ఎమ్మెల్సీ ఎలక్షన్ అభ్యర్థుల్లో టెన్షన్..​ఆ ఓటింగ్‌పై భయం

ఎమ్మెల్సీ ఎలక్షన్ అభ్యర్థుల్లో టెన్షన్..​ఆ ఓటింగ్‌పై భయం

నల్గొండ, వెలుగు : త్వరలో జరగబోతున్న గ్రాడ్యుయేట్స్​ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుండగా, సిట్టింగ్​ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ​కష్టపడుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మోదీ ఛరిష్మాతో పాటు, యువకులు తమ వైపే ఉన్నారని బీజేపీ పోరాడుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న చర్చ నడుస్తోంది. 

అయితే, పార్టీల అభ్యర్థులంతా మొదటి ప్రాధాన్యత ఓటుపై ఫోకస్​ పెడుతున్నా.. రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడతాయోనని టెన్షన్​ పడుతున్నారు. ఈ ఓట్ల వల్ల ఏ పార్టీ అభ్యర్థికి మెజార్టీ రాకపోగా... ఎలిమినేషన్​ ప్రక్రియ అనివార్యమవుతోంది. దీంతో రోజుల తరబడి ఓట్ల లెక్కింపు చేయాల్సి వస్తోంది. 2021లో పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లతో మెజార్టీ రాకపోవడంతో ఎలిమినేషన్ ​మొదలు పెట్టాల్సి వచ్చింది. కోదండరామ్​తో మొదలైన ఎలిమినేషన్​ ప్రకియ.. 71 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లు, చెల్లని ఓట్లను లెక్కించేవరకూ వెళ్లింది. దీంతో రెండు రోజుల పాటు అధికార యంత్రాంగం నిద్ర లేకుండా శ్రమించాల్సి వచ్చింది.

కీలకంగా మారిన ప్రాధాన్యత ఓట్లు 

2‌‌021లో జరిగిన గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీపడగా ఈసారి 52 మంది బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఐదు లక్షల పై చిలుకు ఓటర్లు నమోదు కాగా, ఈసారి కూడా 4.63 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు సంఖ్య భారీగా ఉండడంతో జంబో బ్యాలెట్​తయారు చేయాల్సి వచ్చింది. అయితే, ఓటర్లు వేస్తున్న ప్రాధాన్యత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆగితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, నాలుగైదు ప్రాధాన్యతలు ఎంచుకుంటుండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. రూల్స్​ ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయించగా, చెల్లిన ఓట్లలో 50 శాతానికి పైగా ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో వారే విజేత. కానీ, గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వరెడ్డికి మొదటి ప్రాధాన్యతలో మెజార్టీ రాలేదు. దీంతో ఎలిమినేషన్​ ప్రక్రియ చేపట్టారు. 

ప్రొఫెసర్​కోదండరామ్​కు పోలైన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే దాంట్లో పల్లా రాజేశ్వరరెడ్డికి ఎక్కువ వచ్చాయి. అప్పటికీ ఆయనకు 50 శాతం ఓట్లు దాటలేదు. దీంతో తీన్మార్​ మల్లన్నకు పోలైన ఓట్లను లెక్కిస్తే దాంట్లోనూ రెండో ప్రాధాన్యత కింద పల్లాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడితో పల్లాకు 50 శాతం ఓట్లు దాటాయి. ఎమ్మెల్సీగా గెలిచిన పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓట్ల కంటే పోటీ అభ్యర్థులకు పోలైన సెకండ్​ ప్రయార్టీ ఓట్లతోనే లీడ్​ వచ్చింది. దీంతో పల్లా అతికష్టంమీద బయటపడగలిగారు. ఇప్పుడు కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న దృష్ట్యా ప్రాధాన్యత ఓటు మళ్లీ 2021 సీన్​ రిపీట్​ చేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.   

2015లో ఎన్నికల్లోనూ... 

2‌‌015 గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాకు  మెజార్టీ రాలేదు. 22 మంది పోటీ చేయగా పోలైన ఓట్లలో 50 శాతం కూడా రాలేదు. కానీ, అందరి అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అభ్యర్థుల ఎలిమినేషన్​ ప్రక్రియలో కూడా పల్లాకు లీడ్​ రాలేదు. దీంతో ఫలితాలను ఎలా ప్రకటించాలో అర్థం కాక అధికారులు ఇబ్బంది పడ్డారు. ఈసీ నిర్ణయానికే వదిలేశారు. కౌంటింగ్​ పూర్తయినా ఫలితాలు ప్రకటించకపోవడంతో ఈసీ  సీరియస్ ​అయ్యింది. మొత్తం పోలైన ఓట్లలో పల్లాకే ఎక్కువ రావడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ముందు వరసలోనే ఉన్నారు. ఓటర్లు ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాలని భావిస్తే మొదటి నుంచి మూడు, నాలుగు వరకు పర్వాలేదు. కానీ, అంతకు మించి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే కౌంటింగ్ ​ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు టెన్షన్​ పడుతున్నారు.

ప్రాధాన్యతలపై అవగాహన అవసరం 

గ్రాడ్యుయేట్స్ ​ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 4.36 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంట్లో మూడు లక్షలు పోలైతే 1.51 లక్షల ఓట్లు వచ్చిన వాళ్లని విజేతగా ప్రకటిస్తారు. మెజార్టీ రాకపోతే ఎలిమినేషన్​ ప్రక్రియ తప్పదు. కాబట్టి ఓటర్లు ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవడంలో అవగాహన కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలున్నాయో వాళ్లకు ప్రాధాన్యత క్రమం లో ఓట్లు వేస్తున్నారు. ఇందులో నలుగురి వరకు ఓకే  అంతకు మించితేనే సమస్య.  

- నూకల నర్సింహారెడ్డి, ప్రముఖ న్యాయవాది, నల్గొండ