- సంక్షేమ హాస్టళ్లలో పనిచేయని వాటర్ హీటర్లు
- చలికి వణికిపోతున్న స్టూడెంట్లు
- పట్టించుకోని ఐటీడీఏ ఉన్నతాధికారులు
- కొన్నిచోట్ల హాస్టల్ గదులకు కిటికీలు, తలుపులు లేవు
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజులుగా జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి టైంలో ఐటీడీఏ అధికారులు సంక్షేమ హాస్టళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని హాస్టళ్లలో వాటర్హీటర్లు, గీజర్లు పనిచేయకపోవడంతో ఎముకలు కొరికే చలిలోనూ స్టూడెంట్లు చన్నీళ్ల స్నానమే చేస్తున్నారు.
ఇప్పటికే సరిపడా గదులు, టాయిలెట్లు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ఉన్న గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేవు. రాత్రిళ్లు చలికి గజగజ వణుకుతున్నారు. పొద్దున్నే స్నానాలకు మరింత ఇబ్బంది అవుతోంది. ఆరు బయట చన్నీళ్ల స్నానం చేయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జలుబు, దగ్గుతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఏ ఒక్క చోటా పనిచేయట్లే
జిల్లా వ్యాప్తంగా 46 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 14 గిరిజన గర్ల్స్ హాస్టళ్లు. మొత్తంగా 46 హాస్టళ్లలో 11, 688 మంది స్టూడెంట్లు ఉంటున్నారు. ఐటీడీఏ అధికారులు సంక్షేమ హాస్టళ్లలో వసతుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా.. పరిస్థితులు మెరుగుపడడం లేదు. సోలార్ వాటర్ హీటర్లు, మినరల్ వాటర్ప్లాంట్లు అలంకార ప్రాయంగా మారాయి. దాదాపు అన్నిచోట్ల ఇదే పరిస్థితి. ఒక్కచోట కూడా వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. నిర్వహణ లోపం, చిన్న, చిన్న రిపేర్లు కూడా చేయించకపోవడంతో మూలన పడ్డాయి. గతంలో ఒక్కో సోలార్ యూనిట్ కోసం దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేశారు.
ఐటీడీఏ అధికారులు తనిఖీలు లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తిర్యాణి మండలం గిన్నేధరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో 232 బాలికలు, రొంపల్లిలో 128, మంగిలో120, పంగిడి మదరాలో 135, శాటి లైట్ సుంగాపూర్ లో 120 స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వాటర్హీటర్లు పనిచేయకపోవడంతో వీళ్లంతా డెయిలీ చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
జైనూర్ మండలం మార్లవాయి ఆశ్రమ హాస్టల్ లో 326 మంది ట్రైబల్ స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఇక్కడి వాటర్ హీటర్ ప్లాంట్ నిరూపయోగంగా మారింది. అకడమిక్ఇయర్మొదట నుంచి పనిచేయడం లేదని స్టూడెంట్లు చెబుతున్నారు. దహెగాం మండలం కల్వాడ ఆశ్రమ స్కూల్ లో 218 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఏడాదిగా వాటర్హీటర్పనిచేయకపోవడంతో గజగజ వణుకుతూ చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు.
పొద్దుగాల తిప్పలైతంది
పొద్దుగాల లేచి చన్నీళ్లతో స్నానం చేయాలంటే తిప్పలవుతోంది. కొన్ని నెలలుగా హాస్టల్లోని వాటర్ హీటర్పనిచేయడం లేదు. చన్నీళ్లతో స్నానాలు చేస్తున్నాం. జలుబు, దగ్గుతోపాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి జల్ది రిపేర్ చేయించాలి.
సురేశ్, టెన్త్స్టూడెంట్, తిర్యాణి హాస్టల్
వాటర్ హీటర్లు రిపేర్లు చేయిస్తం
జిల్లాలో 46 హాస్టళ్లలో వాటర్హీటర్లు ఉన్నాయి. అన్నిచోట్ల రిపేర్లు చేయిస్తాం. స్టూడెంట్లకు వేడి నీళ్లు అందిస్తాం. ఇప్పటికే ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లాం. పర్మిషన్ ఇచ్చారు. రిపేర్లు మొదలుపెడతాం. హాస్టళ్లలో ఇబ్బంది లేకుండా చూస్తాం.
రమాదేవి, ఆసిఫాబాద్ డీటీడీఓ