- కేసులున్న మిల్లర్లకు కేటాయిస్తుండడంతో అక్రమాలు
- ఏపీలో అమ్ముకుంటున్న జిల్లా మిల్లర్లు
- చక్రం తిప్పుతున్న అధికార పార్టీ లీడర్లు
- మలుపు తిరుగుతున్న గడ్డిపల్లి కేసు
సూర్యాపేట/కోదాడ వెలుగు : జిల్లాలో మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. గత సీజన్‌లో అక్రమాలకు పాల్పడి, కేసులు నమోదైన వారికే అధికారులు సీఎంఆర్ కేటాయిస్తుండడంతో ధాన్యం పక్కదారి పడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తమకు కేటాయించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ఏపీకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సీఎంఆర్ స్థానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పజెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్ లో కీలక పదవిలో ఉండి, అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న ఒక మిల్లర్, సూర్యాపేటకు చెందిన మరో మిల్లర్, కోదాడ మిల్లర్ల్స్ అసోసియేషన్‌లోని మరో వ్యక్తి ఈ దందాలో కీలకంగా ఉన్నట్లు తెలిసింది.
సూర్యాపేటకు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కోదాడ రూరల్ పోలీసులు కాకినాడ నుంచి రేషన్ బియ్యం లారీని వెనక్కి తీసుకు వచ్చిన కేసులో ఉన్న కొందరి పేర్లను కోదాడకు చెందిన నేత తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గడ్డిపల్లి నుంచి ఏపీకి తరలిస్తూ భారీగా పట్టుబడిన ధాన్యం
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి హనుమాన్ సాయి రైస్ మిల్ నుంచి ఏపీకి తరలిస్తున్న సీఎంఆర్‌ను సివిల్ సప్లయ్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఈ రైస్ మిల్లుకు 2020–21 ఖరీఫ్ సీజన్ లో 2921మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. నకిలీ ట్రక్ షీట్స్ సృష్టించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడంతో అధికారులు కేసు నమోదు చేశారు.
అయినప్పటికీ అధికారులు రాజకీయ నేతల ఒత్తిడితో 2022 –23 యాసంగి సీజన్ లో మళ్లీ 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. ఆదివారం ఇక్కడి నుంచి రెండు లారీల్లో 60 టన్నుల సీఎంఆర్‌ను ఏపీకి తరలిస్తుండగా పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.
మలుపు తిరుగుతున్న గడ్డిపల్లి కేసు
హనుమాన్ సాయి రైస్ మిల్లు కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. మొదట మిల్లర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో సూర్యాపేటలోని కుడకుడకు చెందిన వ్యక్తితో పాటు రైస్ అమ్మేందుకు మధ్యవర్తిగా ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని సమాచారం. సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని మిల్లర్లు భారీ ఎత్తున సీఎంఆర్‌ను తరలిస్తున్నట్లుగా ఒప్పుకున్నట్లు తెలిసింది.
సూర్యాపేట, బీబీగూడెం, కోదాడ, కేతేపల్లి వద్ద ఉప్పల పహాడ్ వద్ద ఉన్న మిల్లుల నుంచి రైస్ మాయమైనట్లు సమాచారం. మరోవైపు హనుమాన్ రైస్ మిల్లుపై విచారణ చేపట్టిన సివిల్ సప్లయ్ అధికారులు రైస్ మాయమైనట్లు గుర్తించారు. అయితే యజమాని మరో రైస్ మిల్లులోని సీఎంఆర్ తనదేనని స్టేట్మెంట్ ఇవ్వడం కొసమెరుపు. ఇందుకోసం సదురు రైస్ మిల్లు యజమానికి భారీగా ముడుపులు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కీలకంగా వ్యవహరిస్తున్న నేత
అధికార పార్టీకి చెందిన ఓ మిల్లర్ ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత యాసంగి సీజన్‌లో మిల్లర్లు రైతుల నుంచి ఇష్టానుసారంగా తేమ పేరుతో కటింగ్ పెట్టడంతో వివాదం జరిగింది. ఇందులో ఆయన రైతులకు కాకుండా, మిల్లర్లకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఇటీవల కాకినాడ నుంచి రేషన్ బియ్యాన్ని వెనక్కి తీసుకు వచ్చిన సంఘటనలో పలువురు మిల్లర్లు, అధికార పార్టీ నాయకులు పేర్లు ఉండగా.. కొందరిని కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం దాదాపు రూ.60లక్షలు చేతులు మారినట్లుగా సమాచారం. ఈ కేసులో చాలామంది పేర్లు బయటకు వచ్చినా, కేవలం నలుగురుపై మాత్రమే కేసు నమోదైంది.