గాలి లెక్కల బడ్జెట్ : 2014 నుంచీ కరోనా ఉందా?‌‌

బడ్జెట్‌‌ అంటే రాష్ట్రంలో వచ్చే ఆదాయం, ప్రజల కోసం చేసే ఖర్చు పక్కాగా ఉండాల్సిన లెక్కల పత్రం. కానీ దానిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశ, దిశ లేని గాలి లెక్కల కింద మార్చేసింది. ఈ ఒక్క ఏడాదే కాదు, గత బడ్జెట్లలో కూడా బడ్జెట్‌‌ పెట్టేటప్పుడు అంచనాలు భారీగా ఉంటున్నాయి. తీరా ఖర్చు దగ్గరకు వచ్చేసరికి 75 శాతం దాటట్లేదు. 2021–22 బడ్జెట్‌‌ను ఏకంగా 2.30 లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టారు. కానీ ఆదాయ మార్గాలేంటన్నది మాత్రం చెప్పలేదు. ప్రజలపై పన్నుల భారం పెంచుతారా? అలా అయితే వేటిపై పన్నులు వేస్తారు? లేదంటే ప్రభుత్వ భూములు అమ్ముతారా? కొత్తగా అప్పులు తెస్తారా? అన్నదానిపై బడ్జెట్‌‌లో క్లారిటీ లేదు.

టీఆర్‌‌‌‌ఎస్ సర్కారు బడ్జెట్‌‌లో తప్పుడు అంచనాలతో ఏటా ప్రజలను మోసం చేస్తూ వస్తోంది. 2019-–20కి సంబంధించి ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లక్షా 83 వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించి, తిరిగి సెప్టెంబర్‌‌‌‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌‌లో లక్షా 45 వేల కోట్లకు కుదించింది. కానీ వాస్తవ ఖర్చును లక్షా 36 వేల కోట్లుగా బడ్జెట్‌‌లో లెక్క చూపారు. 2020–-21 బడ్జెట్ లో కూడా లక్షా 82 వేల కోట్లు ప్రతిపాదించినా వాస్తవ రెవెన్యూ లక్ష కోట్లు దాట లేదు. ఇక ఇప్పుడు రాబోయే 2021-–22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96 కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా చూపించారు. 

2014 నుంచీ కరోనా ఉందా?

మొత్తం బడ్జెట్‌‌లో ఆర్థిక లోటును రూ.45,509.60 కోట్లుగా చూపించారు. ఇక్కడే సర్కారు డొల్లతనం బయటపడింది. ఈ లోటును ఎలా భర్తీ చేస్తారో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలోనూ ఏటా భారీగా ఆదాయం తగ్గిపోతూ వస్తోంది. అయితే అదేదో ఈ ఏడాదే కొత్త అన్నట్టు ఆర్థిక మంత్రి కరోనాను కారణంగా చూపుతున్నారు. కానీ 2014 నుండి 2021 వరకు ప్రవేశపెట్టిన బడ్జెలను చూసినా ఇదే పరిస్థితి. 2014–-2020 మొత్తం బడ్జెట్ రూ.8,02,521 కోట్లు కాగా వాస్తవ ఆదాయం రూ.6,83,619 కోట్లు మాత్రమే. ఇది కూడా కరోనా వల్లే తగ్గిందా? మొత్తంగా 24.26 శాతం కోత పడింది. ఏటా బడ్జెట్‌‌లో అన్ని శాఖలు, పథకాలకు భారీ కేటాయింపులు చూపిస్తున్నారు. కానీ చివరికి వాస్తవంగా ఖర్చు పెడుతున్నది 75 శాతానికి అటూ ఇటూగానే ఉంటోంది. అంటే ఆ 25 శాతం నిధుల కొరతను వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనుల సంక్షేమానికి, పాఠశాల విద్య, ఉన్నత విద్యకు కేటాయించిన పద్దుల్లోనే కోత పెడుతున్నారు.

రైతులకు మేలు చేసేదిట్లనేనా?

రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం తప్ప.. ఏనాడూ వారి సంక్షేమం పట్ల చిత్తశు ద్ది లేదని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ను చూస్తే అర్థమవుతున్నది. రైతు సంక్షేమం, సాగునీటి రంగాలకు ఎక్కడా ప్రాధాన్యం ఎక్కడా కనిపించలేదు. ఈ సారి రైతు రుణమాఫీకి రూ.5225 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్‌‌లో రూ.6225 కోట్లు కేటాయించగా రూ.25వేలలోపు బకాయిలు ఉన్న 3లక్షల మందికి రూ.4080 కోట్లను మాత్రమే చెల్లించారు. మరి ఈసారి ఎన్ని నిధులు ఖర్చవుతాయో చూడాలి. సాగునీటి రంగానికి కేవలం రూ.16,931 కోట్లు ఎట్ల సరిపోతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు తెచ్చిన అప్పులు తీర్చడానికి 7 వేల కోట్లు, ప్రగతి పద్దుకు 5,878కోట్లు, ఇప్పుడు చేస్తున్న పనులకు 5వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అంటే సర్కారు కేటాయించిన పైసలు ఈ బిల్లులకే ఖాళీ అయిపోతాయి. ఇక మిగతా ప్రాజెక్టుల సంగతేంది? ఈ లెక్కలు చూస్తేనే రైతులను ఎంతగా మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రూ.11 వేల కోట్లు కేటాయించారు. వీటి ఖర్చు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటుందో చూడాలి. స్థలం ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూం పథకం కింద ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ ఎన్నికల టైమ్‌‌లో హామీ ఇచ్చాక ఇది నాలుగో బడ్జెట్‌‌, కానీ ఈ పథకం అమలు ప్రస్తావన మాత్రం లేదు.

చదువులపై చిన్నచూపా?

ఈ బడ్జెట్‌‌లో విద్యారంగానికి నిరాశే మిగిలింది. విద్యకు రూ.13,608 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటిలో సుమారు 90% వేతనాలకే సరిపోతుంది. టీచర్లు, సిబ్బంది, మౌలిక వసతులు లేక, ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. నిరుటి కంటే నిధులు పెరిగినా మొత్తం బడ్జెట్ శాతంతో చూస్తే కోత పడింది. వర్సిటీలపై ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చూపింది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల డెవలప్‌‌మెంట్‌‌కు పైసా కూడా కేటాయించలేదు. ఏడేండ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. టీచర్ల నియామకం లేక కేవలం విద్యా వాలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు.

కరోనా టైమ్‌‌లో హెల్త్‌‌ సెక్టార్‌‌పై నిర్లక్ష్యం తగదు

వైద్య ఆరోగ్య శాఖ కోసం బడ్జెట్‌‌లో పెట్టిన రూ.6295 కోట్లు ఈ కరోనా కాలంలో ఏ మూలకూ సరిపోవు. మరోవైపు ఆరోగ్యరంగానికి చేస్తున్న కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని 15వ ఆర్ధిక సంఘం కూడా అభ్యంతరం చెప్పింది. నేషనల్ హెల్త్‌‌ పాలసీ ప్రకారం మొత్తం బడ్జెట్‌‌లో 8% నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా నిరుడు 4.19% మాత్రమే ఖర్చు చేశారు. ఆరోగ్యం విషయంలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. గత బడ్జెట్‌‌లో మొత్తం నిధుల్లో 3.3% ఆరోగ్యరంగానికి ఇవ్వగా ఈసారి 2.7 శాతంతో సరిపెట్టారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం నిరుటి కంటే 137% అధికంగా నిధులు కేటాయించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న టైమ్‌‌లో హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ను నిర్లక్ష్యం చేయడం తగదు.

యువతను అస్సలు పట్టించుకోలె

ఈ బడ్జెట్‌‌లో యువత సంగతి పట్టించుకోనేలేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు అరకొర నిధులు కేటాయించి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ఊసేలేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదు. ఒక్కొక్కరికి రూ.3 వేల భృతి ఇస్తామంటూ 2019–-20 బడ్జెట్‌‌లో పేర్కొని రూ.1810 కోట్లు కేటాయించారు. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత రెండు బడ్జెట్లలో నిరుద్యోగ భృతి మాటలేదు. టీఎస్పీఎస్సీ వెబ్‌‌సైట్‌‌లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేకపోతుంటే నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తాం? అని ఇటీవల అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్‌‌‌‌కు 2018 ఎన్నికల టైమ్‌‌లో హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం తెలియదా? లేక తాను అధికారంలోకి రావడం కోసం యువతను ఎట్లనైనా మోసం చేయొచ్చనుకున్నారా? 

కేంద్ర నిధులు వాడుకోలేక నిందలు

మొత్తంగా బడ్జెట్‌‌ వాస్తవ ఆర్థిక స్థితికి దూరంగా ఉంది. ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యం కనిపించడం లేదు. కనీసం కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలేకపోవడం, నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపకపోవడం వంటి దయనీయమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సి. తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి టీఆర్ఎస్ సర్కారు అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

బీసీ ఫెడరేషన్లకు పైసా ఇయ్యలె


బడ్జెట్‌‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాటు లభించలేదు. రాష్ట్రంలో 52% ఉన్న బీసీలకు 2.39% మాత్రమే నిధులు కేటాయించారు. బీసీ కుల ఫెడరేషన్లకు మొండిచెయ్యి చూపారు. గత రెండు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌‌మెంట్ ఫండ్స్ పక్కదారిపడుతున్నాయి. బడ్జెట్‌‌లో మస్తు నిధులు ఇస్తున్నట్లు చూపిస్తున్నా, వాస్తవానికి సగం కూడా మంజూరు చెయ్యట్లేదు. నిధుల కేటాయింపులు, మంజూరు, ఖర్చులో అసలు పొంతనే ఉండటం లేదు.

అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా ఉంది


రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రం ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది. విభజన సమయంలో తెలంగాణ అప్పులు 70 వేల కోట్ల లోపే ఉంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు రూ.2.45 లక్షల కోట్లని బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి చెప్పారు. ఇవే కాక మిషన్ భగీరథ, విద్యుత్ రంగం, నీటి ప్రాజెక్టులు వంటి అనేక స్కీమ్‌‌లు, ప్రాజెక్టులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు కలిపితే రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటాయి. 2021–22లో మరో రూ.41,522 కోట్ల అప్పులు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇవికాక, ప్రభుత్వం మార్కెట్ రుణాలను గతంలో కంటే ఎక్కువగా ప్రతిపాదించింది. బాండ్ల విక్రయం ద్వారా రూ.47,500 కోట్లు, బడ్జెట్ పరిధిలో రూ.50 వేల కోట్ల రుణాలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుని రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేయబోతోంది. దీంతో రాష్ట్రంలో ఒక్కొక్కరిపై అప్పు రూ.లక్ష దాటిపోయే చాన్స్ ఉంది. నానాటికి పెరిగిపోతున్న అప్పులు, వడ్డీల భారాన్ని క్రమంగా తగ్గించుకునే రుణ ప్రతిపాదనలు ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. మొత్తం మీద అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా ఉంది తెలంగాణ బడ్జెట్.
                                                                                                                                                                               - కె.లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు