త్రిభాషా విధానంతో ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి లోకేష్

త్రిభాషా విధానంతో ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి లోకేష్

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం పీక్ స్టేజ్‎కు చేరుకుంది. త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న స్టాలిన్ సర్కార్.. కేంద్రంపై యుద్ధానికి పిలుపునిచ్చింది. త్రిభాషా సూత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా తమపై రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో త్రిభాషా సిద్ధాంతంపై టీడీపీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టూడే నిర్వహిస్తోన్న కాంక్లేవ్‎లో శనివారం (మార్చి 8) మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త్రిభాషా విధానంపై మీ అభిప్రాయమేంటని జర్నలిస్ట్ నారా లోకేష్‎ను ప్రశ్నించారు. లోకేష్ మాట్లాడుతూ.. త్రిభాషా సిద్ధాంతం ద్వారా దక్షిణ రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. త్రిభాషా విధానం ప్రాంతీయ భాషలకు ఎలాంటి హాని కలిగించదని పేర్కొన్నారు. 

ALSO READ | ANU పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

మాతృభాషలను బలోపేతం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. లోకల్ లాంగ్వేజేస్‎ను బలహీనపర్చదన్నారు. త్రిభాషా విధానం హిందీని విధించడం కంటే భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతోందని చెప్పారు. భారతీయ విద్యార్థులు జర్మన్, జపనీస్ వంటి ప్రపంచ భాషలను నేర్చుకోవాలని సూచించారు. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం చాలా అవసరమని లోకేష్ నొక్కి చెప్పారు.

త్రి భాషా విధానం, డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటుండగా.. సౌత్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ త్రిభాషా సిద్దాంతాన్ని సమర్థించడం గమనార్హం. ఏపీలో ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన త్రిభాషా విధానానికి అనుకూలంగా మాట్లాడారు. త్రిభాషా విధానంతో ఎలాంటి ప్రమాదం లేదన్న లోకేష్ వ్యాఖ్యలపై తమిళనాడు నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.