘మీ శానిటేషన్​ పనులు మీరే చేసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో శానిటేషన్​ కోసం చేసిన ఖర్చును 2017 నుంచి ఇవ్వడం లేదని, అవి తమకు ఇప్పించాలంటూ ఈవో శ్రీనివాసరావు కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు విజ్ఞప్తి చేశారు. దీంతో తిరిగి రెండు శాఖల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. పంచాయతీ ఈవో లేఖ సంచలనంగా మారింది.

అసలు రగడ ఇక్కడి నుంచే.. 

దేవస్థానం ఈవో రమాదేవి తీరుపై అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. గతేడాది అక్టోబర్​  లో  కరకట్టపై చెత్తను తగులబెడుతున్నారంటూ ఆమె పొల్యూషన్​ బోర్డుకు ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు మేరకు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, భద్రాచలం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్​ ఐటీడీఏ పీవో, పంచాయతీ ఈవోలకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర విభజనతో 20 ఎకరాల డంపింగ్​యార్డు ప్రాంతం ఏపీలో విలీనమైన మండలాల్లోకి వెళ్లిపోయింది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలమే కరువైంది. డంపింగ్​ యార్డు నిర్మాణం కోసం స్థలం దొరక్క ఇబ్బందులు వస్తున్నాయి. 

మనుబోతుల చెరువు వద్ద ఎనిమిది ఎకరాల్లో ప్రస్తుతం డంపింగ్​యార్డు నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ప్రారంభించనున్నారు. కానీ దేవస్థానం ఈవో స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఫిర్యాదు చేయడంపై పంచాయతీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇక్కడి నుంచే రగడ మొదలైంది. పొల్యూషన్​ బోర్డు నుంచి వచ్చిన నోటీసులను వివరిస్తూ డంపింగ్​ యార్డు పూర్తయ్యిందని, ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. 

ఇదే సమయంలో ఇకపై ఆలయ పరిసరాలకు, పంచాయతీకి సంబంధం లేదనట్లుగా దేవస్థానం భావిస్తున్నందున శానిటేషన్​ వారే  చూసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆలయం చుట్టూ క్యూ షెడ్లు నిర్మాణం సమయంలో పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. 2014 వరకు దేవస్థానమే తమ పరిసరాల్లో శానిటేషన్​ పనులు చూసుకునేదని, ఇకపై దాని ప్రకారమే నడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. 

భక్తులు ఇబ్బంది పడొద్దనే ఫిర్యాదు చేశా.. 

కరకట్టపై చెత్తను తగులబెట్టడంతో దట్టమైన పొగ వల్ల భక్తులకు ఇబ్బంది కలిగింది. అది దృష్టిలో ఉంచుకునే పొల్యూషన్​ బోర్డుకు ఫిర్యాదు చేశాను. ఉద్దేశపూర్వకంగా చేసిన ఫిర్యాదు కాదు. పంచాయతీ ఈవో పంపిన లేఖ అందింది. ప్రస్తుతం నేను స్థానికంగా లేను. రాగానే ఉన్నతాధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాను. 
 
దేవస్థానం ఈవో రమాదేవి