- 15 కిలోలని ఈఓ ఫిర్యాదు
- ఇప్పటికే 17 కిలోలు రికవరీ
- 37 కిలోలంటున్న అర్చకులు
కొండగట్టు : కొండగట్టు ఆలయంలో చోరీకి గురైన వెండి ఎంతన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. దొంగతనం జరిగిన తర్వాత15 కిలోల వెండి వస్తువులు పోయాయని ఈఓ వెంకటేశ్అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల ఒకటిన మహారాష్ట్రలోని బీదర్ లో ముగ్గురు దొంగలు దొరకగా వారి నుంచి ఐదు కిలోల వెండి రికవరీ చేసినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఆదివారం మరో ముగ్గురు దొరకగా వీరి నుంచి మరో 12 కిలోల వెండి రికవరీ చేసినట్టు డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 15 కిలోల వెండి పోయిందని ఆలయ అధికారులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇప్పటి వరకు 17 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అంటే రెండు కిలోల వెండి తేడా వస్తోంది. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉండగా వారి వద్ద కూడా మరికొంత వెండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆలయ అర్చకులు మాత్రం సుమారు 37 కిలోల వరకు వెండి పోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు తేల్చలేకపోతున్నరు?
అంజన్న గుడికి వస్తు రూపంలో భక్తులు ఎలాంటి కానుకలు అందజేసినా, ఆలయ అధికారులు ఏవి కొన్నా రికార్డుల్లో ఉంటుంది. కానీ, చోరీ జరిగి 20 రోజులు గడుస్తున్నా చోరీకి గురైన వెండి వస్తువులు ఎన్ని కిలోలో చెప్పలేకపోతున్నారు. అసలు చోరీ జరిగిన సొమ్మెంత ? ఆలయంలో ఉన్న వెండి వస్తువుల బరువెంత? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.