
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 8 మండలాల్లో సమస్య
- 95 గ్రామాల్లో చేతిపంపులే దిక్కు
- తెగిపోయిన మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్లు
- కొట్టుకుపోయిన త్రీ ఫేజ్ కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్స్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రిడ్ నుంచి తాగునీరు సప్లయ్ చేసే మెయిన్లైన్లు కొట్టుకుపోయాయి. అలాగే గణపురం గ్రిడ్ దగ్గర మోటార్లకు త్రీ ఫేజ్ కరెంట్ సప్లయ్ కావట్లేదు. వరదలకు వేలాదిగా కరెంట్ పోల్స్, వందలాదిగా ట్రాన్స్‌ఫార్మర్స్ కొట్టుకుపోయాయి. దీంతో 95 గ్రామాల ప్రజలకు బోరు బావులే దిక్కయ్యాయి. డబ్బులున్నవాళ్లు వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్నారు.
8 మండలాలు.. 95 గ్రామాలకు నీళ్లు బంద్
భూపాలపల్లి జిల్లాలోని గణపురం గ్రిడ్ నుంచి గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, గోరికొత్తపల్లి మండలాలకు మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ చేస్తారు. భారీ వర్షాలకు ఈ సబ్ డివిజన్‌లో 105 చెరువులు తెగిపోయాయి. చలివాగు, మోరంచవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. మోరంచపల్లె దగ్గర మెయిన్పైప్లైన్ తో పాటు 25 చోట్ల పైప్‌లైన్లు కొట్టుకుపోయాయి. దీంతో ఈ ఆరు మండలాలకు నాలుగు రోజులు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మహాముత్తారం మండలం కోనంపేటలోని వాటర్ గ్రిడ్ ప్లాంట్ సమీపంలో వాటర్ లీకేజీ కారణంగా ఒక్కరోజుతాగునీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ఆ లీకేజీ రిపేర్ల పనులు ఇంకా చేస్తున్నారు.
ములుగు జిల్లాలోని రామప్ప గ్రిడ్ నుంచి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలకు వాటర్ సప్లయ్ చేస్తారు. 26వ తేదీన అధిక వర్షంతో పవర్ సప్లై లేక ఆ ఒక్క రోజు గ్రిడ్ పనిచేయలేదు. దీంతో ఆ రోజు నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో భారీ వర్షాల కారణంగా మిషన్ భగీరథ పైపులు కొట్టుకుపోవడంతో నాలుగు రోజులుగా నీళ్లు బందయ్యాయి. ములుగులో మాత్రం యథావిధిగా నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి మండలంలో జంపన్న వాగు వరద ఉధృతికి పైప్‌లైన్లు కొట్టుకుపోయి ఏజెన్సీలోని 20 గ్రామాలకు తాగునీరందట్లేదు. మొత్తంగా రెండు జిల్లాల్లో కలిపి 8 మండలాల్లో 95 గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు.
త్రీఫేజ్ కరెంట్ కష్టాలు
వరదలకు భూపాలపల్లి, ములుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మోరంచ, చలివాగు, జంపన్నవాగులు పొంగిపొర్లాయి. దీంతో రెండు జిల్లాల్లో కలిపి మొదట 37 గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. మండలకేంద్రాలలో కూడా కరెంట్ సప్లయ్ లేకుండా పోయింది. 2,780 కరెంట్ స్తంభాలు కూలిపోగా, 450 ట్రాన్స్‌ఫార్మర్లు నీళ్లల్లో కొట్టుకుపోయాయి. దీంతో ట్రాన్స్ కో ఆఫీసర్లు ఫస్ట్ సింగిల్ ఫేజ్ కరెంట్ సప్లయ్‌పై దృష్టి పెట్టారు. గడిచిన మూడు రోజుల్లో అన్ని మండలకేంద్రాలకు, మైదాన ప్రాంతాల్లోని ఏరియాకు కరెంట్ పునరుద్ధరించారు.
తాడ్వాయి, ఏటూరునాగారం ఏజెన్సీలోని కొండాయి, మల్యాల వంటి రిమోట్ ఏరియాల్లోని ఐదు గ్రామాలకు ఇంకా కరెంట్ సప్లయ్ కావట్లేదు. త్రీ ఫేజ్‌కరెంట్‌సప్లయ్ లేక గణపురం మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద మోటార్లు పనిచేయట్లేదు. అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ విద్యుత్ మోటార్లకు త్రీ ఫేజ్ కరెంట్ రావట్లేదు. మరో రెండు, మూడు రోజుల్లో రెండు జిల్లాల్లో త్రీ ఫేజ్ కరెంట్ సప్లయ్ చేస్తామని ట్రాన్స్‌కో ఆఫీసర్లు
చెబుతున్నారు.
చేతిపంపు నీళ్లు తాగుతున్నం!
గ్రామంలో నీళ్లు రావట్లే. మంచినీళ్లు లేక చేతిపంపు నీళ్లు తాగుతున్నం. గతంలో బావి నీళ్లు ఇచ్చేటోళ్లు. మిషన్ భగీరథ వచ్చినప్పటినుంచి అవి బందయినయ్. వెంటనే అధికారులు స్పందించాలి. భగీరథ నీళ్లతో పాటు, బావి నీళ్లు కూడా అందుబాటులో ఉంచాలి. -
ఉమ, నవాబుపేట ఎంపీటీసీ, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా
నాలుగు రోజుల నుంచి నీళ్లొస్తలేవు
నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవ్. చేతి పంపులు పనిచేస్తలేవు. చేద బావుల్లో నీళ్లు వాడుకునేట్టు లేవు. ఊరోళ్లంతా ఒకే ఒక్క బోరుబావిపై ఆధారపడ్డారు. కరెంటు సమస్యతో ఆ బోర్ కూడా నడుస్తలేదు. తాగడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కూడా నీళ్లులేవ్. తాగునీటి కోసం రెండు కి.మీ దూరంలో ఉన్న మొగుళ్లపల్లికి వెళ్లి మినరల్ క్యాన్ కొని తెచ్చుకుంటున్నరు.
‒ గాలి చంద్రమౌళి, అంకుశాపురం సర్పంచ్, మొగుళ్లపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా