ఇలా మొదలైన బతుకమ్మలో.. డీజే డాన్స్‌‌లేంది?

ఇలా మొదలైన బతుకమ్మలో.. డీజే డాన్స్‌‌లేంది?

మసకబారుతున్న బంధాలు

బిజీ లైఫ్​లో అందరూ ఉద్యోగాల పేరిట ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు. ఈ పండుగ పుణ్యమా అని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా సొంత ఊళ్లకు వెళ్తారు. అందుకే ఇది అనుబంధాల పండుగగా ఉండేది. పాత రోజుల్లో అయితే ఇంట్లో ఉండే అక్కాచెల్లెళ్ల కోసం అన్నలు, తమ్ముళ్లు ఎంతగానో కష్టపడి పూలు తెచ్చేవాళ్లు. ప్రతిరోజు తెల్లవారకముందే తట్టలు, వెదురు గంపలు పట్టుకొని పూలవేట మొదలుపెట్టేవాళ్లు. పంట చేన్ల చుట్టూ తిరిగి గుమ్మడి, బీర, సీత జడ, గడ్డి బంతి పూలు తెంపుకొని వచ్చి ఇచ్చేటోళ్లు. ఇలాంటి వాటివల్ల అక్క, తమ్ముడు, చెల్లి, అన్నల మధ్య అనుబంధం పెరిగేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చాలా తక్కువనే చెప్పాలి. ఆ చిత్రం మారిపోయి ఇప్పుడు కావాల్సిన పూలన్నీ మార్కెట్​కు వెళ్లి కొంటున్నారు. 

డీజే సౌండ్స్​ 

బతుకమ్మ పండుగ అనగానే అందరికీ పాటలు గుర్తుకొస్తాయి. బతుకమ్మ పాటలు వినసొంపుగా హాయిగా ఉంటాయి. సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఇది.  మహిళలు, పిల్లల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆడవారి కష్టసుఖాల గురించిన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఏడేడు తరాల కథలు, గాథలను పాటల రూపంలో గుర్తు చేసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్ని, ప్రకృతి వైపరీత్యపు కడగండ్లను నెమరేసుకుంటారు. కుటుంబ జీవనంలోని సంతోషాలను, పిల్లల ముద్దు ముచ్చట్లను, పంటచేల వయ్యారాలను, వీరుల త్యాగాలను, దేవతల దయను, శృంగారం, కరుణ, హాస్యం బతుకమ్మ పాటల్లో కలగలపి పాడుతారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన బతుకమ్మ పాటల స్థానంలోకి ఇప్పుడు డీజే పాటలు వచ్చి చేరుతున్నాయి. పరిస్థితులు మారిపోయి ఈ టైంలో పువ్వులకు ఎంత డిమాండ్ ఉంటుందో డీజే పాటలకు అంతే డిమాండ్ ఏర్పడుతోంది. 

ప్లాస్టిక్ పూలు

నా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా దోస్తులంతా పోటీ పడి పూలను తెచ్చేవాళ్లం. బంజరు భూములు, కంచెలు, చెరువు కట్టలపై తంగేడు, గునుగు పూలు మస్తు దొరికేవి. మా ఊరి పక్కనే చెరువులో తామర, అల్లు పూలు ఉండేవి. ఈత కొట్టి మరీ పూలు కోసి తెచ్చేటోళ్లం. మట్టి, మొరం కోసం చెరువులన్నీ తవ్విండ్రు. మైనింగ్‌‌‌‌ వల్ల గుట్టలు మాయమై పూల జాతి మొక్కలు కనుమరుగైనయ్. ఇప్పుడు బతుకమ్మ అంటే ప్లాస్టిక్ పూలు మాత్రమే.‒ ఎలమద్రి కిరణ్, జూకల్, చిట్యాల

 .. ఇలా మొదలైంది

బతుకమ్మ పండగ వస్తుందంటే చాలు తెలంగాణ పల్లెల్లో తెలియని ఉత్సాహం కనిపిస్తుంటుంది. మనవాళ్లకు బతుకమ్మ అంటేనే పెద్ద సంబురం. ప్రతీ రోజు ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించుకుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకొస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలకు అత్తగారింటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయనంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడపిల్లా ‘‘ఎప్పుడు పుట్టింటికి వెళ్తానా? పుట్టింటి నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా? తనను తీసుకెళ్ళడానికి అన్నదమ్ములు ఇంకా రాలేదే..’’ అని ఎదురుచూస్తుంటుంది. 

ఎన్నో ప్రత్యేకతలు ఉన్న బతుకమ్మ పండుగను దాదాపు వెయ్యేళ్లుగా జరుపుకుంటున్నారని చరిత్రకారులు చెప్తున్నారు. అక్కడక్కడ దొరికిన శాసనాల ప్రకారం.. వందల ఏండ్ల నుంచే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఉందని తెలుస్తోంది. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

 ‘‘నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామాల్లో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్లు చేసే అకృత్యాలకు నలిగిపోయి, ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లను తలచుకొని తోటి మహిళలు ఈ పండుగ చేసుకునేవాళ్లు. అందుకే వాళ్లకు ప్రతీకగా పూలను పేర్చి ‘బతుకవమ్మా...’ అంటూ దీవిస్తూ పాటలు పాడేవాళ్లు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...’ పాటల వెనుక ఉండే మర్మం ఇదే’’ అని అంటున్నారు చరిత్రకారులు. 

బతుకమ్మ పండుగ వెనుక ఇంకా చాలా కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో మరో  కథ ఉంది. ‘ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా...’ అని దీవించారట. అలా ప్రతి ఏటా బతుకమ్మను కీర్తిస్తూ పండుగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ఈ పండుగ సందర్భంగా స్త్రీలంతా వాళ్లకు ఎలాంటి ఆపదలు రాకూడదని, తమ భర్తలు, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను వేడుకుంటారు.

ధర్మాంగదుడు 

దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక ఎన్నో పూజలు పునస్కారాలు చేశాడు. ఆ పూజల వల్ల ఆయన భార్య గర్భవతి అయ్యిందట. ఆమెకు లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఒక కూతురు పుట్టింది. అయితే.. ఆ బిడ్డ పసితనం నుంచే ఎన్నో గండాలు ఎదుర్కొని గట్టెక్కింది. అందుకే తల్లితండ్రులు ఆ పాపకు ‘బతుకమ్మా’ అని పేరుపెట్టారు. అప్పటినుంచి యువతులు మంచి భర్త దొరకాలని కోరుతూ బతుకమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తోందనే మరో కథ ప్రచారంలో ఉంది. 

బృహదమ్మ

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వాళ్లకు  వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవాళ్లు. అదే టైంలో చోళులకు, రాష్ట్రకూటులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతిచ్చారు. వేములవాడలో అప్పటికే రాజరాజేశ్వర ఆలయం ఉంది. ప్రజలతోపాటు చోళరాజులు కూడా రాజరాజేశ్వరి అమ్మవారిని కొలిచేవాళ్లు. పరాంతక సుందర చోళుడు రాజరాజేశ్వరి అమ్మవారి పేరు మీదుగా తన కొడుక్కి రాజరాజ అని పేరు పెట్టుకున్నాడు.  ఆ రాజరాజ చోళుడు కొడుకు రాజేంద్ర చోళుడు. 

రాజరాజ చోళుడు వేములవాడను పాలిస్తున్న చాళుక్య రాజు సత్యాస్రాయపై యుద్ధం చేశాడు. ఆ టైంలో రాజేంద్ర చోళుడు సేనాధిపతిగా ఉండి గెలిపించాడు. తర్వాత ఆ విజయానికి గుర్తుగా వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి.. అందులోని భారీ శివలింగాన్ని తీసుకెళ్లి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. అప్పటికే రాజరాజేశ్వరికి భక్తుడైన రాజరాజ చోళుడు.. తన కొడుకు ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి క్రీస్తు శకం1006లో తంజావూరులో బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళుడు. దాని నిర్మాణం1010లో పూర్తయ్యింది. 

ఈ విషయాన్ని తమిళ శిలాశాసనాల్లో కూడా చోళ రాజులు చెప్పారు. రాజరాజేశ్వరి ఆలయంలోని శివలింగాన్ని పార్వతి(అప్పట్లో అమ్మవారిని బృహదమ్మగా పిలుచుకునే వాళ్లు) నుంచి వేరుచేసి తీసుకెళ్లటం తెలంగాణ ప్రజలను కలచివేసింది. దాంతో తమ బాధను చోళ రాజులకు చెప్తూ.. మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ చేయడం మొదలుపెట్టారు. అందుకే శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతుంటారు. అలా వెయ్యేళ్ల నుంచి ప్రతి ఏడాది పండుగ చేస్తున్నారు. బతుకమ్మ పేరు కూడా ‘బృహదమ్మ’ అనే పేరు నుంచి వచ్చిందేనని చరిత్ర చెప్తోంది.

దీపావళి వేళ.. బతుకమ్మ కళ

సాధారణంగా దీపావళి అంటే ఎవరికైనా గుర్తొచ్చేది లక్ష్మీదేవి నోములు, దీపాల కాంతులు, టపాసుల చప్పుళ్లు, ఇంట్లో పిండి వంటలు. కానీ సీతంపేటలో మాత్రం దీపావళి సమీపిస్తుంటేనే తంగేడు, గునుగు పూల కళ కనిపిస్తుంది. నేతకాని కుటుంబాలు బతుకమ్మలు పేర్చడానికి పోటీపడతారు. మూడు రోజుల పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక వాళ్లంతా బతుకమ్మలతో ఊరి చివరనున్న చెరువు దగ్గర ఆడి, పాడతారు. దీపావళినాడు మొదటిరోజు సంప్రదాయం ప్రకారం గ్రామ సమీపంలోని గంగ(చెరువు)కు వెళ్తారు. అక్కడి నుంచి పవిత్రమైన రేగడి మట్టిని తెచ్చి జోడెడ్ల బొమ్మలు తయారుచేస్తారు. వాటిని తాము పండించిన ధాన్యంతో చేసిన పిండి వంటలతో అలంకరించి, పూజలు చేస్తారు. 

ఆ తర్వాత రెండో రోజు వాటిని కోలాట నృత్యాలతో పిల్లాపాపలతో ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడో రోజు నేతకాని కుటుంబాలకు చెందిన ఆడ, మగ అందరూ కలిసి బతుకమ్మలు పేర్చి సాయంత్రం ఆడి, పాడతారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత తాము పండించిన ధాన్యంతో తయారుచేసిన పిండి వంటకాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా సీతంపేట నేతకాని వాళ్లు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బతుకమ్మ సంబరాలను దీపావళి వేళ చేసుకుంటారు.  

జగిత్యాలలో రెండుసార్లు

జగిత్యాల జిల్లాలో బతుకుమ్మ పండుగ రెండుసార్లు చేసుకుంటారు. ఆడబిడ్డలు అత్తారింట్లో, తల్లిగారింట్లో.. రెండు చోట్లా పండుగ చేసుకోవాలని ఈ సంప్రదాయం మొదలుపెట్టారు. జిల్లాలోని సగం ఊళ్లలో దసరాకు ముందు పండుగ చేస్తారు. మిగతా ఊళ్లలో దసరా తర్వాత చేస్తారు. జగిత్యాల, మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లో దసరాకు ఒకరోజు ముందు బతుకమ్మ పండుగ చేస్తారు. దసరా అనంతరం జగిత్యాల జిల్లాలోని రాయికల్, మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో దసరా తర్వాత పండుగ చేస్తారు. 

ఆచార సంప్రదాయాలు

బతుకమ్మ పండుగలో మరో పరమార్థం కూడా ఉంది. తంగేడు, గునుగు, గుమ్మడి ఆకులు, పసుపు ముద్ద, బంతి లాంటి పూలను బతుకమ్మగా పేర్చి చివరకు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆకులు, పూలు నీళ్లలో నాని మెత్తబడి కుళ్ళిపోతాయి. తర్వాత నీటి అడుగుకు వెళ్లి మట్టిలో కలుస్తాయి. దీంతో ఆ మట్టి సారవంతం అవుతుంది. వేసవిలో చెరువు ఎండినప్పుడు రైతులు ఆ మట్టిని పొలాల్లో చల్లుతారు. అలా పొలాలు సారవంతం అవుతాయి. 

ఈ పండుగ ప్రాంతానికో రూపంలో ఉంటుంది. అడవులు ఎక్కువగా ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ పండుగను అంతగా జరుపుకోరు. పాలమూరు జిల్లాలోని ఒక వైపు ఊళ్లల్లోనే ఎక్కువగా చేస్తారు. హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో అక్కడి ప్రజలు దీపావళి టైంలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిచోట్ల అంతగా జరగనప్పటికీ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లోని మాచర్ల, కంభంపాడు, కారెంపూడి గ్రామాల్లో ఘనంగా చేస్తారు.

డీజే డాన్స్‌‌లేంది?

బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని ఆరాధించే పండుగ. చాలా సహజత్వంతో నిండినది. ఈ పండుగ వచ్చిందంటే పల్లెటూళ్లలో సందడి ఉండేది. ఇప్పుడు ఆ ఉత్సాహం కరువైంది. బతుకమ్మ పాటలకు బదులు డీజే డాన్స్‌‌‌‌లు వచ్చినయ్‌‌‌‌. ఎప్పుడుపడితే అప్పుడు ఎక్కడపడితే అక్కడ బతుకమ్మను ఆడి పండుగ గొప్పతనాన్ని తగ్గిస్తున్నారు. 
ప్రకృతి పూల స్థానంలో కృత్రిమ పూలు వచ్చినయ్​. బతుకమ్మ పండుగ సహజత్వాన్ని కోల్పోతోంది. 
సాదు కుమారస్వామిశాయంపేట, హనుమకొండ

గడ్డి మందుల వాడకం పెరిగి... 

ప్రకృతిలో దొరికే పూలతో బతుకమ్మ ఆడేటోళ్ళం. మా ఊళ్లో ఎక్కడ చూసినా తంగేడు, గునుగు పూల చెట్లు కనిపించేవి.  పొలాలు, కంచెలు, చెరువు కట్టలపై ఎన్నో పూలు దొరికేవి. అల్లి, తామర పూలు చెరువులు, కుంటల్లో దొరికేవి. ఇప్పుడు గడ్డి మందులు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాల వాడకం ఎక్కువైంది. దీంతో సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే పూలు కరువైపోయినయ్. బంతిపూలు, కృత్రిమ పూలతో బతుకమ్మను తయారుచేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినయ్‌‌‌‌.
‒ కరుణ, చిట్యాల, భూపాలపల్లి