కాంగ్రెస్​కు​ ఎందుకు ఓట్లెయ్యాలె .. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి లేదు : కేసీఆర్

  • 70 సెగ్మెంట్లు తిరిగిన.. ఇంకో 30 తిరిగితే కాంగ్రెస్​ ఊడ్చుకుపోతది 
  • ఆ పార్టీకి 20 సీట్లు రావు కానీ.. డజన్​ మంది సీఎంలున్నరు
  • పట్టిలేని భట్టికి దళితులు ఒక్క ఓటు కూడా వేయొద్దు
  • బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్లే 
  • మధిర, వైరా, డోర్నకల్​, సూర్యాపేట సభల్లో  సీఎం కామెంట్స్​ 

ఖమ్మం/ మహబూబాబాద్ / సూర్యాపేట, వెలుగు:  కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వెయ్యాలె.. ఆ పార్టీకి ఓటు వేస్తే పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్టయితది’ అని సీఎం కేసీఆర్​అన్నారు. 50 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించి, ఇప్పుడు ఒక్క చాన్స్​అడుగుతున్నారని, కాంగ్రెస్​పాలనలో ఎండిన వరి కంకులను, కిరోసిన్​బుడ్డిలను పట్టుకొని అసెంబ్లీకి పోవడం చూశామని, బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఒక్క ఎకరం పొలం కూడా ఎండలేదన్నారు.  ‘‘ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు..

ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి, వలసలు, ఎమర్జెన్సీ పేర జైళ్లలో పడేసుడే కదా.. ఆ రాజ్యంలో ఎవరు బాగుపడ్డరు?  అభివృద్ధి లేదు.. మన్ను లేదు. మనకెందుకు ఆ దుష్ట పాలన’ అని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర, వైరా, మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్, సూర్యాపేటల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్​ పాల్గొని మాట్లాడారు. ‘‘నేను ఇప్పటి దాకా 70 నియోజకవర్గాల్లో పర్యటించిన. ఇంకో 30 కూడా తిరిగితే కాంగ్రెస్​ఊడ్చుకుపోతది. బ్రహ్మాండంగా ఇంకా రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్

​గవర్నమెంట్ వస్తది. రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఈసారి కాంగ్రెస్ కు 20 మించి సీట్లు రావు. కానీ ఆ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రులున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేదేంది ? నియోజకవర్గానికి చుట్టపు చూపుగా ఆర్నెళ్లకోసారి వస్తడు. కమల్​రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతది. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు. దళితుల ఒక్క ఓటు భట్టికి పడొద్దు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు’’ అని విమర్శించారు. 

తెలంగాణలో ప్రతి ఇంచ్ ​కేసీఆర్ దే

‘‘మధిరలో మమ్మల్ని రెండు సార్లు ఓడించారు. అయినా మేం అలగ లేదు. రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్​దే. ఇక్కడున్న  కాంగ్రెస్ మాకు విరోధి, అయినప్పటికీ పక్షపాతంగా వ్యవహరించ లేదు. దళితబంధులో రాష్ట్రంలో నాలుగు మండలాలు తీసుకుంటే, అందులో చింతకానిని ఎంపిక చేసినం. అక్కడ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చినం. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గం మొత్తం హుజూరాబాద్ మాదిరిగానే దళితబంధు అమలు చేయిస్తా’’ అని కేసీఆర్​హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత తెస్తామంటున్నారని, అది భూమాత కాదు.. భూమేత అని విమర్శించారు. ‘‘ఏడెనిమిది మాసాల్లో సీతారామ కంప్లీట్ అయితది. 37 టీఎంసీల సీతమ్మ సాగర్​రిజర్వాయర్​వస్తుంది. అవి కంప్లీట్ అయితే వైరా, మధిరల వైపు కరువు అనేదే తిరిగి చూడదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునక, వజ్రపు తునక లాగా తయారయితది. 365 రోజులు చెరువుల నిండ నీళ్లుంటయి’’ అని చెప్పారు. నీళ్లకు పన్ను విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్​అన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాకు కనీసం మంచినీళ్లివ్వలేదని, ఫ్లోరైడ్ నీళ్లు తాగించారని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘రాజగోపాల్ రెడ్డి పండవెట్టి తొక్కుతమంటుండు.

అహంకారంతో మాట్లాడుతుండు. ఇది ఉద్యమాల గడ్డ. భీం రెడ్డి నరసింహా రెడ్డి లాంటి మహనీయులు పనిచేసిన గడ్డ. ఈ గడ్డ మీ దుర్మార్గుల ఆగడాలేంటో మీరు ఆలోచించాలి’’ అని కోరారు. సూర్యాపేట నియోజక వర్గంలోనే 2 లక్షల15 వేల ఎకరాలు సాగు అవుతున్నదని, మూసీ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు వస్తున్నాయని కేసీఆర్​పేర్కొన్నారు. డోర్నకల్​నియోజకవర్గంలోని కురవి వీరభద్ర స్వామి చాలా పవర్ ఫుల్​ అని రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు కోరమిసాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు. డోర్నకల్ లో రెడ్యానాయక్​ను 8వ సారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన హోదాను మరింత పెంచుతామన్నారు. 

ఇయ్యాల నిర్మలా సీతారామన్​ చెప్పింది..

బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్టే అని కేసీఆర్​అన్నారు. ‘‘మోదీ మోటార్లకు మీటరు పెట్టాలంటున్నడు. నేను పెట్టనన్న. అందుకే రూ. 25 వేల కోట్ల గ్రాంట్ కట్ చేసిండు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇయ్యాల చెప్పింది. అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టిండ్రు.. వీళ్లు పెట్టలేదు. అందుకే 0.5 ఫండ్స్​ కట్ చేసినం.. వీళ్ల నోట్లె మన్నువోసినమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం157 మెడికల్ కాలేజీలు పెట్టింది. మనకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూలు ఇవ్వలేదు. అందుకే బీజేపీకి ఓటు వేయొద్దు’’ అని కోరారు.

పొంగులేటి, తుమ్మలపై ఎటాక్​ 

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్​ విమర్శలు చేశారు. ‘‘గోదావరి నది పారుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ లాంటి ప్రాజెక్టు నిర్మించాలని గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా ఆలోచించారా? మాజీ మంత్రి ఇక్కడ బాగా నరుకుతుండు కదా, ఆయన కూడా సీతారామ లాంటి ప్రాజెక్టు గురించి ఎందుకు ఆలోచించలేదు. ఇంకొంతమంది అహంకారంగా మాట్లాడుతున్నరు. వాళ్ల నోట్ల కట్టలు కూడా హైదరాబాద్ లో దొరుకుతున్నయి. బీఆర్ఎస్​పార్టీవోళ్లని అసెంబ్లీ గడప తొక్కనీయనని మాట్లాడుతున్నడు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గడప తొక్కనివ్వకపోవడానికి వీడెవడు. అసెంబ్లీకి ఎవరిని పంపాలో నిర్ణయించేది మీరు కదా. అసెంబ్లీకి పంపే ఆ ఓటు మీ వద్ద ఉంది కదా. నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలి’’ అని కేసీఆర్​ అన్నారు.