ఏపీ, తెలంగాణ మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఏపీ, తెలంగాణ మధ్య కుదరని ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హోంశాఖ నిర్వహించిన కీలక సమావేశం అసంపూర్తిగా ముగిసింది. చాలా అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తదుపరి మీటింగ్, అందులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ లేకుండానే భేటీ ముగిసింది. విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, కీలక శాఖల సెక్రటరీలు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాట సాగిన మీటింగ్ లో మొత్తం 14 అంశాలపై చర్చించారు. ఇందులో 7 అంశాలు తెలంగాణ, ఏపీకి సంబంధించినవి కాగా.. మరో 7 అంశాలు పూర్తిగా ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. కొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉమ్మడి సంస్థలపై ఖర్చు, ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులపై తెచ్చిన రుణాలను కాగ్ సాయంతో పంచుకోవాలని నిర్ణయించాయి. 

11 అంశాలను లేవనెత్తిన తెలంగాణ.. 

సమావేశంలో మొత్తం 11 అంశాలను మన రాష్ట్రం లేవనెత్తింది. అజెండాలోని ఏడు అంశాలతో పాటు విభజన చట్టంలోని నాలుగు హామీలను ప్రస్తావించింది. మీటింగ్ అనంతరం అంశాల వారీగా ప్రభుత్వ నిర్ణయాలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల్లో 90 సంస్థల విభజనకు షీలా బిడె కమిటీ సిఫార్సులు చేసింది. ఇందులో 53 ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 15 ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో తెలంగాణ అంగీకారం తెలిపినప్పటికీ ఏపీ వ్యతిరేకించింది. ఇక మరో 22 సంస్థల విషయంలో తెలంగాణ సిద్ధంగా లేదు. కొన్ని సంస్థలకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పై హైకోర్టులో కేసు నడుస్తోందని, దీన్ని పరిశీలించాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. 

సింగరేణిలో ఏపీకి వాటా లేదు... 

షెడ్యూలో 10లోని 142 సంస్థల విభజనపై మీటింగ్ లో చర్చ జరిగింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, తెలుగు అకాడమీ కేసులు కోర్టుల్లో ఉన్నట్లు రెండు రాష్ట్రాలు కేంద్రానికి చెప్పాయి. అయితే ఏపీ స్టేట్ కౌన్సిల్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కేంద్రం ఆదేశాలు ఉండాలని తెలంగాణ కోరింది. ఇక సింగరేణి కంపెనీలో ఏపీకి వాటా ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 51శాతం వాటా పూర్తిగా తెలంగాణకే బదలాయించారని స్పష్టం చేసింది. దీని అనుబంధ సంస్థ ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో వాటాల పంపకం మాత్రమే జరగాల్సి ఉందని చెప్పింది. చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజన అంశాన్ని ఏపీ లేవనెత్తగా తెలంగాణ  అభ్యంతరం వ్యక్తం చేసింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని, ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా.. ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.