మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుచేయలేం

మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుచేయలేం

ఆర్టీ‌‌‌‌–పీసీఆర్ యూనిట్ను తీసుకెళ్లడం కష్టం
జూన్ 29 నాటికి 85,106 టెస్టులు
కరోనా కేసులపై హైకోర్టుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్​ లక్షణాలు ఉన్న వారికి టెస్టులు నిర్వహించడానికి మొబైల్‌‌ టెస్టింగ్‌‌ ల్యాబ్స్‌‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వం తరఫున 13 లాబ్స్​లో, ప్రైవేట్‌‌లో 18 ల్యాబ్స్‌‌లో ఆర్టీపీసీఆర్‌‌ టెస్టులను చేస్తున్నాయన్నారు. మొబైల్‌‌ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు సూచన ఆచరణలో వీలుకాదని, ఆర్టీ–పీసీఆర్‌‌ టెస్టింగ్‌‌ యూనిట్‌‌ను మొబైల్‌‌ వాహనంలో తీసుకువెళ్లడం కష్టమని వివరించింది. బయో సేఫ్టీ వంటి జాగ్రత్తలు పాటించడానికి వీలుకాదని చెప్పింది. కరోనాకు సంబంధించి దాఖలైన 9 ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్​ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు నివేదిక అందచేశారు.

పది రోజుల్లో 40,837 టెస్టులు
గత నెల 20 నుంచి 29 వరకూ పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,837 టెస్టులు చేశామని, జూన్‌‌ 29 నాటికి మొత్తంగా 85,106 టెస్ట్‌‌లు చేశామని ఆ రిపోర్ట్​లో తెలిపారు. వీరిలో 69,712 మందికి నెగిటివ్‌‌ వచ్చిందని, 15,394 మందికి పాజిటివ్‌‌ వచ్చిందని, వీటిలో యాక్టివ్‌‌ కేసులు 9,559(జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 5,644), డిశ్చార్జ్​ అయిన వారు 5,582 మంది ఉన్నారని చెప్పారని, 253 మంది వైరస్​ బారినపడి చనిపోయారని పేర్కొన్నారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 13 ల్యాబ్స్​, జిల్లాల్లో 18 ల్యాబ్స్‌‌లో కరోనా టెస్టులు చేస్తున్నామని, పాజిటివ్​ పేషెంట్లకు జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 9 ఆస్పత్రులు, జిల్లాల్లో 52 ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ జరుగుతోందని చెప్పారు.

ఫెసిలిటీస్​ పెంచాం

కరోనా కట్టడి కోసం గాంధీ ఆస్పత్రిలో బెడ్స్​ సంఖ్యను రెట్టింపు చేశామని, గతంలో 1,002 బెడ్స్‌‌ ఉంటే ఇప్పుడు 2,100 బెడ్స్​కు పెంచామని, వెయ్యి బెడ్స్​కు మాత్రమే ఆక్సిజన్​ సదుపాయం ఉంటే.. మరో 700 బెడ్స్‌‌కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీలో 350 వెంటిలేటర్స్‌‌ ఉన్నాయన్నారు. గాంధీలో 665 మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. డాక్టర్లు, స్టాఫ్​, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర ఉద్యోగులందరికీ కరోనా కిట్లు అందజేస్తున్నామన్నారు. ఏప్రిల్‌‌ 1 నుంచి జూన్‌‌ 29 వరకూ గాంధీ ఆస్పత్రిలో 69,389 పీపీఈ కిట్లు వాడామని, 9,728 కిట్స్‌‌ నిల్వ ఉన్నాయి. ఎన్‌‌95 మాస్క్‌‌లు 1.39 లక్షలు వాడితే 7,811 నిల్వ ఉన్నాయని, మూడు పొరల మాస్క్‌‌లు 4,41,984 వినియోగిస్తే 1,15,516 ఉన్నాయని, శానిటైజర్లు 12,915 వాడగా 3,496 ఉన్నాయని, గ్లౌజ్‌‌లు 1,68,796 వాడితే 12,204 ఉన్నాయని, సర్జికల్‌‌ గ్లౌజ్‌‌లు 2,12,226 వాడగా 13,924 నిల్వ ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌‌సీల వద్ద 2,157 థర్మల్‌‌ స్క్రీనర్లు పెట్టామని, మరో 8 వేలను కొనుగోలు చేస్తున్నామని, కొద్ది రోజుల్లో అవి వస్తాయన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ చర్యలు తీసుకుంటోందని, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తోందని నివేదికలో పేర్కొన్నారు.

For More News..

కరోనా ఎంటరై 4 నెలలు.. నో కంట్రోల్

రాగికి పూత పూసి రూ. 20 వేల కోట్ల టోపీ

పెళ్లయిన 19 రోజులకే.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి