ఉద్యోగ సంఘాల లీడర్లు ఉన్నరా? లేరా?

తెలంగాణ పోరాటంలో మేము సైతం అంటూ ముందుండి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సొంత రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా వారి కోసం నోరు మెదిపే దిక్కు లేకుండా పోయింది. మంత్రుల నుంచి చోటా మోటా లీడర్ల దాకా మహిళా ఉద్యోగులను కించపరుస్తున్నా ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారు? పదిహేను తారీఖు దాకా జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితులు నడుస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడికి పోయింది పోరాట స్ఫూర్తి?! అసలు రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారా? లేరా?.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, అమరుల ఆశయ సాధన కోసం, స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కని రోడ్డు లేదు, మోయని జెండా లేదు, చెయ్యని పోరాటం లేదు. రాస్తారోకోలు, రైల్ రోకోలు, సడక్  బంద్​లు, విద్యా సంస్థల బంద్​లు చేపట్టి.. కులాలు, మతాలు, వర్గాలన్నింటికీ అతీతంగా ప్రజల పక్షాన నిలబడి ముందుకు కదిలారు. పోరాటంలో కలబడి, సకల జనుల సమ్మెతో సమైక్య పాలకుల మెడలు వంచి, ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకున్నారు. స్వరాష్ట్రం వచ్చి ఆరేడు ఏండ్లయినా ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. పాలకులు చేసిన నిర్ణయాలను, పాలకులు ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయి వరకు ప్రజలకు చేరవేసే గురుతర బాధ్యతను పోషించే ఉద్యోగులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. బాధలు తీరుతాయనే భరోసాతో ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన యావత్ తెలంగాణ ఉద్యోగులు.. ఇప్పుడు పాలకుల అడుగులకు మడుగులొత్తే ఉద్యోగ సంఘాల నాయకుల వైఖరి వల్ల తలదించుకునే 
పరిస్థితి వచ్చింది. 

జీతాలు లేటవుతున్నా స్పందించరా?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదిహేనో తారీఖు దాకా జీతాలే రావడం లేదు.. అయినా ఉద్యోగ సంఘాల లీడర్లు నోరెందుకు మూసుకుంటున్నారో అర్థం కావడం లేదు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఒకటో తేదీనో, రెండో తేదీనో, చివరికి ఐదో తారీఖు లోపే జీతాలు అందేవి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ తారీఖున జీతాలు వస్తాయో తెలియడం లేదు. పదిహేనో తారీఖు దాకా ఎదురుచూడాల్సి వస్తోంది. దీనివల్ల రేషన్​కు, రెంటుకు, పిల్లల స్కూల్​ ఫీజులకు, బ్యాంక్ లోన్లకు, పాలవాడికి, పని మనిషికి సకాలంలో పైసలిచ్చుకోలేక మొఖం చాటేసే పరిస్థితి ఉద్యోగులకు ఎదురవ్వడం చాలా బాధాకరం. చివరకు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్​ డబ్బులో, ఎరియర్స్ డబ్బులో, సప్లిమెంటరీ బిల్లుల డబ్బులో సకాలంలో వస్తాయంటే వాటికి కూడా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.  

ప్రమోషన్లు, బదిలీలు లేకున్నా మాట్లాడరా?

ప్రమోషన్స్ రాకున్నా,- బదిలీలు లేకున్నా అడిగే ఉద్యోగ సంఘాల నాయకులే కరువయ్యారు. గతంలో నెలకొక్కసారో, సంవత్సరానికి ఒక్కసారో ప్రమోషన్స్  ఉండేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం ఏండ్లు గడుస్తున్నా చాలా మంది ఉద్యోగులు పదోన్నతులకు నోచుకోవడం లేదు. ప్రమోషన్లు పొందకుండానే రిటైర్డ్ అయిన సందర్భాలు కోకొల్లలు. ఇది విద్యా వ్యవస్థలోనైతే మరీ దారుణం. సెకండరీ గ్రేడ్ టీచర్​గా నియామకమై 30 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా సెకండరీ గ్రేడ్ టీచర్ గానే రిటైర్​ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న సర్వీస్ రూల్స్​ను పరిష్కరించే ప్రయత్నం గత ప్రభుత్వాలే కాదు..  ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయకపోవడం దురదృష్టకరం. రావాల్సిన డీఏ సంగతి దేవుడెరుగు. మూడేండ్ల కిందట్నే అందాల్సిన పీఆర్సీ కోసం ఇప్పుడా, అప్పుడా అని ఊరిస్తూనే ఉండడం, దాని కోసం ప్రతి ఉద్యోగి కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి రావడం బాధాకరం. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత జీవో  ఇచ్చినట్లే ఇచ్చి.. దాన్ని అసంపూర్తిగా, అసమగ్రంగా, అసంబద్ధంగా, ఉద్యోగులంతా ఇంకా డోలాయమానంలోనే కొట్టుమిట్టాడేలా వదిలేశారు. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయాలు ఆశనిపాతంగా పరిణమిస్తున్నాయి. 

మహిళలను కించపరుస్తుంటే ఖండించరా?

మహిళా ఉద్యోగులను కించపర్చినా మాట్లాడే ఉద్యోగ సంఘం నాయకులు లేకుండా పోయారు. అనేక సందర్భాల్లో,  అనేక సమావేశాల్లో మంత్రుల నుంచి మొదలుకొని చోటా మోటా లీడర్ దాకా మహిళా ఉద్యోగులను కించపర్చిన సంఘటనలను ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇలాంటి అవమానాలు ఎన్నో జరిగినా ఒక్క ఉద్యోగ సంఘం నాయకుడు కూడా పెదవి విప్పకపోవడం, కనీసం ఖండించక పోవడం చాలా దారుణం. పైగా బాధితుల పక్షాన నిలవాల్సిన సంఘాల నాయకులే పాలకులకు వంత పాడడం, పాలకుల పక్షాన నిలవడం వారిది ఏ నీతో వారే ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా తామూ ఉద్యోగులమనే భావనను ఉద్యోగ సంఘాల లీడర్లు  మరిచిపోతున్నట్లుంది. 

ఫ్రెండ్లీ గవర్నమెంట్.. మాటలకే పరిమితం

స్వరాష్ట్ర కల సాకారమైనా ఉద్యోగుల హక్కులు కాలరాయబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని స్వయంగా సీఎం కేసీఆరే ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ అది మాటలకే పరిమితమైనట్లుగా ఉంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ఉద్యోగుల హక్కుల కోసమే, ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకుంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నోరు మెదపక పోవడం చాలా దురదృష్టకరం. ఒకప్పటి ఉద్యోగ సంఘాల నాయకత్వం హక్కుల సాధన కోసం, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పోరాట కార్యాచరణతో ప్రభుత్వాలనే గడగడలాడించాయి. అలాంటి మెరుపైన పోరాట స్ఫూర్తిని సకల జనుల సమ్మె రూపంలో మనం చూశాం. కానీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకులు స్వప్రయోజనాల కోసమో, చిన్నచిన్న నామినేటెడ్ పదవుల కోసమో పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ ఉద్యోగుల పోరాటాలను, ఉద్యమ ఆకాంక్షలను తాకట్టు పెడుతున్నారు. నాలుగు రోజులు ఉద్యోగ సంఘ నాయకుడిగా చెలామణి అవుతున్నాడో లేదో.. ఇంతలోనే ఎమ్మెల్యే సీటు కోసమో, ఎమ్మెల్సీ సీటు కోసమో, నామినేటెడ్​ పదవి కోసమో పాలకుల దగ్గర వెంపర్లాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎన్నటికీ శ్రేయస్కరం కాదు. ఉద్యోగ సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న ప్రతి నాయకుడూ ఇకనైనా ఉద్యోగులమనే ప్రాథమిక భావనను మర్చిపోకుండా, ఉద్యోగుల హక్కుల సాధన కోసం, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఉద్యోగుల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాం.
జాబ్స్​ పోతుంటే 

ఏం చేస్తున్నరు?

అవసరం తీరాక ప్రభుత్వం ఉద్యోగులను వదిలించుకుంటోంది. మొన్నటిదాకా అవినీతి మరకనంటించి రెవెన్యూ సిబ్బందిని.. ఇప్పుడు ఆపద సమయంలో సేవలందించిన మెడికల్​ సిబ్బందిని, ఉపాధి హామీ సిబ్బందిని, మిషన్ భగీరథ సిబ్బందిని.. రేపో మాపో పంచాయతీ సిబ్బందిని.. ఇలా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతున్నా ఎవరూ మాట్లాడరెందుకు? ఉద్యోగుల హక్కుల కోసం మేమున్నామని చెప్పే సంఘాల నేతలు ఏం చేస్తున్నారు? ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని దీనస్థితిలో ఉన్న కింది స్థాయి ఉద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దర్శనం దేవేందర్,
ఎగ్జిక్యూటివ్​ మెంబర్,తెలంగాణ ఇంటలెక్చువల్​ ఫోరం